Share News

Deputy CM Pawan Kalyan: త్రికరణ శుద్ధితో పని చేస్తున్నాం

ABN , Publish Date - Sep 11 , 2025 | 04:13 AM

రాష్ట్రం బాగుండాలి. ఇంకా ఇంకా బాగుపడాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి. ఈ ఆకాంక్షతోనే కూటమి ప్రభుత్వం త్రికరణ శుద్ధితో పని చేస్తోంది.అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Deputy CM Pawan Kalyan: త్రికరణ శుద్ధితో పని చేస్తున్నాం

  • రాష్ట్రం బాగు పడాలన్నదే కూటమి ఆకాంక్ష

  • పెట్టుబడుల రాకతో సీమ యువతకు ఉపాధి

  • పారిశ్రామికీకరణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక

  • 2047 నాటికి దేశంలో ఏపీని నంబర్‌ వన్‌ చేస్తాం

  • ‘సూపర్‌ సిక్స్‌’ సభలో డిప్యూటీ సీఎం పవన్‌

’’శివతాండవం కావ్యం రచించిన కవి పుట్టపర్తి నారాయణాచార్యులు పుట్టిన నేల రాయలసీమ. తెలుగు భాష గౌరవం పెంచిన బళ్లారి రాఘవ లాంటి రంగస్థల ప్రముఖులు, విద్వాన్‌ విశ్వం, గజ్జల మల్లారెడ్డి లాంటి మహానుభావులు పుట్టిన నేల రాయలసీమ. కొందరు కవులు ‘రుతువులెన్ని ఉన్నా మా రాళ్ల సీమకు ఒకటే రుతువు. అదే కరువు రుతువు. కాలాలు ఎన్నున్నా మాకు ఒక్కటే కాలం అదే.. ఎండా కాలం’ అని వ్యాఖ్యానించారు. అయితే, ఆ పరిస్థితులను రూపుమాపేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది.’’

- ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

అనంతపురం, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రం బాగుండాలి. ఇంకా ఇంకా బాగుపడాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి. ఈ ఆకాంక్షతోనే కూటమి ప్రభుత్వం త్రికరణ శుద్ధితో పని చేస్తోంది.’’ అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. బుధవారం అనంతపురంలో నిర్వహించిన ‘సూపర్‌సిక్స్‌-సూపర్‌ హిట్‌’ సభకు సీఎం చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. సభకు విచ్చేసిన జన వాహినిని ఉద్దేశించి పవన్‌ ప్రసంగించారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రగతి, ప్రజల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు నాయకత్వంలో హామీలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు త్వరలో ప్రతి కుటుంబానికీ రూ.25లక్షల ఆరోగ్య బీమా అమలు చేయనున్నట్టు తెలిపారు. ‘‘రాళ్లసీమను రతనాల సీమగా మార్చే ప్రణాళికలతో సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.


పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం. గ్రామ స్వరాజ్య స్థాపన లక్ష్య సాధనలో భాగంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేరోజు గ్రామ సభలు నిర్వహించాం. ‘పల్లె పండుగ’ ద్వారా గ్రామాల్లో 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 2,007 కిలోమీటర్ల మేర బీటీ రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం. రైతులకు అండగా లక్షా 55 వేల నీటి కుంటలు నిర్మించాం. వీటి ద్వారా ఒక టీఎంసీ నీటిని నిల్వచేయగలిగాం. ప్రధాని మోదీ సహకారంతో ‘పీఎం జన్‌మన్‌’ పథకం అమలు చేస్తున్నాం. ఉపాధి హామీ పథకం నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రూ.1,005 కోట్లతో 625 గిరిజన గ్రామాలను అనుసంధానం చేస్తూ 1,069 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మిస్తున్నాం. తద్వారా గిరిజన ప్రాంతాల్లో నివసించే గర్భిణులకు డోలీ మోతల నుంచి విముక్తి కల్పించనున్నాం. రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో అటవీ ఏనుగుల బెడద నుంచి రక్షణ కల్పించేందుకు కర్ణాటక ప్రభుత్వ సహకారంతో నాలుగు కుంకీ ఏనుగులను తీసుకువచ్చాం.’’అని పవన్‌ చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అత్యంత కీలకమని, ఈ విషయంలో తరతమ బేధాలు లేకుండా ముందుకు వెళ్తామని శాసన సభ సాక్షిగా సీఎం అన్నారని గుర్తు చేశారు. తాను అదే మాట చెప్పానని, దానికి కట్టుబడి ముందుకు వెళ్తున్నామని తెలిపారు. 2047 నాటికి ఏపీని నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు.

Updated Date - Sep 11 , 2025 | 04:14 AM