Deputy Speaker Raghu Rama: జగన్ ఇంట్లో కూర్చుని మాట్లాడితే కుదరదు
ABN , Publish Date - Oct 24 , 2025 | 04:14 AM
మాజీ సీఎం జగన్ తనకు భయపడి అసెంబ్లీకి రావడం లేదని తాను అనుకోవడం లేదని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణరాజు అన్నారు.
ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననడం సరికాదు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా
నేనూ ఆయన అభిమానినే.. డిప్యూటీ స్పీకర్ రఘురామ
సీతమ్మధార (విశాఖపట్నం), అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్ తనకు భయపడి అసెంబ్లీకి రావడం లేదని తాను అనుకోవడం లేదని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణరాజు అన్నారు. ప్రతిపక్షనేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననే వాదన సమంజసం కాదని, ఆయన ఇంట్లో కూర్చుని మాట్లాడితే కుదరదని అన్నారు. విశాఖ నగరం సీతమ్మధారలోని బీజేపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రఘురామ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా వచ్చేదీ లేనిదీ.. వచ్చే ఎన్నికల తర్వాతే తేలుతుందన్నారు. అయితే జగన్ ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షానికి నాయకుడిగా కూడా సభకు రావొచ్చని, వస్తేనే సమాధానం లభిస్తుందని అన్నారు. ఇంట్లో కూర్చుని మాట్లాడితే దానికి సమాధానం చెప్పాలా...? అని ప్రశ్నించారు. ‘జగన్ ఇంట్లో ఆయన... మా ఇంట్లో నేను మాట్లాడుకుంటే ఏం ఉపయోగం. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి’ అని హితవు పలికారు. పవన్‌కల్యాణ్ బాధ్యతగల మంత్రిగా, ప్రజాప్రతినిధిగా ఆలోచించి డీఎస్పీపై ఫిర్యాదు చేశారని రఘురామ అన్నారు. ఆయన అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. తాను డిప్యూటీ స్పీకర్‌గా కాకుండా.. ఆ ప్రాంత ఎమ్మెల్యేగా మాట్లాడానని అన్నారు. తానూ పవన్ అభిమానినేనని.. కొందరు అభిమానులు తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. భీమవరం డీఎస్పీని సపోర్టు చేయడం లేదని, ఆయన గురించి తన వద్ద ఉన్న సమాచారం మేరకే మాట్లాడానని వెల్లడించారు.