Share News

శవంతో ధర్నా

ABN , Publish Date - Sep 22 , 2025 | 11:53 PM

విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి ఆందోళన చేపట్టిన సంఘటన హొళగుంద మండలంలోని లింగంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

   శవంతో ధర్నా
లింగం పల్లిలో వర్షంలో ఽధర్నా చేస్తున్న దృశ్యం

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌

హొళగుంద, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి ఆందోళన చేపట్టిన సంఘటన హొళగుంద మండలంలోని లింగంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు... లింగంపల్లికి చెందిన మారెన్న(39)ను సోమవారం పత్తి సంచులు దింపేందుకు ఈరన్న అనే వ్యక్తి ట్రాక్టరులో తీసుకెళ్లాడు. అయితే మారెన్న ప్రయాణించే ట్రాక్టర్‌కు ఉన్న ఇనుప పైప్‌కు గురుస్వామి అనే వ్యక్తి ఇంటికి తీసుకున్న విద్యుతవైర్లు తగిలాయి. దీంతో విద్యుత షాక్‌తో దినకూలి మారెన్న ఒక్కసారిగా కుప్పకూలాడు. స్థానికులు అతడిని ఆదోని ఆసుపత్రికి తరలించేలోగా మార్గమద్యంలో మృతి చెందాడు. మారెన్నకు భార్య సత్యమ్మ, కుమారుడు, కుమార్తె సంతానం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా మారెన్న పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు మారెన్న మృతదేహాన్ని పనికి తీసుకెళ్లిన యజమాని ఈరన్న ఇంటి వద్దకు తీసుకెళ్లారు. ‘నీవల్లే ఇదంతా జరిగింది. న్యాయం చేయాల్సిందే..’ అంటూ మృతదేహాన్ని ఇంటి ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. గ్రామంలో ఆందోళనకర పరిస్థితులు తలెత్తడంతో ఆలూరు సీఐ రవిశంకర్‌ రెడ్డి బాధితులతో ఫోనలో మాట్లాడారు. అయినప్పటికీ బాధిత కుటుంబ సభ్యులు శాంతించలేదు. అర్ధరాత్రి 12 గంటలైనా మృతదేహాన్ని ఈరన్న ఇంటి ఎదుటే ఉంచి ఆందోళన చేపట్టారు.

Updated Date - Sep 22 , 2025 | 11:53 PM