Share News

Spiritual Festival: అది.. దేవర గట్టు

ABN , Publish Date - Oct 01 , 2025 | 05:02 AM

దసరా పేరు వినగానే... రాయలసీమ సహా సరిహద్దు కర్ణాటక జిల్లాల ప్రజలకు గుర్తుకొచ్చేది దేవరగట్టు కర్రల సమరం. కర్రలతో కొట్టుకుంటూ.. తలలు పగిలి రక్తం చిందించే ఆటవిక ఆచారం..! సమాజానికి తెలిసిన విషయం.

Spiritual Festival: అది.. దేవర గట్టు

  • చెడుపై మంచి సాధించిన విజయోత్సవం

  • 3 గ్రామాల ప్రజలు నిష్ఠతో జరుపుకొనే వేడుక

  • ఆంధ్ర, కర్ణాటక సరిహద్దున అనాదిగా ఆచారం

  • ఉత్సవాలకు కర్నూలు జిల్లా దేవరగట్టు ముస్తాబు

(కర్నూలు-ఆంధ్రజ్యోతి)

దసరా పేరు వినగానే... రాయలసీమ సహా సరిహద్దు కర్ణాటక జిల్లాల ప్రజలకు గుర్తుకొచ్చేది దేవరగట్టు కర్రల సమరం. కర్రలతో కొట్టుకుంటూ.. తలలు పగిలి రక్తం చిందించే ఆటవిక ఆచారం..! సమాజానికి తెలిసిన విషయం ఇది! ఆ ఆచారం లోతుల్లోకి వెళితే.. చాలా విశిష్టత ఉంది. ఎంతో నిష్ఠతో ఆధ్యాత్మికంగా జరుపుకొనే వేడుక. మానవాళిని పట్టి పీడిస్తున్న దుష్టశక్తులపై దైవశక్తులు సాధించిన విజయోత్సవ జైత్రయాత్ర. కర్నూలు జిల్లా దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి క్షేత్రంలో ఏటా విజయ దశమి పర్వదినాన బన్నీ పేరిట ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాలు ముగిసే వరకు పక్షం రోజుల పాటు అంటే.. దసరా శరన్నవరాత్రులు ప్రారంభానికి ముందు అమావాస్య నుంచి పౌర్ణమి వరకు మూడు గ్రామాలు నెరణికి, నెరణికితండ, కొత్తపేట ప్రజలు మద్యం, మాంసాహారం, దాంపత్య జీవితానికి దూరం. కాలికి చెప్పులు కూడా లేకుండా కఠోరదీక్ష, నియమ నిష్ఠలతో జరుపుకొంటారు. కొండపైకి చేర్చిన ఉత్సవమూర్తులు తిరిగి గ్రామానికి చేరుకున్న తరువాతే నియమ నిష్ఠలను వీడి సాధారణ జీవితం ప్రారంభిస్తారు. ఈ విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు. పూర్వీకుల నుంచి వచ్చిన ఈ ఆచారాన్ని శతాబ్దాలుగా కొనసాగిస్తున్నారు అంటే.. నమ్మలేని నిజం. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులో కర్నూలు జిల్లా ఆలూరు పట్టణానికి 15 కి.మీ. దూరంలో హొళగుంద మండలం దేవరగట్టులో దాదాపు 800 అడుగుల ఎత్తయిన కొండపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామి క్షేత్రం దసరా బన్నీ ఉత్సవాలకు సిద్ధమైంది. శనివారం ఉత్సవమూర్తులకు నెరణికి గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మేళతాళాలు, విజయోత్సవాలతో దేవరగట్టు క్షేత్రానికి చేర్చారు.


యుద్ధాన్ని తలపించేలా..

