Deputy CM Pawan: భగవద్గీత సందేశమే మార్గనిర్దేశం
ABN , Publish Date - Dec 08 , 2025 | 05:11 AM
భగవద్గీత సందేశం అందరికీ మార్గనిర్దేశం కావాలని, సమాజాన్ని బలోపేతం చేయడం ద్వారా జాతీయస్ఫూర్తిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.
ఉడుపి.. ఓ ఆధ్యాత్మిక శక్తి కేంద్రం
శ్రీకృష్ణుడి దర్శనం నా అదృష్టం
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
కర్ణాటకలోని ఉడుపి శ్రీకృష్ణ మఠం సందర్శన
బృహత్ గీతోత్సవం’ కార్యక్రమానికి హాజరు
బెంగళూరు, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): భగవద్గీత సందేశం అందరికీ మార్గనిర్దేశం కావాలని, సమాజాన్ని బలోపేతం చేయడం ద్వారా జాతీయస్ఫూర్తిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఆదివారం ఆయన కర్ణాటకలోని ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించారు. విజయవాడ నుంచి మంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కల్యాణ్.. అక్కడి నుంచి రోడ్డుమార్గాన ఉడుపికి చేరుకున్నారు. శ్రీకృష్ణమఠం ప్రాంగణంలోకి చేరుకోగానే పవన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీకృష్ణుడిని దర్శించుకొన్న తర్వాత మఠంలోకి వెళ్లారు. అక్కడ పర్యాయ పుత్తిగె మఠాధిపతి సుగుణేంద్రతీర్థ స్వామీజీ ఆశీస్సులు పొందారు. ఉడుపి అష్టమఠాలకు చెందిన ఇతర స్వామీజీల ఆశీస్సులు కూడా తీసుకున్నారు. అనంతరం అక్కడ నిర్వహించిన ‘బృహత్ గీతోత్సవ’ కార్యక్రమంలో సుగుణేంద్రతీర్థ స్వామీజీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. పవిత్ర భూమి ఉడుపిని దేశ ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా అభివర్ణించారు. శ్రీకృష్ణుడు కొలువై ఉండే ఈ నేలపై అడుగు పెట్టడం తన అదృష్టమన్నారు. కోటి భగవద్గీత లేఖన యజ్ఞం నుంచి లక్ష కంఠ పారాయణం వరకు చేపట్టిన కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని పేర్కొన్నారు. ‘జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జైహింద్’ అంటూ పవన్ తన సందేశాన్ని ముగించారు. వేదికపై పవన్ కల్యాణ్‌కు సుగుణేంద్రతీర్థ స్వామీజీ మైసూరు తలపాగాతో సత్కరించి.. శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని, మజ్జిగ కవ్వాన్ని బహూకరించారు.
ఇదే విషయాలను ఆయన సోషల్ మీడియాలోనూ పంచుకున్నారు. కాగా, పవన్ కల్యాణ్ నవంబరులోనే ఉడుపి మఠాన్ని సందర్శిస్తారని ప్రచారం జరిగింది. అయితే అది పలు కారణాలతో వాయిదా పడింది. ఆదివారం మఠానికి వచ్చిన పవన్‌ను చూసేందుకు స్థానికులతో పాటు భక్తులు పెద్దఎత్తున వచ్చారు. నవంబరు 28న లక్ష కంఠ గీతాపారాయణం ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనగా.. ముగింపు కార్యక్రమంలో పవన్ కల్యాణ్ భాగస్వామి అయ్యారు.