Share News

Raghurama Torture Case: తెలియదు.. గుర్తులేదు!

ABN , Publish Date - Dec 16 , 2025 | 03:50 AM

ఏ ప్రశ్న అడిగినా.. తెలియదు, గుర్తులేదనే సమాధానమే. అప్పటి వైసీపీ నరసాపురం ఎంపీ, ప్రస్తుతం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణరాజును కస్టడీలో.....

Raghurama Torture Case: తెలియదు.. గుర్తులేదు!

  • ఏమడిగినా డీజీ సునీల్‌కుమార్‌ సమాధానమిదే

  • రఘురామ టార్చర్‌ కేసులో విచారణకు హాజరైన సీనియర్‌ ఐపీఎస్‌

గుంటూరు, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఏ ప్రశ్న అడిగినా.. తెలియదు, గుర్తులేదనే సమాధానమే. అప్పటి వైసీపీ నరసాపురం ఎంపీ, ప్రస్తుతం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో ప్రధాన నిందితుడైన నాటి సీఐడీ చీఫ్‌, డీజీ స్థాయి సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌ విచారణకు ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. సోమవారం గుంటూరులోని సీసీఎస్‌ స్టేషన్‌లో జరిగిన విచారణకు ఆయన ఎట్టకేలకు హాజరయ్యారు. ఉదయం 10.45 గంటలకు సునీల్‌ గుంటూరు జిల్లా కోర్టు రోడ్డులోని సీసీఎస్‌ కార్యాలయానికి వచ్చారు. తర్వాత కాసేపటికి దర్యాప్తు అధికారి అయిన విజయనగరం ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ వచ్చారు. 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 5 గంటల పాటు విచారణ కొనసాగింది. మధ్యలో మధ్యాహ్నం కొద్ది సమయం భోజన విరామం ఇచ్చారు. రఘరామను ఆనాడు (2021 మే 14న) హైదరాబాద్‌ నుంచి గుంటూరు సీఐడీ కార్యాలయానికి ఎందుకు తీసుకొచ్చారు.. ఎందుకు కొట్టారు.. ఎవరు కొట్టారు.. ఇలా ఎన్ని ప్రశ్నలడిగినా తెలియదు... గుర్తు లేదనే సునీల్‌కుమార్‌ చెప్పినట్లు సమాచారం. మళ్లీ పిలిచినప్పుడు రావలసి ఉంటుందని దామోదర్‌ ఆయనకు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు విచారణ ముగిశాక సునీల్‌కుమార్‌ కారులో వెళ్లిపోయారు. ఆయన గానీ, దామోదర్‌ గానీ మీడియాతో మాట్లాడలేదు. సీసీఎస్‌ స్టేషన్‌ వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయ ప్రాంగణంలోకి ఎవరూ వెళ్లకుండా గేటు మూసి ఆంక్షలు విధించారు. మీడియానూ అనుమతించలేదు. సునీల్‌కుమార్‌ వాహనం నేరుగా ప్రాంగణంలోకి వెళ్లింది.


కేసు పూర్వాపరాలు..

2021 మే 14న హైదరాబాద్‌లో జన్మదినం జరుపుకొంటున్న నాటి నరసాపురం ఎంపీ రఘురామరాజును గుంటూరు సీఐడీ పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి తీసుకొచ్చారు. ఆరోజు రాత్రి సీఐడీ కార్యాలయంలో గుండెలపై కూర్చుని, లాఠీలతో కొట్టి.. ఆయన్ను చిత్రహింసలకు గురిచేశారు. గుండె ఆపరేషన్‌ చేయించుకుని ఉన్నానని, మందులు వేసుకోవాలని తాను ప్రాధేయపడినా వినిపించుకోకుండా తీవ్రంగా హింసించి హత్యాయత్నం చేశారని రఘురామ ఆ తర్వాతి రోజు కోర్టులో మేజిస్ట్రేట్‌కు తెలియజేశారు. వాచిన అరికాళ్లను చూపారు. దీంతో ఆయనకు వైద్య పరీక్షలు చేయించాలని న్యాయాధికారి ఆదేశించారు. అయితే ఆయన శరీరంపై ఎలాంటి గాయాల్లేవని నాటి జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభావతి నివేదిక ఇచ్చారు. ఆమె భర్త రవికుమార్‌ వైసీపీ నేత కావడంతో ఆమెను నాటి ప్రభుత్వ పెద్దలు ప్రభావితం చేసి తప్పుడు నివేదిక ఇప్పించారని రఘురామ ఆరోపించారు. దీనిపై ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టు తలుపు తట్టడంతో చివరకు హైదరాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయన శరీరంపై గాయాలు ఉన్నాయని ఆస్పత్రి వైద్యులు కోర్టుకు నివేదిక ఇచ్చారు. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వంలో తనకు న్యాయం జరగని భావించిన రఘురామ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఏడాది జూలై 11న గుంటూరు నగరంపాలెం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నాటి సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ (ఏ-1), నాటి నిఘా చీఫ్‌ పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు (ఏ-2), మాజీ సీఎం జగన్‌ (ఏ-3), అప్పటి సీఐడీ అదనపు ఎస్‌పీ విజయ్‌పాల్‌ (ఏ-4), అప్పటి జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభావతి (ఏ-5)లను నిందితులుగా చేర్చారు. ఐపీఎస్‌ అధికారి దామోదర్‌ను దర్యాప్తు అధికారిగా నియమించారు. విచారణలో భాగంగా విజయ్‌పాల్‌ను విచారించి అరెస్టు చేశారు. ఆ తర్వాత రఘురామరాజు ఇచ్చిన సమాచారంతో కస్టడీలో ఆయనపై దాడి చేసిన తులసిబాబును అరెస్టుచేశారు. దరిమిలా తనకు అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభావతి హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఉపశమనం లభించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని ఆమెకు సూచించిన కోర్టు.. ఆమెకు నోటీసులివ్వాలంటూ పోలీసులకు ఆదేశాలిచ్చింది. రఘురామను టార్చర్‌కు గురిచేసిన సమయంలో అక్కడే విధుల్లో ఉన్న నాటి సీఐడీ అదనపు ఎస్‌పీ సునీల్‌ నాయక్‌ ఆ తర్వాత తన కేడర్‌ రాష్ట్రమైన బిహార్‌కు వెళ్లిపోయారు. విచారణకు నోటీసులు జారీచేయగా.. స్థానిక కోర్టును ఆశ్రయించి విచారణ నుంచి మినహాయింపు పొందారు. ఆ తర్వాత ఎస్‌పీ దామోదర్‌.. ఈ నెల 4న విచారణకు రావాలని సునీల్‌కుమార్‌కు నోటీసులు ఇచ్చారు. కుటుంబ సభ్యుల అనారోగ్యం కారణంగా ఆ రోజు రాలేనని, రెండు వారాల గడువు కావాలని సునీల్‌కుమార్‌ కోరారు. దీంతో 15న రావాలని రెండో దఫా నోటీసులివ్వడంతో ఆయన హాజరయ్యారు. అయితే విచారణకు సహకరించని నేపథ్యంలో దర్యాప్తు అఽధికారి తీసుకునే తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది. మళ్లీ విచారణకు పిలిచి అరెస్టు చేస్తారని పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Updated Date - Dec 16 , 2025 | 03:50 AM