DGP Harish Kumar Gupta: రౌడీయిజం చేస్తే ఎవ్వరినీ వదలొద్దు
ABN , Publish Date - Oct 09 , 2025 | 05:41 AM
రాజకీయ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఏ రాజకీయ పార్టీకైనా అభ్యంతరం చెప్పబోం. కానీ బలప్రదర్శన పేరుతో రౌడీయిజం చేస్తామంటే తాట తీస్తాం...
రాజకీయ పర్యటన వరకూ అడ్డుచెప్పొద్దు
నిబంధనలతో కూడిన అనుమతి ఇవ్వండి
పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేయండి
జగన్ నర్సీపట్నం పర్యటనపై పోలీసులకు డీజీపీ ఆదేశం
అమరావతి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ‘రాజకీయ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఏ రాజకీయ పార్టీకైనా అభ్యంతరం చెప్పబోం. కానీ బలప్రదర్శన పేరుతో రౌడీయిజం చేస్తామంటే తాట తీస్తాం’ అని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు. గురువారం విశాఖపట్నంలో మహిళల ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లపై నగర కమిషన్, పోలీసు ఉన్నతాధికారులతో ఆయన బుధవారం సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ట్రాఫిక్ నియంత్రణ సమర్థంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం మాజీ సీఎం జగన్ నర్సీపట్నం పర్యటనపై విశాఖ సిటీ, అనకాపల్లి జిల్లా పోలీసులతో చర్చించారు. హెలికాప్టర్‌లో వెళ్లాలని సూచించినా వినడం లేదని, బల ప్రదర్శన కోసం ఉద్దేశపూర్వకంగా రోడ్‌షో నిర్వహిస్తున్నారని డీజీపీకి పోలీసు అధికారులు వివరించారు. వైసీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ రెచ్చగొట్టేలా ఓ వర్గం మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారని వివరించారు. దీనిపై డీజీపీ స్పందిస్తూ.. ‘రాజకీయ పర్యటన వరకూ అడ్డుచెప్పొద్దు.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించని నిబంధనలతో కూడిన అనుమతి ఇవ్వండి. పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేయండి. డ్రోన్లతో మార్గం మొత్తం పర్యవేక్షించండి. ఎక్కడైనా అదుపు తప్పి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తేఅడ్డుకోండి. రౌడీయిజం చేస్తే ఎవ్వరినీ వదలొద్దు. కరూర్‌లో రోడ్‌షో వల్ల 41మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడటం పోలీసుల బాధ్యత’ అని డీజీపీ స్పష్టం చేశారు.