Polavaram Project: నిధులిచ్చినా నత్తనడకే!
ABN , Publish Date - Oct 05 , 2025 | 04:11 AM
కేంద్రం నిధులు మంజూరు చేసినా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ, పునరావాస కార్యక్రమాలు నత్తనడకన సాగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది....
పోలవరం నిర్వాసితుల పునరావాసంలో జాప్యంపై కేంద్రం అసంతృప్తి
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
కేంద్రం నిధులు మంజూరు చేసినా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ, పునరావాస కార్యక్రమాలు నత్తనడకన సాగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల దేశవ్యాప్తంగా జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టుల సహాయ, పునరావాస కార్యక్రమాల అమలుపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. కేంద్రం నిధులు మంజూరు చేసినా నిర్వాసితులకు సహాయ, పునరావాస కార్యక్రమాలను వేగవంతంగా చేపట్టకపోవడంపై ఆ సమీక్షలో కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏక మొత్తంగా ఒకే దఫాలో పరిహారం చెల్లించకపోవడం వల్ల ప్రభుత్వంపై నిర్వాసితుల్లో అసహనం పెరుగుతోందనే అభిప్రాయాన్ని కేంద్రం వ్యక్తం చేసింది. విడతల వారీగా పరిహారం చెల్లించడం వల్ల పప్పుబెల్లాల్లా డబ్బులు ఖర్చయిపోయి, ప్రభుత్వం ఇచ్చిన సహాయం ఎందుకూ ఉపయోగపడటం లేదని పేర్కొంది.
తొలిదశలో లక్ష ఎకరాల సేకరణ లక్షం..
పోలవరం సాగునీటి ప్రాజెక్టు తొలిదశలో 41.15 మీటర్ల కాంటూరులో 1,00,099 ఎకరాలు అవసరం కాగా.. 91,156 ఎకరాలను సేకరించారు. ఇంకా 8,943 ఎకరాలను సేకరించాల్సి ఉంది. తొలిదశలో 38,060 నిర్వాసిత కుటుంబాలకు సహాయ, పునరావాస కార్యక్రమాలను అమలు చేయాల్సి ఉందని అధికారులు గుర్తించారు. ఇందులో 14,371 మంది నిర్వాసితులను కాలనీల్లోకి తరలించారు. ఇంకా 23,689 కుటుంబాలను తరలించాల్సి ఉంది. వీరిలో ఫేజ్1ఏ కింద 6,575 కుటుంబాలను వచ్చే ఏడాది మార్చి నాటికి, ఫేజ్-1బీ కింద 17,114 కుటుంబాలను 2027 మార్చి నాటికి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని జల వనరుల శాఖ చెబుతోంది. 38,060 కుటుంబాలకు నగదు రూపంలో చెల్లింపులు చేయాల్సి ఉండగా, కేవలం 19,953 కుటుంబాలకే చెల్లించారు. ఇంకా 18,107 కుటుంబాలకు నగదు పరిహారం చెల్లించాల్సి ఉంది. వీరిలో ఫేజ్-1ఏ కింద 1,465 కుటుంబాలకు ఈ ఏడాది చివరినాటికి, ఫేజ్-1బీ కింద 16,642 కుటుంబాలకు 2027 మార్చి నాటికి చెల్లిస్తామని జల వనరుల శాఖ చెబుతోంది. 34,360 ఆర్‌అండ్‌ఆర్ గృహాలు నిర్మించాల్సి ఉండగా 15,439 మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 18,921 గృహాలు నిర్మించాల్సి ఉంది. ఇందులో ఫేజ్-1ఏ కింద 2,279 గృహాలను వచ్చే ఏడాది మార్చినాటికి, ఫేజ్1బీ కింద 16,642 గృహాలను 2027 మార్చినాటికి పూర్తి చేస్తామని జల వనరుల శాఖ చెబుతోంది. సహాయ పునరావాసం కింద 75 కాలనీలను నిర్మించాల్సి ఉండగా, అవి కూడా నత్తనడకన సాగుతున్నాయి.
పునరావాస కాలనీలు 29 మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 46 కాలనీలను నిర్మించాల్సి ఉంది. వాటిలో 42 కాలనీలకు టెండర్లు పిలిచారు. మరో నాలుగు కాలనీలకు ఇంకా టెండర్లనే పిలువలేదు. ఫేజ్-1 కింద సహాయ, పునరావాస కార్యక్రమాలకు రూ.1107.62 కోట్లను చెల్లించాల్సి ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.5,052.71 కోట్లను కేంద్రం రెండు విడతలుగా అందించింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖజానా సీఎంఎ్‌ఫఎ్‌సలో వేసింది. ఈ నిధులను రాష్ట్ర ఖజానాకు తరలించడంపై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు కోసం ప్రత్యేక ఖాతాను తెరవాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ప్రత్యేక ఖాతాను తెరిచారు. కేంద్ర నిధుల్లో రూ.1830 కోట్లను పోలవరం ప్రత్యేక ఖాతాకు మళ్లించాలి. ఈ నిధులు మళ్లిస్తే .. భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు ఆస్కారం కలుగుతుందని జల వనరుల శాఖ చెబుతోంది.
రేపు పోలవరంపై కేంద్రం సమీక్ష
అమరావతి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం సోమవారం సమీక్ష నిర్వహించనుంది. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఢిల్లీలో ఈ సమీక్ష నిర్వహించనున్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రగతిని పర్యవేక్షిస్తున్న పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) వాస్తవ నివేదికను ఆయనకు అందజేయనుంది. హెడ్‌వర్క్స్ పనులు వేగం పుంజుకున్నప్పటికి.. భూసేకరణ, సహాయపునరావాస కార్యక్రమాల్లో పురోగతి కనిపించడం లేదని కేంద్రానికి పీపీఏ నివేదించింది. నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని పీపీఏ నివేదికను ఇవ్వడంతో.. ఇదే ప్రధాన అంశంగా పాటిల్ సమీక్ష నిర్వహించనున్నారు. సమీక్షకు హాజరుకావాల్సిందిగా రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తిలను కోరారు. దీంతో ఈ సమావేశానికి హాజరయ్యేందుకు మంత్రి నిమ్మల బృందం సిద్ధమైంది. పోలవరం ఫేజ్-1లో 41.15 మీటర్ల కాంటూరులో సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టేందుకు రూ.12,832 కోట్లను వ్యయం చేయాల్సి ఉందని అంచనా వేశారు. ఈ పద్దు కింద ఇంకా రూ.6,609 కోటను వ్యయం చేయాల్సి ఉందని పీపీఏ గణాంకాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలసి.. భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల కోసం అడ్వాన్సుగా నిధులు మంజూరు చేయాలని కోరారు. ప్రాజెక్టును 2027 డిసెంబరునాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నందున, ఫిబ్రవరి నాటికే సహాయ, పునరావాస కార్యక్రమాలను పూర్తి చేయాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. భూసేకరణకు నిధుల విడుదలపై కేంద్రమంత్రి పాటిల్ ఈ సమీక్షలో ఇచ్చే హామీపై రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది.