Share News

Illegal Gambling Allegations: భీమవరం డీఎస్పీపై పవన్‌ సీరియస్‌

ABN , Publish Date - Oct 22 , 2025 | 04:41 AM

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పేకాట నిర్వహణకు పోలీసులు సహకరిస్తున్నారన్న ఫిర్యాదులపై ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా స్పందించారు.

Illegal Gambling Allegations: భీమవరం డీఎస్పీపై పవన్‌ సీరియస్‌

  • పేకాట, జూదాలకు జయసూర్య ప్రోత్సాహం

  • పశ్చిమ ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన డిప్యూటీ సీఎం

  • తర్వాత డీజీపీతోనూ.. నివేదిక ఇవ్వాలని సూచన

  • తనకు అందిన ఫిర్యాదులు హోం మంత్రికి

  • విచారణకు ప్రభుత్వ ఆదేశాలు?

  • నివేదిక రాగానే జయసూర్యపై చర్యలు!

అమరావతి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పేకాట నిర్వహణకు పోలీసులు సహకరిస్తున్నారన్న ఫిర్యాదులపై ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా స్పందించారు. స్థానిక డీఎస్పీ జయసూర్య ఒక వర్గానికి కొమ్ము కాస్తూ చట్టవిరుద్ధమైన పేకాట, జూదం నిర్వాహకులకు వంత పాడుతున్నారని వరుస ఫిర్యాదులు అందడంతో జిల్లా ఎస్పీ నయీంతో ఆయన మంగళవారం ఫోన్లో మాట్లాడారు. పేకాట విషయంలో ఎందుకు గట్టిగా వ్యవహరించలేకపోతున్నారని ఆరా తీశారు. అనంతరం డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాతో కూడా డిప్యూటీ సీఎం ఫోన్లో మాట్లాడారు. పేకాట, డీఎస్పీ జయసూర్య పాత్ర, వ్యవహారశైలిపై నివేదిక కోరారు. అసాంఘిక, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు డీఎస్పీ స్థాయి అధికారి అండగా ఉండడాన్ని తీవ్రంగా పరిగణించాలని.. పోలీసులు ఇటువంటి వ్యవహారాలతోపాటు సివిల్‌ వివాదాల్లో తల దూర్చకుండా చూడాలని సూచించారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తే ఎవ్వరినీ ఉపేక్షించబోమనే సంకేతాన్ని పంపాలని స్పష్టం చేశారు. పేకాట నిర్వాహకులపై గేమింగ్‌ యాక్ట్‌ ప్రకారం కేసులు నమోదు చేయాలని, నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారనే ఫిర్యాదులపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. డీఎస్పీ జయసూర్యపై తనకు వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులను హోం మంత్రికి, డీజీపీకి తన కార్యాలయం నుంచి పవన్‌ పంపినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు. విచారణకు ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. ఆరోపణల్లో వాస్తవాలున్నట్లు తేలితే జయసూర్యపై సస్పెన్షన్‌ వేటు తప్పదనే ప్రచారం పోలీసు వర్గాల్లో నడుస్తోంది. పూర్తి స్థాయి నివేదిక అందాక తదుపరి చర్యలు చేపడతామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.


  • సివిల్‌ తగాదాల్లో జయసూర్య

  • బదిలీ నిలిపివేయించిన కీలక నేతతో అంటకాగుతున్న డీఎస్పీ

భీమవరం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): భీమవరం డీఎస్పీ గణేశ్‌ జయసూర్య సివిల్‌ తగాదాల్లో తలదూరుస్తున్నారని, ఓ వర్గం పేకాటలను ప్రోత్సహిస్తున్నారని బాధితులు ఇటీవల ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. భీమవరం డివిజన్‌ పరిఽధిలోని ఓ నియోజకవర్గంలో డీఎస్పీయే పేకాటలను ప్రోత్సహిస్తున్నారని లేఖలు కూడా రాశారు. ప్రభుత్వం గతంలో ఈయన్ను భీమవరం నుంచి బదిలీ చేసింది. అప్పట్లో జిల్లాలోని కూటమికి చెందిన ఓ కీలక ప్రజాప్రతినిఽధి ద్వారా జయసూర్య బదిలీని నిలిపివేయించుకున్నారని అప్పట్లో చర్చసాగింది. అప్పటి నుంచి సదరు నేతకు ఆయన దాసోహమయ్యారన్న ప్రచారం ఉంది. అంతే కాకుండా డివిజన్‌ పరిఽధిలోని ఇతర కూటమి నేతలను పెద్దగా పట్టించుకోవడం లేదని.. వారికి కనీస ప్రాధాన్యం కూడా ఇవ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో పేకాటలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపినా.. సదరు నియోజకవర్గంలో మాత్రం పోలీసులే పేకాటలకు లోపాయకారీగా సహకరిస్తున్నారని, నిర్వాహకులను డీఎస్పీ ప్రోత్సహిస్తున్నారన్న అభియోగాలు అధికమయ్యాయి. వ్యాపారులు, ఇతర తగాదాల్లోనూ పోలీసు వసూళ్లు ఎక్కువగా ఉన్నాయంటూ జయసూర్యపై ఫిర్యాదులు వెళ్లాయి. డిప్యూటీ సీఎం తీవ్రంగా పరిగణించి ఎస్పీ, డీజీపీతో మాట్లాడడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Updated Date - Oct 22 , 2025 | 04:43 AM