Share News

మత్తు పదార్థాలు విక్రయిస్తే చర్యలు: డీజీపీ

ABN , Publish Date - Aug 08 , 2025 | 06:13 AM

విద్యాసంస్థలకు వంద మీటర్ల దూరంలో గంజాయి, డ్రగ్స్‌, సిగరెట్లు, గుట్కా, కాఫ్‌ సిర్‌ఫలు విక్రయించరాదన్న టోఫెల్‌ మార్గదర్శకాలను రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు డీజీపీ...

మత్తు పదార్థాలు విక్రయిస్తే చర్యలు: డీజీపీ

అమరావతి, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): విద్యాసంస్థలకు వంద మీటర్ల దూరంలో గంజాయి, డ్రగ్స్‌, సిగరెట్లు, గుట్కా, కాఫ్‌ సిర్‌ఫలు విక్రయించరాదన్న టోఫెల్‌ మార్గదర్శకాలను రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా తెలిపారు. ‘ఆపరేషన్‌ సేఫ్‌ క్యాంపస్‌ జోన్‌’ పేరుతో గత నెల 8 నుంచి 12 వరకూ 26 జిల్లాల్లో చేపట్టిన దాడుల్లో.. 16,806 దుకాణాలను తనిఖీ చేశామని, 25,807 కేసులు నమోదు చేసి రూ.40.62 లక్షల మేర జరిమానా విధించినట్లు వెల్లడించారు. విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదు కాగా.. పశ్చిమ గోదావరి, కడప, అన్నమయ్య జిల్లాల్లో తక్కువ నమోదైనట్లు చెప్పారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం శుభ పరిణామమన్నారు. విద్యార్థులు ఎవ్వరూ మత్తు బారిన పడకుండా జిల్లాల ఎస్పీలతో ఈగల్‌ విభాగం సమన్వయం చేసుకుని చర్యలు చేపడుతోందన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల సమచారాన్ని తెలియజేయాలని ప్రజలను డీజీపీ కోరారు.

Updated Date - Aug 08 , 2025 | 06:14 AM