అడవిలోకి వెళ్లడానికి ముందు.. ఉత్సవమూర్తులను పల్లకీలో సింహాసన కట్ట వద్దకు చేర్చి మహా మంగళహారతి ఇస్తారు. దేవుడ్ని తమ వశం చేసుకోవడానికి ఎల్లార్తి, సులావాయి, విరుపాపురం, అరికేర, అరికేర తాండ, బిలేహాలు, ఆలూరు గ్రామాల భక్తులు ఓ వర్గంగా నెరణికి, నెరణికితండ, కొత్తపేట గ్రామస్థుల్ని అడ్టుకుంటారు. క్షణాల్లో వేలాది కర్రలు తలపైకి లేస్తాయి. కాళరాత్రి కాగడాల వెలుతురులో ఓ వర్గం వెనుకడుగు వేస్తే.. తరువాత మరో వర్గం వెనక్కి తగ్గుతుంది. ఇనుప తీగ చుట్టిన పట్టుడుకర్రలు తలలపై నాట్యమాడుతుంటాయి. డిర్ర్‌ర్ర్‌ర్ర్‌.. గోపరాక్‌ (బహుపరాక్‌) అంటూ హోరాహోరీగా సాగించే బన్నీ జైత్రయాత్ర 45 నిమిషాలు కర్రల యుద్ధాన్ని తలపిస్తుంది. ఆచారం ప్రకారం ఇది ఒక ఆటే కానీ కర్రలతో కొట్టుకోరు. ఆలయ ప్రధాన అర్చకుడు గిరి మల్లయ్య మాట్లాడుతూ... సంప్రదాయ బద్ధంగా సాగే బన్నీ ఓ ఆటే కానీ కర్రల సమరం కాదని అన్నారు. వేలాది మంది కర్రలు చేతపట్టి ఒకచోట చేరినప్పుడు.. ఆ కర్రలు తలలకు తగిలి చిన్నచిన్న గాయాలు అవుతున్నాయే కానీ కొట్టుకోవడం వల్ల కాదని అంటున్నారు. కొందరు స్వార్థపరుల ఆగడాల వల్ల చెడ్డపేరు వస్తుందే కానీ ఇది ఆధ్యాత్మికంగా సాగించే బన్నీ ఉత్సవమని అన్నారు. 2017-18 మధ్యలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు దీనిపై ఫిర్యాదులు వెళ్లాయి. విచారించిన కమిషన్‌ ఇది సంప్రదాయబద్ధంగా కొనసాగిస్తున్న ఉత్సవమని తేల్చిందని ఆయా గ్రామాల భక్తులు అంటున్నారు.


ఎనిమిది తరాలుగా మేమే అర్చకులం..

చెడుపై మంచి సాధించిన విజయోత్సవమే బన్నీ జైత్రయాత్ర. త్రేతాయుగం నుంచి ఈ ఆచారం వస్తోంది. ఎనిమిది తరాలుగా మా కుటుంబీకులే అర్చకులుగా ఉంటూ కొనసాగిస్తున్నాం. వేలాది మంది కర్రలతో చేరినా ఎక్కడా కొట్టుకోరు. బన్నీ ఆడే క్రమంలో కర్రలు తగిలి చిన్నచిన్న గాయాలు అవుతున్నాయి.

- గిరి మల్లయ్య, ప్రధాన అర్చకుడు, దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి క్షేత్రం, నెరణికి గ్రామం, హోళగుంద మండలం

కర్రలు, కాగడాలు ఎందుకంటే..

దసరా రోజున అర్ధరాత్రి 12:15 గంటల తరువాత మాళ మల్లేశ్వరులకు కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. కొండపై నుంచి దిగువన ఉన్న సింహాసన కట్ట వద్దకు స్వామివారి పల్లకీతో చేరుకుంటారు. బన్నీ (మొగలాయ్‌) ఆడుతారు. అక్కడి నుంచి దట్టమైన అడవిలో ఉన్న ముళ్ల బండ, పాదాల గట్టు, రక్షపడ, బన్నీకట్ట, వన్నె చెరువుకట్ట మీదుగా తెల్లవారు జామున బసవన్న గుడికి చేరుకుంటారు. ఆ క్షేత్రాలు చుట్టి రావాలంటే కారుచీకటిలో దాదాపు పది కిలోమీటర్లు స్వామివారి పల్లకీతో వెళ్లి రావాల్సి ఉంటుంది. పూర్వం క్రూరమృగాలు సంచరించేవి. ఆ క్రూరమృగాలు, అడవి జంతువుల నుంచి రక్షణ కోసం చేతిలో కర్రలు, వెలుతురు కోసం కాగడాలు తీసుకువెళ్లేవారు. ఇప్పటికీ ఆ ఆచారం కొనసాగిస్తున్నారు.


