Share News

Deputy CM Pawan: అభివృద్ధి, సంక్షేమంలో రాజీ పడొద్దు

ABN , Publish Date - Dec 14 , 2025 | 05:55 AM

రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించడంలో రాజీ పడొద్దని జనసేన పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు.

Deputy CM Pawan: అభివృద్ధి, సంక్షేమంలో రాజీ పడొద్దు

  • కూటమి డైరెక్షన్‌లో ఎమ్మెల్యేలు పనిచేయాలి.. కార్యకర్తల వెంట ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి

  • వన్‌ టూ వన్‌ కార్యక్రమంలో భాగంగా పోలవరం ఎమ్మెల్యే బాలరాజుతో పవన్‌ భేటీ..

  • పంచాయతీరాజ్‌ నిధుల వినియోగంపై ఆరా

అమరావతి, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించడంలో రాజీ పడొద్దని జనసేన పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. ప్రజలు తమ సంక్షేమంతోపాటు ప్రాంత అభివృద్ధిని కూడా కోరుకుంటున్నారనేది మరిచిపోవద్దని హితబోధ చేశారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో మంగళగిరిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో వన్‌ టూ వన్‌ సమావేశాలు నిర్వహించాలని పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు. వారానికి కనీసం ఒకరిద్దరిని కలవాలని ఆయన భావిస్తున్నారు. శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో భేటీ అయ్యారు. గత ఏడాదిన్నర కాలంలో పోలవరం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పంచాయతీరాజ్‌ నిధుల వినియోగం, ఎన్‌ఆర్‌జీఎస్‌ పనుల పురోగతితో పాటు ప్రభుత్వ పథకాల అమలు తీరు, వ్యవసాయ సంబంధిత అంశాలు, యువత ఉపాధి అవకాశాలపై ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ సమీక్షించారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రజల సంతృప్త స్థాయిని పెంచాలని నిర్దేశించారు. కూటమి ప్రభుత్వం నిర్దేశిత లక్ష్యంతో ముందుకు వెళుతోందని, జనసేన ఎమ్మెల్యేలు కూడా ఆ దిశగానే పని చేయాలని స్పష్టం చేశారు. ‘‘పోలవరం నియోజకవర్గంలోని ఐ.ఎస్‌ జగన్నాథపురం పర్యటనకు వెళ్లినప్పుడు కొయ్యలగూడెం మండలం నుంచి ఒక ఆడపడుచు పసిబిడ్డను ఎత్తుకొని వచ్చింది. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించమని కోరింది. ఆమె విజ్ఞప్తిని తక్షణమే పరిశీలించి తిమ్మనకుంట - గవరవరం మధ్యలో రెండు రోడ్ల నిర్మాణానికి రూ.7.60 కోట్లు మంజూరు చేయించాను. అలాంటి సమస్యలను ఎమ్మెల్యేగా గుర్తించి, వాటిని పరిష్కరించాలి. ప్రజలు తమ సంక్షేమం గురించే కాకుండా, తమ ప్రాంత అభివృద్ధి గురించీ ఆలోచిస్తున్నారు.


అందుకు అనుగుణంగా మనం ముందుకు వెళ్లాలి. అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి. అదే సమయంలో జనసేన శ్రేణులకు అందుబాటులో ఉంటూ, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలి.’’ అని సూచించారు. పోలవరం నియోజకవర్గంలో జనసేన నాయకులకు లభించిన నామినేటెడ్‌ పోస్టుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా, తన నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రతిపాదనలతో కూడిన వినతిపత్రాన్ని పవన్‌ కల్యాణ్‌కు బాలరాజు అందించారు. ఈ సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2025 | 05:56 AM