Share News

‘కళా’విహీనం!

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:34 AM

ఒకప్పుడు ఘనమైన చరిత్ర కలిగిన టౌన్‌ హాలు నేడు కళా విహీనంగా తయారై శిథిలాస్థకు చేరింది. ఎందరికో విజ్ఞానాన్ని పంచిన గ్రంథాలయం, సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలకు వేదికగా నిలిచిన ఆడిటోరియం మూగబోయింది. రాష్ట్రస్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించిన మైదానం గడ్డి, పచ్చి మొక్కలు పెరిగి అడవిని తలపిస్తోంది. టౌన్‌ హాలు భవనం శిథిలావస్థకు చేరింది.

 ‘కళా’విహీనం!

- మచిలీపట్నం టౌన్‌ హాలుకు నాడు ఘనమైన చరిత్ర

- అనుబంధంగా లైబ్రరీ, ఆడిటోరియం నిర్మాణం

- సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలకు వేదిక

- ఎందరో మహానుభావులకు ఆతిథ్యం

- నేడు నిరాధరణతో శిథిలావస్థకు..

ఒకప్పుడు ఘనమైన చరిత్ర కలిగిన టౌన్‌ హాలు నేడు కళా విహీనంగా తయారై శిథిలాస్థకు చేరింది. ఎందరికో విజ్ఞానాన్ని పంచిన గ్రంథాలయం, సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలకు వేదికగా నిలిచిన ఆడిటోరియం మూగబోయింది. రాష్ట్రస్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించిన మైదానం గడ్డి, పచ్చి మొక్కలు పెరిగి అడవిని తలపిస్తోంది. టౌన్‌ హాలు భవనం శిథిలావస్థకు చేరింది.

(మచిలీపట్నం టౌన్‌- ఆంధ్రజ్యోతి)

కళలకు కాణాచి అయిన మచిలీపట్నంలో టౌన్‌హాలు నిర్మాణానికి నూజివీడు జమిందారు నాలుగు ఎకరాల స్థలం ఇచ్చారు. విక్టోరియా మహారాణి భారతదేశం వచ్చిన సందర్భంగా 1905లో పోలీస్‌ అధికారి పార్‌సన్స్‌ టౌన్‌హాలుకు శంకుస్థాపన చేశారు. ఏడాదిలో టౌన్‌హాలును అద్భుతంగా నిర్మించారు. అప్పట్లో టౌన్‌హాల్‌ను విక్టోరియా మహారాణి హాల్‌గా పిలిచేవారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత టౌన్‌హాలుకు ముట్నూరి కృష్ణారావు పురమందిరంగా పేరు మార్చారు. అయితే జనబాహుల్యంలో టౌన్‌హాలుగా పేరొందింది. టౌన్‌హాల్‌ వెనుక దైతా శ్రీరాములు పేరిట దైతా మధుసూదనశాసి్త్ర ఓపెన్‌ ఆడిటోరియం నిర్మించారు.

ఎందరో ప్రముఖుల ప్రదర్శనలు

120 ఏళ్ల నాటి ఈ టౌన్‌ హాలు వివిధ సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలకు వేదికగా నిలిచింది. విశ్వనాథ సత్యనారాయణ, తిరుపతి వేంకట కవులు ఈ టౌన్‌ హాలులో కవితా గానం చేశారు. ఘంటసాల వెంకటేశ్వరరావు వంటి ప్రముఖ గాయకులు ఈ టౌన్‌ హాలులో పాట కచేరీలు ఇచ్చారు. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, సినీ సంగీత దర్శకులు కీరవాణి వంటి ప్రముఖులు ఈ వేదికపై మెరిశారు. వేటూరి సుందరరామ్మూర్తి, అద్దేపల్లి రామ్మోహనరావు, గురజాడ రాఘవశర్మ వంటి పలువురు కవులు ఈ హాలులో కవితా గానం చేసిన వారే. అప్పటి ఎంపీలు కాశీనాథుని పూర్ణమల్లికార్జునుడు, అంబటి బ్రాహ్మణయ్య, దివంగత మంత్రులు పేర్ని కృష్ణమూర్తి, సింహాద్రి సత్యనారాయణరావు, నడకుదిటి నరసింహారావు టౌన్‌హాలులో సభలకు హాజరయ్యేవారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఈ హాలులో నిర్వహించేవారు.

