Deputy CM Pawan: ఎర్రచందనం.. తాకితే తాట తీస్తాం
ABN , Publish Date - Nov 09 , 2025 | 04:43 AM
ప్రపంచంలో శేషాచలం అడవులకే పరిమితమైన ఎర్రచందనం వృక్షాలను ఇకపై ఎవరూ తాకొద్దని, ఒక్క చెట్టూ నరకడానికి వీల్లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఒక్క చెట్టు కూడా నరకడానికి వీల్లేదు
శ్రీవారి గాయం నుంచి వచ్చిన చెట్లవి
ఆ పవిత్ర వృక్షాలను నరికితే తీవ్ర పరిణామాలు
ఆపరేషన్ కగార్ తరహాలో స్మగ్లర్ల భరతం పడతాం
వారి ఆస్తులను స్వాధీనం చేసుకొనేలా చట్టం తెస్తాం
కింగ్‌పిన్‌లు, స్మగ్లర్లకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరిక
అటవీ శాఖ గోదాముల్లోని ఎర్రచందనం దుంగల పరిశీలన
మామండూరు అటవీ ప్రాంతంలో ఎకో టూరిజం పార్కు సందర్శన
తిరుపతి, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): ప్రపంచంలో శేషాచలం అడవులకే పరిమితమైన ఎర్రచందనం వృక్షాలను ఇకపై ఎవరూ తాకొద్దని, ఒక్క చెట్టూ నరకడానికి వీల్లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తిరుపతి కలెక్టరేట్‌లో శనివారం సాయంత్రం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘శేషాచలం అడవుల్లోనే ఎర్రచందనం ఉండటానికి ఓ ఆధ్యాత్మిక కారణం ఉంది. శ్రీ వేంకటేశ్వరస్వామి గాయం నుంచి పుట్టిన చెట్టు ఇది. అత్యంత పవిత్రమైన వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఆపరేషన్ కగార్ తరహాలో ఎర్రచందనం స్మగ్లర్లు, కింగ్‌పిన్‌లతో పాటు చెట్లను నరికేవారి తాట తీస్తాం’ అని పవన్ హెచ్చరించారు. తిరుపతి గోదాములో 2.60 లక్షల ఎర్రచందనం దుంగల నిల్వలు ఉన్నాయని, రెండు దుంగలు కలిపి ఒక చెట్టుగా లెక్కించినా గత ఐదారేళ్లలో 1.30 లక్షల వృక్షాలు నరికివేతకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్మగ్లర్ల నుంచి పట్టుబడిన ఈ కలప మార్కెట్ విలువ రూ.5వేల కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. ఇక పట్టుబడని ఎర్రచందనం ఎంత పరిమాణంలో సరిహద్దులు దాటిందో అంతుబట్టడం లేదన్నారు.
గడచిన ఐదారేళ్లలోనే రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల విలువైన ఎర్రచందనం అక్రమ రవాణా జరిగిందని, దీనికి గత ప్రభుత్వ యంత్రాంగం అలసత్వమే కారణమని ఆయన ఆరోపించారు. ఎర్రచందనం నరికినా, అక్రమంగా రవాణా చేసినా వారిపై కేసులు పెట్టడంతో సరిపెట్టుకోకుండా వారి ఆస్తులు కూడా స్వాధీనం చేసుకునేలా చట్టం తీసుకొస్తామని హెచ్చరించారు. ఇతర దేశాల్లో పట్టుబడే ఎర్ర దుంగల్ని మన దేశానికి అప్పగించేలా కేంద్రం విధానం తీసుకొచ్చిందని, అయితే ఇతర రాష్ట్రాల్లో పట్టుబడే ఎర్రచందనం మాత్రం ఏపీకి రావడం లేదని పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ఏ రాష్ట్రంలో ఎర్రచందనం పట్టుబడినా దాన్ని ఏపీకి అప్పగించేలా అన్ని రాష్ట్రాలతో ఒప్పందం చేసుకోవాలన్నారు.
నలుగురు కింగ్‌పిన్‌లను గుర్తించాం
ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించి తెర వెనుక కీలకపాత్ర పోషిస్తున్న నలుగురు కింగ్ పిన్‌లను గుర్తించామని పవన్ వెల్లడించారు. వారిని పట్టుకునే విషయమై కసరత్తు నడుస్తోందని తెలిపారు. స్మగ్లర్ల తరఫున చెట్లు నరికే పని చేపట్టవద్దంటూ స్థానికులను కోరారు. ఇతర రాష్ట్రాల కూలీలకు కూడా అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్ స్వచ్ఛందంగా ఆపేయాలని లేకుంటే చెట్టు కొట్టాలంటేనే భయపడేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆపరేషన్ కగార్ తరహాలో కార్యాచరణ చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నామని, 6 నుంచి 9 నెలల్లో ఆపరేషన్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎం సుడిగాలి పర్యటన
తిరుపతి పరిసరాల్లో పవన్ శనివారం సుడిగాలి పర్యటన చేపట్టారు. ఉదయం 9.30 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి రేణిగుంట మండలం మామండూరు చేరుకుని అటవీ ప్రాంతంలోని ఎకో టూరిజం పార్కును సందర్శించారు. జలపాతం నుంచి వెళ్లే వాగు వెంబడి కొంతదూరం నడిచారు. కొంతసేపు వాగులో దిగి ప్రకృతి ఒడిలో సేద దీరారు. అడవిలో పలు చెట్ల పేర్లు, ప్రత్యేకతలను అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాచ్‌టవర్ ఎక్కి శేషాచలం అడవులను పరిశీలించారు. తిరుపతి మంగళంలో అటవీశాఖ నిర్వహిస్తున్న 8గోదాముల్లో నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగలను ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ చేరుకుని తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం, నంధ్యాల జిల్లాల డీఎ్‌ఫవోలు, ఎస్పీలు, ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్‌ఫోర్స్ అధికారులతో సమావేశమయ్యారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను పూర్తిగా అరికట్టే విషయమై తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు.