DGP Harish Kumar Gupta: పోలీసు ఖాళీలు 11,639
ABN , Publish Date - Oct 10 , 2025 | 04:21 AM
సైబర్ నేరాలు సవాలు విసురుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా అశాంతి సృష్టించే యత్నాలు జరుగుతున్నాయి. ఇతర నేరాల కట్టడి పోలీసు శాఖకు ఎంతో కీలకం.
భర్తీకి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి డీజీపీ లేఖ
అనుమతి లభిస్తే త్వరలో నోటిఫికేషన్
అమరావతి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): ‘సైబర్ నేరాలు సవాలు విసురుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా అశాంతి సృష్టించే యత్నాలు జరుగుతున్నాయి. ఇతర నేరాల కట్టడి పోలీసు శాఖకు ఎంతో కీలకం. రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. అయినా ఇంకా పోలీసుల అవసరం ఉంది. భర్తీకి అవకాశాలు పరిశీలించగలరు’ అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు పోలీసు శాఖలో భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలతో గత నెల 29న రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్‌కు ఆయన లేఖ రాశారు. పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వు, స్పెషల్ ఆర్మ్‌డ్ రిజర్వు, ఏపీఎస్పీ, సీపీఎల్, పీటీఓ, కమ్యూనికేషన్స్‌లో ఈ ఏడాది ఆగస్టు 31నాటికి 11,639 ఖాళీలు చూపించారు. సివిల్ పోలీస్ విభాగంలో 315 ఎస్‌ఐలు, 3,580 సివిల్ కానిస్టేబుల్, 96 ఆర్‌ఎ్‌సఐ పోస్టులు, 2,520 ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన రాగానే రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. కాగా, వైసీపీ ప్రభుత్వంలో 2022 నవంబరులో నోటిఫికేషన్ జారీ చేసినా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయాలేదు. దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటీవలే 6,100 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసింది. ఇప్పుడు ఏకంగా 11వేలకు పైగా పోస్టులతో మరో నోటిఫికేషన్ విడుదలైతే ఇటు నిరుద్యోగులకు, అటు పోలీసు శాఖకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.