Deputy CM Pawan: స్మగ్లర్లలో భయం పుట్టిస్తాం
ABN , Publish Date - Nov 16 , 2025 | 04:26 AM
రాష్ట్రంలోని శేషాచలం అడవుల్లో లభ్యమయ్యే ఎర్రచందనం చెట్ల అక్రమ నరికివేత, రవాణాను నిరోధించేందుకు త్వరలో ‘ఆపరేషన్ కగార్’ తరహా ప్రత్యేక, పూర్తిస్థాయి ఆపరేషన్ ప్రారంభించనున్నట్లు ఉపముఖ్యమంత్రి.
ఎర్ర చందనాన్ని తాకే సాహసం చేయకుండా చేస్తాం
కొన్నేళ్లుగా జరిగిన దోపిడీకి భయంకరమైన సాక్ష్యాన్ని మంగళం గోడౌన్లలో చూశా
స్మగ్లర్లు, కింగ్‌పిన్లు అందరినీ గుర్తిస్తున్నాం.. అరెస్టులే కాదు.. ఆస్తులూ జప్తు చేస్తాం: పవన్
శేషాచలం నుంచి ఒక్క దుంగా బయటికి పోకూడదు.. టాస్క్‌ఫోర్స్‌కు మళ్లీ జీవం
పోసేలా సీఎంతో మాట్లాడతా.. నిఘా పెంచాలి.. చెక్‌పోస్టులు కట్టుదిట్టం చేయాలి
సమీక్షలో అటవీ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు
అమరావతి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని శేషాచలం అడవుల్లో లభ్యమయ్యే ఎర్రచందనం చెట్ల అక్రమ నరికివేత, రవాణాను నిరోధించేందుకు త్వరలో ‘ఆపరేషన్ కగార్’ తరహా ప్రత్యేక, పూర్తిస్థాయి ఆపరేషన్ ప్రారంభించనున్నట్లు ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. మళ్లీ ఎర్రచందనం చెట్లను తాకడానికి ఎవరూ ధైర్యం చేయకుండా స్మగ్లర్లలో భయం పుట్టిస్తామని హెచ్చరించారు. శనివారం ఆయన ‘ఎక్స్’లో ఈ విషయాన్ని వెల్లడించారు. శేషాచలం కేవలం అడవి మాత్రమే కాదని, ఏడు కొండలతో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి పవిత్ర నివాసమని పేర్కొన్నారు. ఇటీవల మంగళంలోని ఎర్రచందనం డిపో గోడౌన్లలో తనిఖీ చేసినప్పుడు.. కొన్నేళ్లుగా జరిగిన దోపిడీకి ఒక భయంకరమైన సాక్ష్యాన్ని చూసినట్లుందని అన్నారు. ‘అది ఒక నిశ్శబ్ధ శ్మశాన వాటిక. దాదాపు 2.6 లక్షల దుంగలు ఉన్నాయి. ఈ దొంగతనం విలువ రూ.5 వేల కోట్లు ఉండొచ్చు. ఇది రాష్ట్ర ఖజానా నుండి, మన జాతీయ భవిష్యత్ నుంచి నేరుగా దొంగిలించిన సొత్తు. ఇది మన ప్రజలకు చెందిన డబ్బు. రోడ్లు, పాఠశాలలు, అస్పత్రులు నిర్మించాల్సిన సొమ్ము’ అని పవన్ పేర్కొన్నారు. ‘కొంతమంది అటవీ భూములను అంత సులువుగా ఎలా ఆక్రమించగలరు? గతంలో వ్యవస్థాగతమైన వైఫల్యం, రాజకీయ సంకల్పం లేకపోవడం వల్ల యథేచ్ఛగా ఎర్ర చందనం చెల్ల నరికివేత, అక్రమ రవాణా జరిగింది’ అన్నారు. దోషులందరూ చట్టాన్ని, దాన్ని పర్యవసానాలను ఎదుర్కొనే సమయం వచ్చిందని స్పష్టం చేశారు. స్మగ్లర్లు, కింగ్‌పిన్‌లు, ఈ అక్రమ వ్యవహారంలో పాల్గొన్న అందరినీ గుర్తిస్తున్నామని, వారిని అరెస్ట్ చేయడమే కాదు, అటవీ చట్టం కింద వారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటామని, శేషాచలం పవిత్రతను కాపాడతామని పవన్ స్పష్టం చేశారు.
