Deputy CM Pawan: మహిళలతోనే సమాజంలో మార్పు సాధ్యం
ABN , Publish Date - Oct 12 , 2025 | 05:27 AM
సమాజంలో బలమైన మార్పు మహిళల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
పుస్తక పఠనంతో ఎన్నో నేర్చుకున్నా
‘ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తకావిష్కరణ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
పవన్ నా అభిమాన నాయకుడు: మంత్రి సత్యకుమార్
విజయవాడ, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): సమాజంలో బలమైన మార్పు మహిళల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. అందుకే జనసేన మహిళా విభాగానికి వీరమహిళ అని నామకరణం చేశామన్నారు. మన సంస్కృతిలో అత్యున్నత గౌరవం మహిళలకు ఉంటుందన్నారు. లక్ష్మీ ముర్డేశ్వర్ పురి రాసిన ‘ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో శనివారం జరిగింది. ఈ పుస్తకాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... ‘పుస్తకం ప్రభావం నాపై ఉంది. పుస్తక పఠనం ద్వారా ఎన్నో నేర్చుకున్నా. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అందుబాటులోకి వచ్చినా పుస్తక పఠనం ద్వారా మరింత విజ్ఞానం వస్తుంది. నేను మారిపోయానని కమ్యూనిస్టులు అంటున్నారు. నేను ఎప్పుడూ ఒకే ఆలోచనతో ఉంటాను. కమ్యూనిస్టు చరిత్ర, భారతీయ చరిత్ర, విశ్వదర్శనం వంటి పుస్తకాలు ఒకే సమయంలో చదివాను. అన్ని అంశాలపై లోతుగా పరిశీలన చేస్తా. మంచి పుస్తకాల కోసం తపన పడతాను. ఒక్కో పుస్తకంలో రాసే జీవితం, వాటిలో అంశాలు మనల్ని ప్రభావితం చేస్తాయి. ఓజీ అంటే ఏమిటి? అని ఎలా చూశారో... ‘ఆమె సూర్యుడిని కబళించింది’ అన్న టైటిల్ కూడా అలాగే ఉత్సుకతను రేకెత్తించేలా ఉంది. ఐఎ్‌ఫఎస్ చదువుకున్న లక్ష్మి నుంచి ఇలాంటి పుస్తకం రావడం ఆశ్చర్యం కలిగించింది. స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో ధీరోదాత్త వనిత మాలతి పోరాటాన్ని ఈ పుస్తకంలో ప్రస్తావించారు.
మనం దుర్గాదేవిని పూజిస్తాం. నేను ప్రతి మహిళనూ దుర్గాదేవిగా చూస్తాను. మా అమ్మ నాకు ఎంతో అండగా నిలిచింది. మా నాన్న బదిలీల కారణంగా అనేక ప్రాంతాలకు వెళ్లినా కొత్త ప్రదేశంలో అమ్మ అనేక అంశాలను మాకు చెప్పేది. ఎవరికీ భయపడకు... నిలబడు... పది దెబ్బలు తిన్నా ఎదురు తిరిగి ఒక్క దెబ్బయినా కొట్టు... అంటూ అమ్మ చెప్పేవారు. అటువంటి తల్లి, వదిన దగ్గర పెరిగిన నేను ఎన్నో నేర్చుకున్నా. ఈ పుస్తకం ఎంతోమందిలో స్ఫూర్తిని నింపుతుంది’ అని పవన్ కల్యాణ్ అన్నారు. వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ... ‘పురాతన కాలం నుంచి మన సమాజంలో మహిళలకు ప్రాధాన్యం ఉంది. అన్ని సాహిత్యాలను ఈ పుస్తకంలో మేళవించారు. ఆర్థిక శాఖ లక్ష్మీదేవి వద్ద, విద్యాశాఖ సరస్వతీదేవి వద్ద, రక్షణ శాఖ దుర్గామాత వద్ద ఉండేవి. ఇదంతా మన సంస్కృతిలో నిబిడీకృతమై ఉంది. ఏ దేశంలో ఇది కనిపించదు. సామాజిక, రాజకీయ, ఆర్థిక సమకాలీన అంశాలపై రాసిన పుస్తకం పవన్ కల్యాణ్ ఆవిష్కరించాల్సి ఉంది. అది జరగలేదు. పవన్ కల్యాణ్ సాహిత్యప్రియుడు. ఆయన నా అభిమాన నాయకుడు. పవన్ కల్యాణ్ ప్రభావం సమాజంపై ఉంది. ఆయన సినిమా పాటలో చేగువేరా ప్రస్తావన విని ఆయన గురించి తెలుసుకున్నా’ అని అన్నారు. కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఢిల్లీ బ్యూరో ఇన్‌చార్జి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.