Deputy Minister Pawan: అడవుల రక్షణలో రాజీ లేదు
ABN , Publish Date - Oct 25 , 2025 | 05:23 AM
అడవులను సంరక్షించుకునే విషయంలో రాజకీయాలకు, రాజీలకు తావు లేదని ఉపముఖ్యమంత్రి, పర్యావరణం-అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
అటవీ భూముల ఆక్రమణలను ఉపేక్షించం: ఉపముఖ్యమంత్రి
రాష్ట్రానికి ఆకు పచ్చని గోడ నిర్మాణం.. వర్క్‌షా్‌పలో పిలుపు
అమరావతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): అడవులను సంరక్షించుకునే విషయంలో రాజకీయాలకు, రాజీలకు తావు లేదని ఉపముఖ్యమంత్రి, పర్యావరణం-అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా కొండపావులూరులోని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఆవరణలో శుక్రవారం జరిగిన రాష్ట్ర స్థాయి అధికారుల రెండ్రోజుల వర్క్‌షా్‌పలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అక్కడి ఎన్‌ఐఆర్‌టీలోని నక్షత్ర వనాన్ని పరిశీలించి, జమ్మి మొక్కను నాటారు. ‘గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ’ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. ‘అడవులు జాతి సంపద. ప్రతి అంగుళం అమూల్యం. కాపాడుకోవడం మనందరి బాధ్యత. వాటిని ఆక్రమించేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. గతంలో అటవీ మంత్రిగా ఉన్న వ్యక్తే సొంత ఇలాకాలో అటవీ భూములను ఇష్టానుసారం ఆక్రమించుకుంటే అప్పటి అధికారులు ఎందుకు మిన్నకుండిపోయారో అర్ధం కాలేదు. అలాంటి తప్పిదాలు కూటమి పాలనలో జరగడానికి వీల్లేదు’ అని స్పష్టం చేశారు. 2047 నాటికి రాష్ట్ర భూభాగంలో 50శాతం పచ్చదనంతో నిండేలా పని చేయాలన్నారు. 974 కిమీ తీర ప్రాంతంలో మడ అడవుల పెంపకం ప్రధానమని తెలిపారు. రాష్ట్రానికి ఆకు పచ్చని గోడ నిర్మాణానికి కృషి చేయాలని.. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ అనేది గొప్ప ప్రయత్నంగా తీసుకోవాలని సూచించారు.