అదుపులో డయేరియా!
ABN , Publish Date - Sep 13 , 2025 | 01:22 AM
న్యూరాజరాజేశ్వరిపేటలో డయేరియా పరిస్థితి అదుపులోనే ఉంది. కానీ అక్కడ సంభవిస్తున్న కొత్త కేసులు స్థానికులను కొంత కలవర పెడుతున్నాయి. శుక్రవారం తాజాగా మరో వ్యక్తి మృతి చెందాడు. అయితే ఈ మరణాలకు డయేరియాకు సంబంధం లేదని వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు. స్థానికులు మాత్రం వారు వాంతులు, విరేచనాలతో చనిపోయారని అంటున్నారు. తాజా మరణానికి డయేరియా కారణం కాదని, అతిగా మద్యం తాగడం వల్లేనని వైద్యులు పేర్కొంటున్నారు.
న్యూరాజరాజేశ్వరిపేటలో తగ్గిన తీవ్రత
చనిపోయిన మరో వ్యక్తి
డయేరియా కాదంటున్న అధికారులు
483 నీటి శాంపిళ్లలో కనిపించని కలుషితం
ఇంకా రాని బయాలజీ, బ్యాక్టీరియాలజీ నివేదిక
న్యూరాజరాజేశ్వరిపేటలో డయేరియా పరిస్థితి అదుపులోనే ఉంది. కానీ అక్కడ సంభవిస్తున్న కొత్త కేసులు స్థానికులను కొంత కలవర పెడుతున్నాయి. శుక్రవారం తాజాగా మరో వ్యక్తి మృతి చెందాడు. అయితే ఈ మరణాలకు డయేరియాకు సంబంధం లేదని వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు. స్థానికులు మాత్రం వారు వాంతులు, విరేచనాలతో చనిపోయారని అంటున్నారు. తాజా మరణానికి డయేరియా కారణం కాదని, అతిగా మద్యం తాగడం వల్లేనని వైద్యులు పేర్కొంటున్నారు.
(ఆంధ్రజ్యోతి - విజయవాడ):
న్యూరాజరాజేశ్వరిపేటలో శుక్రవారం పెద్దగా కొత్త కేసులు నమోదు కాలేదు. అయితే పరిస్థితి అదుపులో ఉందనుకుటున్న సమయంలో మరొకరు చనిపోయారు. మసీదు ప్రాంతానికి చెందిన గద్వాల నరసింహ వీధుల్లో బ్యానర్లు కట్టే పని చేస్తుంటాడు. ఆయన కుటుంబం వేరే ఊరు వెళ్లడంతో ఆయన ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు. రెండు రోజులుగా నరసింహారావు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఇంట్లోనే ఉండిపోయాడు. కుటుంబ సభ్యులు ఊరి నుంచి శుక్రవారం వచ్చి చూసే సరికి ఆయన చాలా నీరసంగా కనిపించాడు. అతడిని వెంటనే కేర్ అండ్ షేర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి తరలించారు. ఇక్కడి సిబ్బంది ప్రాథమిక వైద్యంజేసి ఉన్నత చికిత్స కోసం అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. వైద్యాధికారులు మాత్ర అతడు డయేరియా లక్షణాలతో చనిపోలేదని చెబుతున్నారు. తీవ్రంగా మద్యం తాగడం వల్ల ప్రాణాలు కోల్పోయాడని స్పష్టం చేస్తున్నారు. డయేరియా మొదలైన తర్వాత ఇద్దరు చనిపోయారు. ఆ మరణాలకు కూడా డయేరియాతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. మంత్రులు సత్యకుమార్ యాదవ్, నారాయణ న్యూఆర్‌ఆర్ పేట ప్రాంతంలో పర్యటించి స్థానికులకు భరోసా ఇచ్చారు. అధికారులు, ప్రజాపప్రతినిధులు భరోసా ఇస్తున్నప్పటికీ అక్కడ జరుగుతున్న పరిణామాలతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ప్రభుత్వాస్పత్రిల్లో ప్రస్తుతం 72 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో 13 మందిని శుక్రవారం ఇళ్లకు పంపించారు. పాత ప్రభుత్వాసుపత్రిలో తొమ్మిది మంది, కొత్త ప్రభుత్వాసుపత్రిలో 53 మంది ఉన్నారు. వారిలో 25 మందిని శనివారం ఇళ్లకు పంపిస్తామని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు.
ఆ రెండు నివేదికలే కీలకం
న్యూఆర్‌ఆర్ పేటలో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి కారణం ఏమిటన్నది ఇంకా తెలియలేదు. నీటి ద్వారా వచ్చిన వైరస్ కారణంగా ఈ పరిస్థితి వచ్చిందని భావిస్తున్నప్పటికీ అందుకు తగిన ఆధారాలు లభించలేదు. అధికారులు న్యూఆర్‌ఆర్‌పేటలో మొత్తం 485 నీళ్ల శాంపిల్స్‌ను సేకరించారు. వాటిలో 483 శాంపిల్స్‌కు సంబంధించిన నివేదికలు వచ్చాయి. అవన్నీ నెగిటివ్ అని వచ్చాయి. ఇంకా మరో రెండు శాంపిళ్ల పరీక్షల నివేదికలు రావాల్సి ఉంది. దీంతోపాటు బయాలజీ, బ్యాక్టీరియాలజీ పరీక్షల నివేదికలు రావాల్సి ఉంది. ఈ రెండు నివేదికల్లో ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన కారణం తెలియవచ్చని అధికారులు భావిస్తున్నారు. మరోపక్క అధికారులు న్యూఆర్‌ఆర్‌పేటలో ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సర్వే చేయిస్తున్నారు. ఇంట్లో ఎంతమంది నివసిస్తున్నారు, వారికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి వంటి వివరాలను సిబ్బంది తెలుసుకుంటున్నారు. కేర్ అండ్ షేర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి శుక్రవారం మొత్తం 150 మంది వచ్చారు. వారిలో 45 మందికి లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. న్యూఆర్‌ఆర్‌పేట పక్క నుంచే బుడమేరు వాగు ప్రవహిస్తోంది. వాస్తవానికి ఒకప్పుడు ఇది చాలా స్వచ్ఛంగా ఉండేది. చుట్టూ జనావాసాలు పెరిగిన తర్వాత స్వచ్ఛతను కోల్పోయింది. ఈ బుడమేరులో ఉన్న మురుగు భూగర్భ జలాల్లోకి ప్రవేశించడం ద్వారా ఈ పరిస్థితి వచ్చిందా అన్న కోణంలో పరీక్షలు చేయించబోతున్నారు. ఇదే విషయాన్ని మంత్రులు ప్రజలకు చెప్పారు.