Share News

Deputy CM Pawan Kalyan: భయపెట్టడం కాదు

ABN , Publish Date - Sep 20 , 2025 | 05:12 AM

ప్రాక్టికల్‌గా చూస్తే కాలుష్యం లేకుండా ఒక్క పరిశ్రమ కూడా లేదని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Deputy CM Pawan Kalyan: భయపెట్టడం కాదు

  • కాలుష్య సమస్యకు పరిష్కారం కావాలి

  • నిబంధనలను కఠినంగా అమలు చేస్తే

  • ఎన్ని ఇండస్ట్రీలు మూతబడిపోతాయో!

  • ప్లాస్టిక్‌కు బదులు బయో-డీగ్రేడబుల్‌

  • వినియోగంపై అవగాహన కల్పించాలి

  • కాలుష్యంపై రోజంతా చర్చించాలి: పవన్‌

అమరావతి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రాక్టికల్‌గా చూస్తే కాలుష్యం లేకుండా ఒక్క పరిశ్రమ కూడా లేదని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. నిబంధనలను గట్టిగా అమలు చేస్తే అవి మూతబడిపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. వాటితో చర్చించి కాలుష్య నియంత్రణ చేసేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. శుక్రవారం కాలుష్య నియంత్రణపై శాసనసభ వేదికగా టీడీపీ విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేసిన ఆరోపణలకు పవన్‌ ఘాటుగా, సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. ‘‘రాంకీ యాజమాన్యానికి ఇప్పటికే షోకాజ్‌ నోటీసు జారీ చేసి చర్యలు తీసుకున్నాం.. ఇదొక్కటే కాదు.. ఇలాంటి పరిశ్రమలు వందల్లో ఉన్నాయి. ఒక పరిశ్రమను టార్గెట్‌ చేసుకుని ఉద్దేశపూర్వకంగా చర్యలు చేపడితే గత ప్రభుత్వంలో మాదిరిగానే ఉంటుంది. ముఖ్యమంత్రి ఉద్దేశం కూడా అది కాదు. రూ.వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చిపెడుతున్న ఆక్వా రంగం నుంచి ఎంత కాలుష్యం వస్తుందో అందరికీ తెలుసు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని పారిశ్రామికవేత్తలను భయపెట్టడమా.. లేక వారిని కూర్చోబెట్టి కాలుష్యం వల్ల వాటిల్లుతున్న అనర్థాలను వివరించి.. వారితోనే కాలుష్య నియంత్రణ చేయించడమా అనేది ఆలోచించాలి’ అని చెప్పారు.


తల్లిపాలూ కలుషితమవుతున్నాయ్‌!

ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు చిరిగిపోయి భూమి, నీరు, గాలిలో కలిసిపోవడం వల్ల.. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ఎంత ప్రమాదం వాటిల్లుతుందో కూడా అందరికీ తెలుసని పవన్‌ అన్నారు. ‘చివరకు తల్లి పాలు కూడా కలుషితమైపోతున్న పరిస్థితి. అలాగని ఫ్లెక్సీలను పూర్తిగా నిషేధిద్దామంటే.. వాటి తయారీపై ఆధారపడి జీవిస్తున్న వేల కుటుంబాలు రోడ్డున పడిపోతాయి. ప్లాస్టిక్‌కు బదులు బయో-డీగ్రేడబుల్‌ మెటీరియల్‌ వినియోగంపై వారికి అవగాహన కల్పించడం ద్వారా మార్పు తీసుకురావాలి. ఇలా చిన్నపాటి ఫ్లెక్సీల విషయంలోనే ఇంతగా ఆలోచించాల్సి వస్తుంటే.. ఇక విస్తృత స్థాయిలో ఉన్న పరిశ్రమలపై కాలుష్య నియంత్రణ నిబంధనలను కఠినంగా అమలు చేస్తే జరిగే పరిణామాలను ఊహించండి. ప్రాక్టికల్‌గా చూస్తే కాలుష్యం లేకుండా ఒక్క పరిశ్రమ కూడా లేదు. వాటన్నింటిపై నిబంధనలను కఠినంగా అమలు చేస్తే ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయనే భయం నాకే కాదు.. ముఖ్యమంత్రికి కూడా ఉంది. దీనిపై విస్తృత స్థాయిలో చర్చ జరగాలి. అత్యంత ప్రమాదకరమైన ఈ అంశంపై శాసనసభలో ఒక రోజంతా ప్రత్యేకంగా చర్చించాలి. ప్రజలు బాధ్యతారహితంగా ప్లాస్టిక్‌ వస్తువుల్లో ఇలా తినేసి.. అలా పారేస్తున్నారు. వాటిని నేను, ముఖ్యమంత్రి వచ్చి తీయలేం కదా! ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగం ప్రజల దైనందిన జీవితంలో అంతర్భాగమైపోయింది. రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించి పర్యావరణాన్ని పరిరక్షించడానికి అవసరమైన నిధులు కూడా మనకు అందుబాటులో లేవు. కాబట్టి ప్రజల్లోనే మార్పు తీసుకురావాలి’ అని స్పష్టం చేశారు. ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుందన్నారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.


ప్రభుత్వ నిబద్ధతను చాటేందుకు రాష్ట్ర సచివాలయం మొత్తాన్ని ప్లాస్టిక్‌ రహిత జోన్‌గా ప్రకటించామని గుర్తుచేశారు. సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్‌ రఘురామరాకృష్ణంరాజు మాట్లాడుతూ.. బ్రాందీ అమ్మకాలకు కూడా ప్లాస్టిక్‌ సీసాలను వినియోగిస్తున్నారని, వాటిని వృథాగా పారేయకుండా తిరిగి ఇస్తే 10 రూపాయలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విధానం కేరళ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని చెప్పారు. ఫ్లెక్సీలకు బదులుగా డిజిటల్‌ బోర్డులను ప్రోత్సహిస్తే బాగుంటుందని సూచించారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని నియంత్రించాలని జనసైనికులకు మీరు (పవన్‌ కల్యాణ్‌) పిలుపునిస్తే చాలావరకు కట్టడి చేస్తారని నవ్వుతూ అన్నారు. కాకినాడ అర్బన్‌ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కూడా ఈ అంశంపై మాట్లాడారు.

Updated Date - Sep 20 , 2025 | 05:12 AM