Deputy CM Pawan: అవినీతి రహిత పాలనకు కృషి
ABN , Publish Date - Dec 09 , 2025 | 05:52 AM
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాటామంతి కార్యక్రమం నిర్వహించనున్నారు.
రేపు పీఆర్, ఆర్డీ ఉద్యోగులతో పవన్ కల్యాణ్ మాటామంతీ
అమరావతి, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాటామంతి కార్యక్రమం నిర్వహించనున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో పంచాయతీరాజ్ (పీఆర్) ఉద్యోగులతో బుధవారం ఆయన ముచ్చటించనున్నారు. ఈ సందర్భంగా పంచాయతీల్లో అవినీతి రహిత పాలన అందించేందుకు సహకరించాలని ఆయన కోరనున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పంచాయతీరాజ్‌లో దాదాపు 10 వేల మంది ఉద్యోగులకు కూటమి సర్కారు పదోన్నతులు కల్పించింది. అలాగే గ్రామీణాభివృద్ధి (ఆర్డీ) శాఖలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పదోన్నతులు, వేతనాల పెంపుతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాల అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. కొత్త సంవత్సరంలో వారికి తీపి కబురు అందించి సంక్రాంతి కల్లా ఈ ప్రయోజనాలు దక్కేలా చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో పీఆర్, ఆర్డీ ఉద్యోగులు, అధికారులతో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మాటామంతి నిర్వహించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ భేటీలో ఉద్యోగులతో పవన్ కల్యాణ్ స్వయంగా మాట్లాడి.. ఎలాంటి విధానాలు అవలంబిస్తే గ్రామీణులకు విస్తృత సేవలు అందించగలమో తెలుసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోని అన్ని కేడర్ల ఉద్యోగులు పాల్గొననున్నారు.