K. Ram Mohan Naidu: బాధ్యులెవరో తేలుస్తాం
ABN , Publish Date - Dec 07 , 2025 | 06:07 AM
దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఇండిగో విమానాల రద్దుకు బాధ్యులెవరో తేలుస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు.
కఠిన చర్యలు చేపడతాం
ఇప్పటికే డీజీసీఏ దర్యాప్తు
వారంలో నివేదిక
రెండు సంస్థల ఆధిపత్యం కుదరదు
‘ఆంధ్రజ్యోతి’తో పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు
న్యూఢిల్లీ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఇండిగో విమానాల రద్దుకు బాధ్యులెవరో తేలుస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. డీజీసీఏ కొత్త నిబంధనలు వచ్చి నెల రోజులు దాటిపోయింది. మరి ఇన్ని రోజులు లేని సమస్య ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకు వచ్చింది? అంత భారీ స్థాయిలో విమానాలు ఎందుకు రద్దయ్యాయి? దీనికి కారణమేంటి? ఎవరు బాధ్యులు?’ అనేది తేల్చేందుకు పకడ్బందీగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. దీనిపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీజీసీఏను ఆదేశించామని, ఆ నివేదిక అందాక బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని తెలిపారు. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో రామ్మోహన్‌నాయుడు శనివారం ఢిల్లీలో ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సోమవారానికల్లా ఇండిగో విమాన సర్వీసులు యథాతథంగా నడిచేలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. విమానాశ్రయాల్లో చిక్కుకున్న ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఇండిగో సంక్షోభాన్ని సొమ్ము చేసుకునేందుకు ఇతర విమానయాన సంస్థలు చార్జీలు పెంచకుండా నియంత్రణలు విధించామని చెప్పారు. మన దేశంలో కేవలం రెండు విమానయాన సంస్థల ఆధిపత్యమే ఉందని, టికెట్ల ధరల తగ్గింపులో పోటీతత్వం లేదని రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. ఈ ఆధిపత్యాన్ని సరిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని.. మరిన్ని ప్రైవేటు సంస్థలు ఈ రంగంలోకి రావాలని ఆహ్వానిస్తున్నామని వివరించారు. అంతిమంగా ప్రయాణికులకు లబ్ధి దక్కేలా చూడటమే తమ కర్తవ్యమని చెప్పారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టాక కొత్తగా మూడు ఎయిర్‌లైన్స్ సంస్థలకు అనుమతి ఇచ్చామన్నారు.