లైబ్రరీలో అద్భుతమైన సాహిత్యం

టౌన్‌ హాలుకు అనుబంధంగా లైబ్రరీ ఉండేది. ఈ లైబ్రరీలో అద్భుతమైన తెలుగు, ఇంగ్లీషు, హిందీ సాహిత్య గ్రంథాలు ఉండేవి. ఆధ్యాత్మిక గ్రంథాలను పాఠకులు చదివేవారు. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం అన్ని భాగాలు ఉండేవి. ప్రతిరోజూ లైబ్రరీకి వచ్చే దినపత్రికలతో పాటు పాఠకులు గ్రంథాలయంలోని సాహిత్యాలను చదివేవారు.

సాంస్కృతిక ప్రదర్శనలు

దైతా శ్రీరాములు ఆడిటోరియంపై ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు, పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణశర్మ వంటి ప్రముఖుల నాట్యప్రదర్శనలు జరిగేవి. ఈ ఆడిటోరియంపై వరుసగా మంతెన సత్యనారాయణరాజు నెల రోజుల పాటు ఉపన్యాసాలు ఇచ్చారు. ప్రముఖ రాజకీయ నాయకులు ఈ వేదికపై ఉపన్యాసాలు చేసేవారు. ఎన్నికల సమయంలో టౌన్‌హాల్‌ ప్రచార వేదికగా మారేది.

ఆటల పోటీలు

టౌన్‌హాలు వెనుక విశాలమైన స్థలంలో జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి బాల్‌ బాడ్మింటన్‌ పోటీలు నిర్వహించేవారు. బాల్‌ బాడ్మింటన్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడు దివంగత బొమ్మగంటి చంద్రశేఖరరావు ఈ పోటీలను ప్రోత్సహించేశారు. వీరికి దివంగత పీఈటీ కుందేటి మోహనరావుతో పాటు పలువురు సహకరించేవారు.

రెండు పోలింగ్‌ కేంద్రాలు...

ఎన్నికల సమయంలో టౌన్‌హాలులో రెండు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. పోలింగ్‌ శిక్షణా తరగతులు కూడా ఇక్కడే నిర్వహించే వారు. కౌంటింగ్‌ కూడా ఇక్కడ నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి. ఉగాది వేడుకలను ప్రభుత్వ అధికారులు ఇక్కడ జరిపేవారు.

కృష్ణా క్లబ్‌లో సచివాలయం

టౌన్‌హాలుకు అనుబంధంగా ఉన్న కృష్ణా క్లబ్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇప్పుడు ఆ కృష్ణా క్లబ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చాక సచివాలయం నడుపుతున్నారు.

దేవదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోకి..

టౌన్‌ హాల్‌ను దేవదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. టౌన్‌హాల్‌ పెళ్లిళ్లకు అద్దెకు ఇచ్చేవారు. ఆ సమయంలో ఆదాయ వనరులు ఉండేవి. ప్రస్తుతం టౌన్‌హాలుకు ఆదాయ వనరులు లేవు. సచివాలయం అద్దెకు తీసుకున్నా మునిసిపాలిటీ వారు ఇప్పటికీ దేవదాయ ధర్మాదాయ శాఖకు అద్దె చెల్లించలేదు. ఈ నేపథ్యంలో పట్టణ నడిబొడ్డున ఉండే కోట్లాది రూపాయల విలువైన టౌన్‌హాలు ప్రాంతానికి తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు. కనీసం టౌన్‌హాలు వెనుక ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేసి బాల్‌బాడ్మింటన్‌ వంటి క్రీడలు ఆడుకునేందుకు వినియోగించాలని, దైతా శ్రీరాములు ఆడిటోరియం వేదికను పునర్నిర్మిస్తే పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. టీడీపీ ప్రభుత్వంలో టౌన్‌ హాలుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే మళ్లీ టౌన్‌హాలుకు కమిటీని ఏర్పాటు చేస్తే అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు టౌన్‌హాలు ఉండే ప్రాంతాన్ని పీ-4 కార్యక్రమం కింద అభివృద్ధి చేసేందుకు ఆలోచించారు. సీఎస్‌ఆర్‌ నిధులతో టౌన్‌హాలును అభివృద్ధి చేసేందుకు అవకాశాలున్నాయి.

Updated Date - Dec 16 , 2025 | 12:34 AM