Deputy Speaker Raghurama Raju: ఫేక్ పోస్టులపై డిప్యూటీ స్పీకర్ ఫిర్యాదు
ABN , Publish Date - Oct 26 , 2025 | 04:54 AM
రాజకీయ అస్థిరత సృష్టించేందుకు సోషల్ మీడియా ద్వారా ఫేక్ ప్రచారం చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు...
అస్థిరత సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి లేఖ
అమరావతి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): రాజకీయ అస్థిరత సృష్టించేందుకు సోషల్ మీడియా ద్వారా ఫేక్ ప్రచారం చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై తాను అనని మాటల్ని తన ఫొటోతో సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అంబోజి వినయ్ కుమార్‌పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ పార్టీల మధ్య ద్వేషం, అధికార కూటమిలో చిచ్చు రేపేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తుల్ని వదిలి పెట్టొద్దంటూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు లేఖ రాశారు. డీజీపీకి రాసిన లేఖతో పాటు వినయ్ కుమార్(జగన్ అన్న అభిమాని) అంటూ జగన్‌తో పాటు తన ఫొటో పెట్టుకున్న వినయ్ కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియా ఖాతా వివరాల స్ర్కీన్ షాట్లు జతచేశారు. రాష్ట్రంలో అస్థిరత సృష్టించడమే లక్ష్యంగా ఫేక్ పోస్టుల కుట్ర జరిగిందని.. బీఎన్‌ఎస్‌లోని 196(వర్గాల మధ్య విద్వేష ప్రేరణ), 353(శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రకటన), 356(వ్యక్తుల పరువుకు భంగం కలిగించడం) సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని కోరారు.