Land Grabbing: వివేకా హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి భూకబ్జా
ABN , Publish Date - Oct 18 , 2025 | 04:26 AM
మాజీ సీఎం జగన్ హయాంలో రాష్ట్రంలో భూకబ్జా జరగని ప్రాంతం లేదు. ఈ క్రమంలో జగన్ సొంత జిల్లా కడపలోని సొంత నియోజకవర్గం పులివెందులలో వైసీపీ నేతలు బరితెగించారు.
క్రిమినల్ కేసులకు రంగం సిద్ధం
కడప, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్ హయాంలో రాష్ట్రంలో భూకబ్జా జరగని ప్రాంతం లేదు. ఈ క్రమంలో జగన్ సొంత జిల్లా కడపలోని సొంత నియోజకవర్గం పులివెందులలో వైసీపీ నేతలు బరితెగించారు. జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో నిందితుడిగా ఉన్న.. లింగాల మండలం దొండ్లవాగుకు చెందిన దేవిరెడ్డి శంకర్‌రెడ్డి ఏకంగా 53 ఎకరాలను ఆక్రమించుకున్నారు. తన కుటుబ సభ్యుల భూములకు పక్కనే ఉన్న ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూమిలేని వ్యవసాయ కుటుంబానికి ఐదెకరాల్లోపు పట్టా ఇవ్వాల్సి ఉంది. అయితే దేవిరెడ్డి శంకర్‌రెడ్డి కుటుంబీకులపేరిట ఒక్కొక్కరికి 5 ఎకరాల చొప్పున భూమిని పంచుకున్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు ఆ భూమిని స్వాధీనం చేసుకుంది. వైసీపీ హయాంలో ఎంపీ అవినాశ్ రెడ్డి దన్నుతో ఈ ఆక్రమణ జరిగినట్టు అధికారులు గుర్తించారు. దీనికి అప్పటి తహసీల్దార్లు సైతం అన్నీ తామై సహకరించినట్టు తెలుసుకున్నారు. ఈ భూ కబ్జాలపై స్వయంగా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి దృష్టి పెట్టారు. దేవిరెడ్డికి సహకరించిన ముగ్గురు తహసీల్దార్లపై క్రిమినల్ చర్యలకు సిద్ధమయ్యారు.