Nara Devansh: దేవాన్ష్‌కు ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్ అవార్డు
ABN , Publish Date - Sep 15 , 2025 | 03:40 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు, విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్‌ను వేగంగా పరిష్కరించినందుకుగానూ వరల్డ్...
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందుకున్న లోకేశ్ తనయుడు
లండన్‌లో ప్రదానం.. ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం
అమరావతి, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు, విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్‌ను వేగంగా పరిష్కరించినందుకుగానూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు-2025ను అందుకున్నాడు. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ హాల్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో నిర్వాహకులు దేవాన్ష్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి లోకేశ్ కూడా హాజరయ్యారు. గతేడాది జరిగిన చెక్‌మేట్ మారథాన్‌లో లాస్లో పోల్గార్ ప్రసిద్ధ చెస్ సంకలనం ‘5,334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్’ పుస్తకం నుంచి తీసుకున్న 175 క్లిష్టమైన చెక్‌మేట్ పజిల్స్‌ను వేగవంతంగా పరిష్కరించిన దేవాన్ష్ ‘ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్’గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దీనికోసం అకుంఠిత దీక్షతో శ్రమించిన దేవాన్ష్‌కు.. తల్లిదండ్రులు బ్రాహ్మణి, లోకేశ్‌తోపాటు కోచ్ కె.రాజశేఖర్ రెడ్డి చక్కని ప్రోత్సా హం అందించారు. దేవాన్ష్ ఈ అవార్డును అందుకోవడం చాలా ప్రత్యేకమైనదని, అతని కృషికి ఇది నిజమైన గుర్తింపు అని లోకేశ్ అన్నారు. అతను సాధించిన ఈ ఘనతపట్ల తామెంతో గర్విస్తున్నామని చె ప్పారు. మనవడు దేవాన్ష్ సాధించిన విజయం పట్ల సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మెంటార్ల మార్గదర్శకత్వంలో కొన్ని నెలలపాటు నిరంతరాయం గా చేసిన కృషికి ఇది దక్కిన గుర్తింపు అని అన్నారు.