Deputy CM Pawan: పోలీసులను బెదిరిస్తే ఊరుకోం
ABN , Publish Date - Dec 17 , 2025 | 04:47 AM
కానిస్టేబుళ్లు పోలీసు శాఖకు మూల స్తంభా లు.. పోలీసు శాఖలో నైతిక విలువలతోపాటు ప్రజల పట్ల సేవాభావంతో మెలగండి’’ అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.
ఎవరు రెచ్చిపోయినా ఉపేక్షించం
డిప్యూటీ సీఎం పవన్ హెచ్చరిక
శాంతిభద్రతలపై రాజీ లేదు
కానిస్టేబుల్ కేవలం పోస్టు కాదు.. బాధ్యత: పవన్
‘‘నూతన కానిస్టేబుళ్లకు ఇది ఉద్యోగ ప్రారంభ సందర్భం మాత్రమే కాదు.. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుగా వారు మారే బాధ్యత. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు. నాలుగేళ్ల నిరీక్షణకు ముగింపు. పోలీసు వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పునరుద్ధించాలన్న రాజకీయ పరిపాలనా సంకల్పానికి ప్రతీక.’’
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అమరావతి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ‘‘కానిస్టేబుళ్లు పోలీసు శాఖకు మూల స్తంభా లు.. పోలీసు శాఖలో నైతిక విలువలతోపాటు ప్రజల పట్ల సేవాభావంతో మెలగండి’’ అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణసందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్స్ ప్రాంగణంలో నియామక పత్రాల జారీ పండగలా జరిగింది. ఏపీ పోలీసు శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఏ రాష్ట్రంలో అయినా శాంతి భద్రతలు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని, ఖాకీ బలంగా ఉంటేనే రాష్ట్రం ముందుకు వెళుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ‘‘నాలుగు లక్షల దరఖాస్తుల్లో నుంచి కేవలం 6100మంది ఎంపికై అందులో 5,757 మంది ఇవాళ ఖాకీ ధరిస్తున్నారు. అయితే, ఈ గణాంకాల వెనుక ఎన్నో కుటుంబాల కన్నీళ్లు, ఆశలు కోల్పోయిన మూడేళ్ల విలువైన కాలం దాగి ఉన్నాయి. ఆ కాలాన్ని తిరిగి మీకు ఇవ్వలేం. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. 2022లో నోటిఫికేషన్ ఇచ్చి న్యాయ పరమైన చిక్కులు పట్టించుకోని గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది.’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
పంచాయతీరాజ్ శాఖలో పదివేల మందికి పదోన్నతులు ఇచ్చామని, అవినీతి రహిత పాలన అందించేందుకు నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. ఈ పండగ వాతావరణానికి కారణమైన మంత్రి లోకేశ్ రాలేక పోవడం వెలితిగా ఉందని తెలిపారు. కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థుల తల్లితండ్రుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందని, వారిలో తన తల్లితండ్రుల్ని చూసుకున్నానన్నారు. ‘‘మాజీ సీఎం (జగన్) పోలీసు అధికారులను బెదిరిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏదేదో చేస్తామంటూ ఆయన మాట్లాడుతున్నారు.. పోలీసులను బెదిరిస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. చంద్రబాబు నేతృత్వంలో గట్టిగా బదులిస్తాం. పోలీసు అధికారే కాదు, కానిస్టేబుల్ గౌరవానికి భంగం కలిగించినా ఉపేక్షించబోం.’’ అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. రాష్ట్ర సుస్థిరత, యువత భవిష్యత్తు కోసం కూటమిగా ఏర్పాటై మాటిచ్చామని, ఆ ప్రకారమే నడుస్తున్నామన్నారు. ‘‘ఉత్తరప్రదేశ్ లాంటి చోట పెట్టుబడులు, ప్రగతికి ప్రధాన కారణం అక్కడ శాంతి భద్రతలు అదుపులో ఉండటమే. ఈ విషయం ఇటీవల కలిసినప్పుడు యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఏపీలో కూడా ఎవరు రెచ్చిపోయినా ఉపేక్షించే ప్రసక్తే లేదు.’’ అని స్పష్టం చేశారు. తాను కూడా ఒక కానిస్టేబుల్ కుమారుడినేనని ఆయన గుర్తు చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గంజాయి, బెట్టింగ్స్ యథేచ్ఛగా సాగాయని, ఉగ్రమూలాలు కూడా కనిపించాయన్నారు. ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధపడాలని యువ కానిస్టేబుళ్లకు పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేశారు.
ప్రజాభద్రతే ప్రగతికి పునాది
ప్రజా భద్రతే ప్రగతికి పునాది అనే స్పష్టమైన దృక్పథంతో చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళుతోందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఇన్విజబుల్ పోలీసింగ్‌తో రాష్ట్రంలో శాంతి భద్రతలు మరింత బలోపేతం చేస్తామన్నారు. ఏపీలో తొలిసారి పోలీసు అకాడమీ ఏర్పాటు చేసిన ఘనత టీడీపీదేనని గుర్తు చేశారు. ఆరువేల ఉద్యోగాలకు ఐదు లక్షల దరఖాస్తు రావడం యువతలో పోలీసు ఉద్యోగం పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనం అన్నారు. నేరం జరగక ముందే అడ్డుకోవడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం టెక్నాలజీని విస్తృతంగా వినియోగిస్తూ, వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తోందని తెలిపారు. సీసీ టీవీలు, డ్రోన్లు, ఆధునిక ఫోరెన్సిక్‌ను వినియోగంలోకి తీసుకొచ్చామని వివరించారు. ఎంపికైన కానిస్టేబుళ్లలో ఉత్తరాంధ్రులే అధికంగా ఉన్నారని సరదాగా అనిత వ్యాఖ్యానించారు. శక్తి టీమ్స్ ద్వారా మహిళలకు భద్రతను బలోపేతం చేసినట్లు తెలిపారు. పోలీస్ చొక్కా ప్రజలకు భరోసా కావాలని హోంమంత్రి సూచించారు.