Deputy CM Pawan Kalyan: ఇచ్చిన మాట కోసం..!
ABN , Publish Date - Dec 25 , 2025 | 04:49 AM
వైసీపీ హయాంలో దాష్టీకాలకు ఎదురొడ్డి నిలిచిన ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ వెళ్లారు.
ఇప్పటం గ్రామంలో పవన్ కల్యాణ్ పర్యటన
గతంలో వైసీపీ దాష్టీకాలను ఎదుర్కొన్న నాగేశ్వరమ్మ ఇంటికి ఉపముఖ్యమంత్రి
సంక్రాంతి కానుకగా చీర బహూకరణ
ఖర్చుల నిమిత్తం మరో రూ.50 వేలు
ప్రతి నెలా తన వేతనం నుంచి 5 వేలు
ఆమె మనవడి చదువుకు రూ.లక్ష సాయం
క్యాన్సర్ బాధితుడైన కొడుక్కిసీఎం సహాయ నిధి నుంచి 3 లక్షలు
తాడేపల్లి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో దాష్టీకాలకు ఎదురొడ్డి నిలిచిన ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ వెళ్లారు. ఆమె యోగక్షేమాలు తెలుసుకుని పరామర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామానికి చెందిన నాగేశ్వరమ్మ తదితరులు.. జగన్ ప్రభుత్వ హయాంలో జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారు. ఆ అక్కసుతో రోడ్డు విస్తరణ పేరిట గ్రామంలో వారి ఇళ్లను అధికారులు కూల్చివేశారు. గత పాలకుల దాష్టీకాలకు ఎదురు నిలిచిన నాగేశ్వరమ్మ.. ‘నా బిడ్డ పవన్‌కల్యాణ్ వస్తారు... మీ బెదిరింపులకు భయపడం’ అంటూ రోడ్డెక్కారు. ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ ఆ గ్రామానికి వెళ్లి నాగేశ్వరమ్మను కలిసి.. ఇంటి కొడుకుగా అండగా ఉంటానని ప్రకటించారు. గెలిచాక తన ఇంటికి రావాలని నాగేశ్వరమ్మ కోరగా.. ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం బుధవారం ఆ ఇంటికి ఆయన వెళ్లారు. ఆమెను అక్కున చేర్చుకుని అండగా ఉంటానని.. అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. ‘అమ్మా నీ పెద్ద కొడుకును వచ్చా.. బాగున్నావా... ఆరోగ్యం ఎలా ఉంది... నాలుగు రోజులుగా నిన్ను చూసేందుకు వద్దామంటే అధికారిక కార్యక్రమాల వల్ల వీలుపడలేదు.. నీకిచ్చిన మాట కోసం ఈ రోజు పనులన్నీ వాయిదా వేసుకుని నీకోసం వచ్చా..’ అని ఆప్యాయంగా మాట్లాడారు. నాగేశ్వరమ్మ ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం పవన్ ఆమెకు సంక్రాంతి కానుకగా చీర బహూకరించారు. ఖర్చుల నిమిత్తం మరో రూ.50 వేలు అందజేశారు. ఈ రోజుకీ కుటుంబ పోషణ నిమిత్తం పొలం పనులకు వెళ్తున్నానని నాగేశ్వరమ్మ చెప్పడంతో ప్రతి నెలా తన జీతం నుంచి రూ.5 వేలు ఆమె పోషణ నిమిత్తం పంపుతానని ఆయన హామీ ఇచ్చారు. దివ్యాంగుడైన నాగేశ్వరమ్మ మనవడు మనోజ్‌సాయి చదువు నిమిత్తం రూ.లక్ష సాయం అందజేశారు. ఆమె కుమారుడు కొండయ్య క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలుసుకుని చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.3 లక్షలు అందజేశారు. అనంతరం నీ ఆరోగ్యం జాగ్రత్తమ్మా అని చెప్పి పవన్ వెనుదిరిగారు.
పవన్‌కు ఘనస్వాగతం..
పవన్ రాకను పురస్కరించుకుని ఇప్పటం గ్రామం ప్రజలు, జనసైనికులతో నిండిపోయింది. కొలనుకొండ, ఇప్పటం గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా జనం ఆయనకు ఘన స్వాగతం పలికారు. పలువురు యువత సీఎం పవన్ అంటూ నినాదాలు చేశారు. ఆయన దాదాపు 25 నిమిషాలు గ్రామంలో ఉన్నారు. ఈ పర్యటనలో శాసనమండలి విప్ పిడుగు హరిప్రసాద్, ఏపీఎంఎ్‌సఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కల్యాణ శివశ్రీనివాస్, పార్టీ నేతలు గంజి చిరంజీవి, జొన్నా రాజేశ్, సామల నాగేశ్వరరావు, తిరుమలశెట్టి కొండలరావు, అంబటి తిరుపతిరావు, సాధు చంద్రశేఖర్, టీడీపీ నేతలు దాసరి కృష్ణ, కొల్లి శేషు, శంకరశెట్టి పిచ్చయ్య, సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.