‘మడ ’ విధ్వంసం!
ABN , Publish Date - Dec 04 , 2025 | 01:16 AM
మొన్న పెడన.. నిన్న బంటుమిల్లి.. నేడు పెదపట్నంలో అక్రమార్కులు బరితెగించారు. మడ చెట్ల నరికివేతను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. సముద్రం ఆటుపోట్లను నిలువరించడంతో పాటు సునామీల తీవ్రతను తగ్గించే మడచెట్లను కనుమరుగు చేస్తున్నారు. మొత్తం ఐదు వేల ఎకరాల మడ అడవులు ఉండగా.. గతంలో వెయ్యి ఎకరాలకుపైగా నరికేశారు. తాజాగా మరో 1,710 ఎకరాల్లో చెట్లను తొలగించారు. ఆ భూములను ఎక్కడికక్కడ రొయ్యల చెరువులుగా మార్చేశారు. ప్రస్తుతం పెదపట్నం పరిధిలో మరో 2,300 ఎకరాలు మాత్రమే మడ అటవీ విస్తీర్ణం మిగిలింది. మరో ఏడాది ఇలాగే కొనసాగితే అది కూడా కనుమరుగుకావటం ఖాయం.
-పెదపట్నంలో బరితెగించిన అక్రమార్కులు
- మడ చెట్లు నరికి రొయ్యల చెరువుల తవ్వకం
- ఈ ప్రాంతంలో మొత్తం 5 వేల ఎకరాల్లో మడ అడవులు
- తాజాగా 1,710 ఎకరాల్లో చెట్ల నరికివేత
- గతంలో 1,000 ఎకరాలు హాంఫట్
-ఇలాగే వదిలేస్తే మిగిలిన అడవులు కనుమరుగే..
- పట్టించుకోని అధికారులు.. ఆందోళనలో ప్రజలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ ):
మొన్న పెడన.. నిన్న బంటుమిల్లి.. నేడు పెదపట్నంలో అక్రమార్కులు బరితెగించారు. మడ చెట్ల నరికివేతను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. సముద్రం ఆటుపోట్లను నిలువరించడంతో పాటు సునామీల తీవ్రతను తగ్గించే మడచెట్లను కనుమరుగు చేస్తున్నారు. మొత్తం ఐదు వేల ఎకరాల మడ అడవులు ఉండగా.. గతంలో వెయ్యి ఎకరాలకుపైగా నరికేశారు. తాజాగా మరో 1,710 ఎకరాల్లో చెట్లను తొలగించారు. ఆ భూములను ఎక్కడికక్కడ రొయ్యల చెరువులుగా మార్చేశారు. ప్రస్తుతం పెదపట్నం పరిధిలో మరో 2,300 ఎకరాలు మాత్రమే మడ అటవీ విస్తీర్ణం మిగిలింది. మరో ఏడాది ఇలాగే కొనసాగితే అది కూడా కనుమరుగుకావటం ఖాయం.
క్రయవిక్రయాలు
పెదపట్నం పార్వతీపురం రోడ్డు వెంబడి 100 ఎకరాల విస్తీర్ణంలో మడ చెట్లను నరికి అక్రమార్కులు ప్లాట్లుగా వేశారు. వాటిని వేరొకరికి విక్రయించారు. వీటిని కొనుగోలు చేసిన వారు రెవెన్యూ శాఖ సహకారంతో పట్టాలు పుట్టించుకున్నారు. రెవెన్యూ రికార్డుల్లో కూడా ఎక్కాయి. ఆ తర్వాత ప్రొక్లెయిన్లను తీసుకువచ్చి రొయ్యల చెరువులు తవ్వించారు. లజ్జబండ డ్రెయిన్ నుంచి చెరువుల్లోకి నీటిని మళ్లించి రొయ్యల సాగు చేస్తున్నారు. ఇదే సందర్భంలో పెదపట్నం వంతెనకు రెండు వైపులా 500 ఎకరాలకు పైబడి మడ చెట్లను అక్రమార్కులు నరికివేసి రొయ్యల చెరువులుగా మార్చారు. దళితవాడ నుంచి దిగువ సముద్రం వైపు వెళ్లే డొంక రోడ్డుకు రెండు వైపులా 250 ఎకరాల మడ అటవీ విస్తీర్ణం ఆక్రమణకు గురైంది. గొల్లగూడెం నుంచి సముద్రానికి వెళ్లే వైపు రోడ్డు వెంబడి ఉన్న మడ అడవి, సముద్రం వెంబడి ఉన్న మడ అడవిలో మొత్తం 400 ఎకరాలను ఆక్రమించి మడచెట్లను నరికివేశారు. సముద్రం పక్కనే ఉన్న పార్వతీపురం గ్రామంలో 150 ఎకరాలు కూడా ఆక్రమణలకు గురైంది. పాండ్రాక పంచాయతీ పరిధిలోని రామాపురంలో 40 ఎకరాలు, ఉప్పులూరులో 70 ఎకరాలు, రామానగర్‌లో 100 ఎకరాలకుపైగా మడచెట్లను నరికేశారు. లజ్జబండ డ్రెయిన్ బండ్‌ను ఆక్రమించి 200 ఎకరాల మేర మడచెట్ల నరికివేత జరిగింది. ఇవన్నీ కూడా రొయ్యల చెరువులుగా మారిపోయాయి.
అధికారులు, ప్రజాప్రతినిధుల అండ!
పెడన, బంటుమిల్లి, మచిలీపట్నం మండలాల్లో జరుగుతున్న మడచెట్ల విధ్వంసం అంతా, ఇంతా కాదు. వ్యవస్థలన్నీ పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్తు ఉపద్రవాలను గాలికొదిలేశాయి. రెవెన్యూ, అటవీ, ఇరిగేషన్, మత్య్సశాఖలు అవినీతి మత్తులో జోగుతున్నాయి. ఫలితంగా సాగర తీరాన మడచెట్ల నరికివేత భారీ ఎత్తున జరుగుతోంది. నరికివేసిన భూములకు రెవెన్యూ పట్టాలిచ్చేస్తోంది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ)కి చెందిన భూముల్లో ఉన్న మడచెట్ల నరికివేత జరిగి.. రొయ్యల చెరువులుగా ఏర్పాటు జరుగుతున్నా కూడా ఆ శాఖ పట్టించుకోవటం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉండటంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.
ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం
మడ చెట్ల నరికివేత పర్యావరణ వినాశనానికి దారితీస్తోంది. దీనిపై జిల్లా స్థాయిలో నిర్వహించే గ్రీవెన్స్‌కు ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం సీరియస్‌గా తీసుకోకపోవటం అనేక ఆరోపణలకు, విమర్శలకు దారితీస్తోంది. సాగర తీరానికి రక్షణగా ఉన్న మడచెట్లను సంరక్షించేందుకు కలెక్టర్ బాలాజీ వివిధ శాఖల భాగస్వామ్యంతో వెంటనే హై లెవల్ కమిటీ వేసి చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.