21వ ఏట నుంచి బన్నీ ఆడాను

నా వయసు 84 ఏళ్లు. మా తాతముత్తాల కాలం నుంచి దేవరగట్టు బన్నీ ఉత్సవంలో పాల్గొంటున్నాం. 850 ఏళ్లకు పైగా ఈ ఉత్సవం జరుగుతోందని మా పూర్వీకులు చెప్పేవారు. నా 21వ ఏట నుంచి కర్ర చేతపట్టి బన్నీ ఆడాను. వయసు మీద పడడంతో ఐదారేళ్లుగా బన్నీకి దూరంగా ఉంటున్నా. కర్ర పట్టుకొని కొండకు పోతాను.

- గూలిపాలెం ఈరన్న, నెరణికి గ్రామం, హోళగుంద మండలం

రక్తతర్పణం చేస్తున్నాం

బన్నీ ఉత్సవాల్లో శివుడి ఆజ్ఞానుసారంగా శివభక్తులైన మా వంశస్థులు రక్తతర్పణం చేస్తున్నాం. మా నాన్న తరువాత 13 ఏళ్లుగా నేను ఆచరిస్తున్నాను. రక్షపడ ప్రాంతం వద్ద మీటరు పొడవుండే మందాటి ఇనుప కడ్డీని కాలి పిక్క వద్ద దూరించి, ఆ రంధ్రంలో 40 అడుగులకు పైగా ఉండే దారాన్ని లాగుతారు. ఏ మాత్రం నొప్పి, బాధ అనిపించదు. వెంటనే బండారు (పసుపు) పూసుకుంటే మానిపోతుంది. ఎలాంటి మందులు కూడా వాడం.

- కంచెవీర బసవరాజు(గొరవయ్య), నెరణికి గ్రామం


  • ఇదీ పురాణగాథ

  • ఉత్సవమూర్తులు మాళ మల్లేశ్వరస్వాములు

త్రేతాయుగంలో మునీశ్వరులు యజ్ఞయాగాలు నిర్వహిస్తే, వాటిని మణిమల్లాసుర రాక్షసుడు భగ్నం చేసేవాడట. మునులు శివపార్వతులను వేడుకోగా.. వారు మాళ, మల్లేశ్వరులుగా అవతరించి యుద్ధం ఆరంభించారు. శివుడి చేతిలో మరణం మహాభాగ్యమని భావించిన ఆ రాక్షసుడు శివుడి ఆజ్ఞతో మృత్యువుకు సమ్మతిస్తూనే.. ఏటా తనకు నరబలి ఇవ్వాలని కోరాడట. సమ్మతించని శివుడు విజయదశమి రోజున నా భక్తుల్లో ఒకరు (గొరవయ్యలు) పిడికెడు రక్తం ధారపోస్తారని అభయం ఇవ్వడంతో ఆ రాక్షసుడు మరణించాడని పురాణగాథలు చెబుతున్నాయి. ఆ తర్వాత యజ్ఞాలు నిర్వియజ్ఞంగా కొనసాగిస్తూ మునులు ఏటా విజయోత్సవం జరుపుకొనేవారు. ఆ ఆచారమే ఇప్పటికీ భక్తులు విజయదశమినాడు బన్నీ ఉత్సవం పేరిట జైత్రయాత్రగా జరుపుకొంటున్నారు.


వైరుధ్యాలు వీడి..

నెరణికి, నెరణికితండ, కొత్తపేట గ్రామస్థులు ఎంతో నిష్ఠతో ఉత్సవాలు నిర్వహిస్తారు. మనుషుల మధ్య ఎన్ని వైరుధ్యాలు ఉన్నా.. దైవకార్యార్థం వాటన్నింటినీ వీడి అన్నదమ్ముల్లా ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించడం ఆ గ్రామాల ఐక్యతను చాటుతుంది. బన్నీ ఉత్సవానికి ముందు డొళ్ల బండ వద్ద ప్రధాన అర్చకులు, గ్రామ పెద్దల సమక్షంలో కర్రలు, కాగడాలు, బండారు(అమ్మవారి పసుపు-కుంకుమ) చేతబూని మనలో ఏ ఒక్కరికీ కీడు తలపెట్టకుండా సోదరుల్లా దేవుడి కార్యం దిగ్విజయం చేద్దామంటూ పాల బాసలు చేస్తారు. కాగడాల వెలుతురులో డిర్ర్‌ర్ర్‌ర్ర్‌.. గోపరాక్‌ (బహుపరాక్‌) అంటూ దేవరగట్టుకు చేరుకుంటారు.

Updated Date - Oct 01 , 2025 | 05:04 AM