ధార్మిక భవన్ పాలనతో సీమ ఆలయాల అభివృద్ధి
ABN , Publish Date - Dec 13 , 2025 | 11:26 PM
ధార్మిక భవన్ పాలనతోనే సీమ జిల్లాల ఆలయాలు అభివృద్ధి చెందుతాయని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
హిందూ ధర్మ పరిరక్షణకు రిటైర్డ్ ఐఏఎస్
అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాఽధ్యం
కర్నూలు అర్బన్ , డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): ధార్మిక భవన్ పాలనతోనే సీమ జిల్లాల ఆలయాలు అభివృద్ధి చెందుతాయని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శనివారం నగర శివారులోని దేవదాయ శాఖ నూతనంగా నిర్మించిన భవనాన్ని మంత్రి టీజీ భరత్ , ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్‌లాల్, కలెక్టర్ సిరి, ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ రాయలసీమ జిల్లాల్లోని అలయాల్లో వైదిక, ఆగమ శాస్త్రం ద్వారా ఉత్సవాలు, పూజా కార్యక్రమాలతో పాటు పాలన, నిర్మాణాలు, నిర్వహణ, ఆభరణాల భద్రత తదితర ప్రక్రియలను ఒకే గొడుకు కింద తెచ్చేందుకే ఈ ధార్మిక భవన నిర్మాణం జరిగిందన్నారు. రాష్ట్రంలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం రిటైర్డ్ ఐఏఎస్ దాసరిని ప్రభుత్వం నియమించిందని, ప్రతి ఆలయంలో అన్న వితరణ ప్రక్రియ సాగేలా నిధులు కేటాయించిందన్నారు. మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నింటిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. అనంతపురం- కర్నూలు ఇండసి్ట్రయల్ కారిడార్‌తో రాయలసీమ జిల్లాలు మరింత అభివృద్ధి సాధిస్తాయన్నారు. ఇదిలా ఉండగా ధార్మిక భవనం నిర్మాణం ప్రక్రియలో ప్రొటోకాల్ ప్రక్రియలో నెల కొన్న సందిగ్ధతను రెవెన్యూ అధికారులు పరిష్కరించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ డిప్యూటి కమిషనర్ పట్టెం గురు ప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి, ఈవోలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.