అక్రమార్కుల ఆట కట్టించాలి
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమార్కుల ఆట కట్టించాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. అడవి నుంచి ఒక్క దుంగ కూడా బయటకు పోకుండా పటిష్ట ప్రణాళిక రూపొందించాలని నిర్దేశించారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై శనివారం అటవీ అధికారులతో వర్చువల్‌గా సమీక్షించారు. పవన్ మాట్లాడుతూ ఎర్రచందనం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత శాతం ఎర్రచందనం విత్తనాలు చల్లడానికి, ఆ వనాల సంరక్షణకు కేటాయించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. అక్రమ రవాణా కింగ్‌పిన్‌లను చట్టం ముందు నిలిపేందుకు పోలీసు, అటవీ అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 2019-24 మధ్య లక్షలాది ఎర్రచందనం చెట్లు నరికి అక్రమంగా తరలించారని పేర్కొన్నారు. ఇక నుంచి ఒక్క దుంగ బయటకు పోకుండా మళ్లీ టాస్క్‌ఫోర్స్‌కు జీవం పోసేలా సీఎంతో మాట్లాడతానని పేర్కొన్నారు.
డ్రోన్లతో నిఘా పెంచాలి
వైసీపీ హయాంలో ఎర్రచందనం సరిహద్దులు దాటినా పట్టించుకోలేదని పవన్ సమీక్షా సమావేశంలో అన్నారు. కర్ణాటకలో రూ.140 కోట్ల ఎర్రచందనం పట్టుకున్నారని, దీనిపై కేంద్ర అటవీ మంత్రితో చర్చించానని, దేశంలో ఎక్కడ ఎర్రచందనం దుంగలు దొరికినా మనకే చెందేలా ఆదేశాలు ఇప్పించామని తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో పట్టుబడిన 407 టన్నుల ఎర్రచందనం వెనక్కి తెప్పిస్తున్నామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ఎగ్జిట్, ఎంట్రీ పాయింట్ల వద్ద థర్మల్ డ్రోన్లతో నిఘా పెంచాలని, చెక్‌పోస్టులు కట్టుదిట్టం చేయాలని, బేస్‌క్యాం్‌పలు, వాచ్ టవర్లలో గస్తీ ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రత్యేక ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేసి, అక్రమార్కులకు సహకరించే వారినీ పట్టుకుంటామని స్పష్టం చేశారు.
‘ప్లానెట్ కిల్లర్స్’లో శేషాచలం విధ్వంసం!
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను భారీ ఎత్తున నరికి, అక్రమంగా రవాణా చేసి, అడవిని ఎలా నాశనం చేశారో ‘ప్లానెట్ కిల్లర్స్’ అనే డాక్యుమెంటరీ కళ్లకు కట్టినట్టు వివరిస్తుందని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై రూపొందించిన ప్లానెట్ కిల్లర్స్ డాక్యుమెంటరీపై శనివారం ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘‘ఎర్రచందనం మాఫియా వెనుక ఉన్న అంతర్జాతీయ కింగ్‌పిన్‌లను, శేషాచలంలో జరిగిన క్రూరమైన హింసను, మనం కోల్పోయిన అటవీ అమరవీరులను ఈ డాక్యుమెంటరీ బహిర్గతం చేస్తుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో రాజకీయ ముసుగుల వెనుక దాక్కున్న నేరస్థులు సమాజానికి అత్యంత ప్రమాదకరం. స్మగ్లర్లతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం ద్వారా వారు ఎర్రచందనం అక్రమ రవాణాను తమ రాజకీయ భవిష్యత్‌కు ఇంధనంగా మార్చుకున్నారు. క్రూరమైన విధ్వంసంపై వాస్తవాలను ధైర్యంగా వెలుగులోకి తెచ్చి శేషాచలం అడవిని, దానిలో అంతరించిపోతున్న ఎర్రచందనం గురించి ప్లానెట్ కిల్లర్స్ డాక్యుమెంటరీలో చూపిన నిర్మాతలకు నా కృతజ్ఞతలు’’ అని పవన్ పోస్టు చేశారు. కాగా, విశాఖలోని మిత్ర గోడౌన్లో గో మాంసం అక్రమ నిల్వ చేసిన ముఠాల అసలు మూలాలు గుర్తించాలని పోలీసులను పవన్ ఆదేశించారు. ఈ నిల్వల వెనుక ఎవరున్నా ఉపేక్షించవద్దని స్పష్టంచేశారు. ఈ అంశంపై విశాఖ పోలీస్ కమిషనర్ నుంచి వివరాలు తెలుసుకున్నారు.
అది దుష్ప్రచారమే.. నిజం లేదు
శనివారం ‘సాక్షి’ మీడియాలో ప్రచురితమైన ‘జనసేనలో భూమి గోల’ అనే వార్తను డిప్యూటీ సీఎం కార్యాలయం ఖండించింది. సురేశ్ అనే వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పేషీలో ఉన్నారని రాశారని, అసలు ఆ పేరుతో పేషీలో ఎవరూ లేరని సృష్టం చేసింది. సివిల్ వివాదానికి, డిప్యూటీ సీఎం పేషీకి లింక్ పెట్టడం దుష్ప్రచారమేనని పేర్కొంది.