Share News

డయేరియా ‘డర్‌’!

ABN , Publish Date - Sep 12 , 2025 | 01:27 AM

నగర వాసులను డయేరియా భయం వెంటాడుతోంది. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది. న్యూరాజరాజేశ్వరిపేటలో ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఒకరికి మాత్రమే నీళ్ల విరేచనాలు అవుతున్నాయి. పిల్లలు, తల్లి కలిసి నిద్రపోయినా తల్లి మాత్రమే విరేచనాల బారిన పడింది. కొన్ని చోట్ల పిల్లలపై కూడా దీని ప్రభావం ఉంటుంది. దీనికి కారణం ఏమిటన్నది తెలియడం లేదు. రెండు, మూడు రోజులుగా ఇలా నీళ్ల విరేచనాలు అవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీన్ని డయేరియా అని వ్యవహరిస్తున్నప్పటికీ వైద్యులు మాత్రం జీఈ (గ్యాసో్ట్ర ఎంట్రైటీస్‌) అని చెబుతున్నారు. మూడుకు మించి విరేచనాలు అయితే దాన్ని జీఈగా పరిగణించాలని స్పష్టం చేస్తున్నారు.

డయేరియా ‘డర్‌’!

- పెరుగుతున్న బాధితులు

- కొత్త ప్రభుత్వాస్పత్రిలో 40 మంది

- పాత ప్రభుత్వాస్పత్రిలో ఏడుగురు చేరిక

- ప్రమాదం లేదంటున్న వైద్యులు

- న్యూరాజరాజేశ్వరిపేటలో అధికారుల పర్యటన

- తాగునీటి సరఫరా బంద్‌

- ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా

(ఆంధ్రజ్యోతి - విజయవాడ):

నగర వాసులను డయేరియా భయం వెంటాడుతోంది. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది. న్యూరాజరాజేశ్వరిపేటలో ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఒకరికి మాత్రమే నీళ్ల విరేచనాలు అవుతున్నాయి. పిల్లలు, తల్లి కలిసి నిద్రపోయినా తల్లి మాత్రమే విరేచనాల బారిన పడింది. కొన్ని చోట్ల పిల్లలపై కూడా దీని ప్రభావం ఉంటుంది. దీనికి కారణం ఏమిటన్నది తెలియడం లేదు. రెండు, మూడు రోజులుగా ఇలా నీళ్ల విరేచనాలు అవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీన్ని డయేరియా అని వ్యవహరిస్తున్నప్పటికీ వైద్యులు మాత్రం జీఈ (గ్యాసో్ట్ర ఎంట్రైటీస్‌) అని చెబుతున్నారు. మూడుకు మించి విరేచనాలు అయితే దాన్ని జీఈగా పరిగణించాలని స్పష్టం చేస్తున్నారు. ఈ సమస్య ఉన్న బాధితుల సంఖ్య గురువారం పెరిగింది. మొత్తం 47 మంది బాధితులు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఏడుగురు పాత ప్రభుత్వాసుపత్రిలో ఉండగా, 40 మంది కొత్త ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొంత మందికి కేర్‌ అండ్‌ షేర్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో చికిత్స అందజేస్తున్నారు. బుధవారం ఆసుపత్రిలో చేరిన బాధితులు ఐదుగురు క్షతగాత్రులను ఇళ్లకు పంపించారు. తాజాగా మూడో డివిజన్‌ పాత రామాలయం వద్ద ముగ్గురు చిన్నారులకు వాంతులు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

అక్కడికక్కడే పరీక్షలు

న్యూరాజరాజేశ్వరిపేటలో ప్రబలిన జీఈకి కారణం ఏమిటన్న విషయాన్ని విశ్లేషించే పనిలో అధికారులు ఉన్నారు. ఆ ప్రాంతంలో మంత్రి పి.నారాయణ, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పర్యటించారు. అధికారులు న్యూరాజరాజేశ్వరి ప్రాంతాన్ని 13 జోన్లుగా విభజించారు. వాటి బాధ్యతలను సచివాలయ సిబ్బందికి అప్పగించారు. 50వ డివిజన్‌లో తొమ్మిది సచివాలయాలు ఉన్నాయి. అదనంగా మరో నాలుగు సచివాలయాల నుంచి సిబ్బందిని న్యూఆర్‌ఆర్‌ పేటలోకి దింపారు. ఈ ప్రాంతాల్లో ఉన్న నీటి నమూనాలను సేకరించి అక్కడికక్కడే ఫలితాలను తెలిపేలా పరీక్షలు చేస్తున్నారు. ఇందు కోసం ఫుడ్‌సేఫ్టీ ఆన్‌ వీల్స్‌ వాహనాన్ని ఇక్కడకు రప్పించారు. ఇదొక సంచార ప్రయోగశాల. ఇందులో ఉన్న ప్రయోగశాలలో 70-80 పరీక్షలు చేయవచ్చు. గురువారం మధ్యాహ్నం 20-25 ప్రదేశాల్లో నీళ్ల నమూనాలను సేకరించారు. సీసాల ద్వారా తీసుకొచ్చి ఈ నీటిని ఫుడ్‌ సేఫ్టీ ఆన్‌ వీల్స్‌లో పరీక్షిస్తున్నారు. సాయంత్రం వరకు జరిగిన పరీక్షల్లో ఎలాంటి కలుషిత ఛాయలు కనిపించలేదు. మొత్తం తొమ్మిది రకాల రసాయన పరీక్షలు చేశారు. దీంతో ఆ నమూనాలను మైక్రోబయాలజీ ల్యాబ్‌కు పంపారు.

పబ్లిక్‌ కుళాయిలు బంద్‌

న్యూఆర్‌ఆర్‌పేటలో గ్యాసో్ట్ర ఎంట్రైటీస్‌ రావడానికి కారణం ఏమిటో ఇప్పటి తెలియలేదు. కుళాయిల ద్వారా వచ్చిన కలుషితమైన నీటిని తాగడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ చాలాచోట్ల కుళాయిలపై నుంచి డ్రెయిన్‌ ప్రవహిస్తోంది. పరిస్థితిని కట్టడి చేయడానికి అధికారులు ముందుగా వీఎంసీ పైపులైన్లు బంద్‌ చేశారు. ఆ ప్రాంతలకు కుళాయిల నుంచి నీటి సరఫరాను ఆపేశారు. మినర్‌ వాటర్‌ను వ్యాన్ల ద్వారా అక్కడి ప్రజలకు సరఫరా చేస్తున్నారు.

నగరంలో 122 డయేరియా కేసులు

నగరంలో మొత్తం 122 డయేరియా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 61 మంది ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 61 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జయ్యారు.

Updated Date - Sep 12 , 2025 | 01:27 AM