Share News

Deputy CM Pawan: ఇక పంచాయతీల్లో పాలన పరుగు

ABN , Publish Date - Dec 04 , 2025 | 04:53 AM

జిల్లాల్లో పాలనను బలోపేతం చేయడం, సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించేందుకు పంచాయతీరాజ్‌ వ్యవస్థలకు పదునుపెట్టారు.

Deputy CM Pawan: ఇక పంచాయతీల్లో పాలన పరుగు

  • మినీ కలెక్టరేట్లుగా డీడీవో కార్యాలయాలు

  • పాలన బలోపేతం.. సమన్వయంతో అభివృద్ధి

  • డీడీవోలకు కీలక బాధ్యతలు

  • డీడీవో కార్యాలయాల సముదాయంలోకి డీఎల్‌పీవో, డ్వామా ఏపీడీ, ఇతర ఆఫీసులు

  • నేడు చిత్తూరు నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం పవన్‌

అమరావతి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాల్లో పాలనను బలోపేతం చేయడం, సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించేందుకు పంచాయతీరాజ్‌ వ్యవస్థలకు పదునుపెట్టారు. డివిజన్‌ స్థాయిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించే శాఖలన్నింటినీ ఒకే పరిపాలన నియంత్రణలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. డివిజనల్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌(డీడీవో) కార్యాలయాల ద్వారా సమన్వయం చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థంగా అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. గతంలో ఉన్న బ్లాక్‌ డెవల్‌పమెంట్‌ అధికారుల తరహాలో ఇప్పుడు డివిజన్‌ స్థాయిలో డీడీవో వ్యవస్థను తీసుకొచ్చింది. ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పించడం ద్వారా నియమితులైన డీడీవోలు డివిజన్‌ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు రథసారథులుగా నిలవనున్నారు. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పంచాయతీరాజ్‌ సంస్కరణలు తీసుకురావడంతో డీడీవోలకు విశేష అధికారాలు సంక్రమించాయి. జిల్లాలో కలెక్టరేట్‌ తర్వాత మినీ కలెక్టరేట్‌ స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాలకు చిరునామాగా డీడీవో కార్యాలయాలను చేసేందుకు గతంలో ఇచ్చిన డీడీవోల జాబ్‌చార్ట్‌కు సవరణలు చేసి సమగ్రంగా రూపొందించారు. ఆ మేరకు జీఓ నంబర్‌ 58 విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో పవన్‌కల్యాణ్‌ పంచాయతీరాజ్‌ శాఖలో కీలక సంస్కరణలు ప్రారంభించారు. డివిజన్‌ స్థాయిలో ఉన్న డివిజనల్‌ పంచాయతీ ఆఫీసు(డీఎల్‌పీవో), డ్వామా అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌(ఏపీడీ), ఇతర శాఖలకు సంబంధించిన డివిజనల్‌ కార్యాలయాలను డీడీవో కార్యాలయాల సముదాయంలోకి మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురువారం చిత్తూరు నుంచి పవన్‌కల్యాణ్‌ వర్చువల్‌గా రాష్ట్రవ్యాప్తంగా డీడీవో కార్యాలయాలను ప్రారంభించనున్నారు.


గ్రామ పంచాయతీల పాలన

పంచాయతీలకు సంబంధించి గ్రామ పంచాయతీ డెవల్‌పమెంట్‌ ప్లాన్‌(జీపీడీపీ)లను డీడీవోలు రూపొందించి అమలు చేస్తారు. ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు పన్నుల పెంపు, ఫీజు వసూలు తదితర వాటికి అనుమతిస్తారు. లేఅవుట్లు, బిల్డింగ్‌ రూల్స్‌కు సంబంధించి పర్యవేక్షణ చేస్తారు. నెలకు కనీసం మూడు గ్రామ పంచాయతీలను తనిఖీ చేయడంతో పాటు డివిజనల్‌ పంచాయతీ అధికారి(డీఎల్‌పీవో)పై పాలనాపరమైన అధికారాలు కలిగి ఉంటారు. డీఎల్‌పీవోల టూర్‌ డైరీలను సమీక్షిస్తారు. ఆయా డివిజన్లలో డీఎల్‌పీవో పోస్టులు ఖాళీగా ఉంటే ఆ బాధ్యతలన్నీ డీడీవోలు నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీల్లో సుస్థిర అభివృద్ధి సూచికల పురోగతిని సమీక్షిస్తారు. పన్ను వసూళ్లపై సమీక్ష, శానిటేషన్‌, ఘనవ్యర్థాల నిర్వహణ, మెషినరీ ఉపయోగించడం, ఆర్‌డబ్ల్యూఎస్‌ ద్వారా తాగునీటిని వేసవిలో సరఫరా చేయడం, పంచాయతీల ఆస్తుల రక్షణ, కబ్జాలను తొలగించడం తదితర 16 రకాల అధికారాలను గ్రామపంచాయతీలపై డీడీవోలు కలిగి ఉంటారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి డ్వామా ఏపీడీలపై అధికారాలు కలిగి ఉంటారు. గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనుల పర్యవేక్షణలో కీలకంగా వ్యవహరిస్తారు. అవకతవకలపై కలెక్టర్‌కు డీడీవోలు నివేదిస్తారు. సోషల్‌ ఆడిట్‌ సిబ్బందితో గ్రామాల్లో తనిఖీలు నిర్వహించడంతో పాటు స్వయం సహాయక సంఘాల ద్వారా స్వయం ఉపాధి కోసం సహకారం అందిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి ఇప్పటికే ఆ శాఖ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం నిర్వహిస్తారు. డివిజన్‌ స్థాయిలో ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులకు, పంచాయతీరాజ్‌ సంస్థల సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, శిక్షణ కోసం ఏపీహెచ్‌ఆర్‌డీఐ/ఏపీఎ్‌సఐఆర్‌డీ/ఈటీసీ తదితర సంస్థల సిబ్బందిని నియమించడం, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయనున్నారు.


డీడీవోల విధులివే..

  • డీడీవో కార్యాలయానికి అధిపతిగా ఉండే డీడీవో డివిజన్‌ స్థాయిలో అన్ని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి విభాగాలపై నియంత్రణ బాధ్యతలు నిర్వహిస్తారు.

  • జిల్లా కలెక్టర్‌ నియంత్రణలో ఉంటూ డివిజన్‌ స్థాయిలో ఆయా శాఖల అనుసంధానంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అన్ని కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ సమీక్షలు నిర్వహిస్తారు.

  • పాలనాపరంగా ప్రతి నెలా కనీసం 20 రోజులు పర్యటనలు చేసి టూర్‌ డైరీలను కలెక్టర్‌కు సమర్పించాలి.

  • డివిజన్‌ స్థాయిలో ఎంపీడీవోలతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది మొత్తం డీడీవో నియంత్రణలో పనిచేస్తారు.

  • మండలస్థాయి అధికారులతో డీడీవో కార్యాలయాల నుంచి సంప్రదింపులు చేస్తారు. ఎంపీడీవోల టూర్‌ డైరీలు, వారి వార్షిక కాన్ఫిడెన్షియల్‌ రిపోర్టులు(ఏసీఆర్‌) ఇక్కడి నుంచే సమీక్షిస్తారు.

  • పంచాయతీలు, మండల పరిషత్‌లు, గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించిన అక్రమాలపై డీడీవో విచారణ చేపడతారు. ప్రతి ఆర్నెల్లకోసారి మండల పరిషత్‌ కార్యాలయాలను తనిఖీలు చేస్తారు. అభివృద్ధి పనులకు సంబంధించి తేడాలుంటే జిల్లా యంత్రాంగానికి నివేదిస్తారు.

  • పంచాయతీరాజ్‌ సంస్థల ఆడిట్‌ అభ్యంతరాలు, సర్‌చార్జి రికవరీ బాఽ ద్యతలు నిర్వహించాల్సి ఉంటుం ది. ఆర్థిక అవకతవకలపై కలెక్టర్‌, సీఈఓ, డీపీవోలకు నివేదిస్తారు.

  • ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి డిప్యూటీ డిస్ట్రిక్ట్‌ ఎలక్షన్‌ అథారిటీగా ఆర్డీవోలు ఉండేవారు. ఇక నుంచి డీడీవోలకు ఆ బాధ్యతలను అప్ప చెప్తూ పంచాయతీరాజ్‌ రూల్స్‌ను సవరిస్తారు.


  • మత్స్యకారుల సమస్యకు శాశ్వత పరిష్కారం

  • ఉప్పాడ మత్స్యకారులతో పవన్‌ భేటీ

అమరావతి, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. బుధవారం మంగళగిరిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఉప్పాడ మత్స్యకారులతో 100రోజుల ప్రణాళిక అమలు, భవిష్యత్తు కార్యాచరణ, ఆదాయ పెంపు అంశాలపై ఆయన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. ‘మత్స్యకారులకు సమస్య వస్తే.. నాకు వచ్చినట్లే. దాన్ని పరిష్కరిస్తా. రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్లేవాడిని. మిగతా పార్టీల నాయకుల్లా సమస్య వస్తే బూతులు తిట్టడం, గొడవలు పెట్టడం చేయను. పరిష్కారం అయ్యేదాకా పనిచేస్తా’ అని అన్నారు. ‘ఉప్పాడలోని 7,200 మంది మత్స్యకారులు, 25,600 మంది కుటుంబసభ్యుల జీవన భృతి రెట్టింపు కావాలన్నదే లక్ష్యం. ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి రూ.323 కోట్లతో ప్రతిపాదనలు చేశాం. పిఠాపురంలోని వాణిజ్య భవన సముదాయంలో 50 శాతం మత్స్యకారులకు కేటాయిస్తాం’ అని పవన్‌ పేర్కొన్నారు.

Untitled-1 copy.jpg

Updated Date - Dec 04 , 2025 | 04:53 AM