Share News

Deputy CM Pawan: చదువు.. బలమైన ఆయుధం

ABN , Publish Date - Dec 06 , 2025 | 04:09 AM

చదువు మీ భవిష్యత్‌ను మార్చేస్తుంది. చదువు చాలా బలమైన ఆయుధం. లక్ష మంది మెదళ్లను కదిలించే శక్తిని చదువు ఇస్తుంది. నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్‌ నిర్దేశకులు..

Deputy CM Pawan: చదువు.. బలమైన ఆయుధం

  • లక్ష మంది మెదళ్లను కదిలించే శక్తినిస్తుంది: డిప్యూటీ సీఎం పవన్‌

  • ఏ మీడియంలో చదువుకున్నా..సృజనాత్మకత పెంపొందించుకోవాలి

  • విద్యార్థులకు పవన్‌ కల్యాణ్‌ పిలుపు

  • చిలకలూరిపేటలో మెగా పీటీఎంకు హాజరు

నా చిన్నతనంలో సోషల్‌ టీచర్‌ సమాజం, దేశభక్తి, చంద్రశేఖర్‌ ఆజాద్‌ గురించి చెబితే ఆ పాఠం నా గుండెల్లో నాటుకుంది. సామాజిక బాధ్యతను తెలియజేసింది. ఈ రోజున ఇంత చేయగలుగుతున్నామంటే ఆ టీచర్‌ చెప్పిన చిన్న పాఠమే.

భూకంపాలు వస్తే ఇళ్లు కూలిపోతాయి. సంపాదించుకున్న సొమ్ము కనుమరుగైపోవచ్చు. కానీ పొగొట్టుకోలేనిది మనం సంపాదించుకున్న జ్ఞానం మాత్రమే.

- పవన్‌ కల్యాణ్‌

చిలకలూరిపేట, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): ‘చదువు మీ భవిష్యత్‌ను మార్చేస్తుంది. చదువు చాలా బలమైన ఆయుధం. లక్ష మంది మెదళ్లను కదిలించే శక్తిని చదువు ఇస్తుంది. నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్‌ నిర్దేశకులు..’ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని శారదా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్‌-టీచర్స్‌ మీట్‌(పీటీఎం)లో ఆయన ప్రసంగించారు. పిల్లలను ఉదయించే సూర్యులుగా అభివర్ణించారు. ఏ మీడియంలో చదువుకున్నా సృజనాత్మకత పెంపొందించుకోవాలని.. ఇది సాధించాలంటే చాలా విభిన్నంగా విద్య నేర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా దేహ, మానసిక దారుఢ్యం ఉండాలన్నారు. మానసిక దారుఢ్యం సాధించేందుకు పుస్తకాలు ఎక్కువగా చదవాలని చెప్పారు. చదువైపోయాక ఏదో ఒక ఉద్యోగం చేద్దాం అనుకోవద్దని సూచించారు. విద్యార్థులపై ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి అధికారికీ బాధ్యత ఉండాలన్నారు. పవన్‌ ఇంకా ఏమన్నారంటే..

దేశ భవిష్యత్‌ కోసం తీర్చిదిద్దాలి..

టీచర్‌.. విద్యార్థుల్లో ఒక్కొక్కరిపై ఒక్కో ప్రభావం చూపిస్తారు. విద్యార్థులను ఉద్యోగం కోసం కాకుండా దేశ భవిష్యత్‌ కోసం తీర్చిదిద్దాలి. ప్రతి బిడ్డలో అద్భుతమైన శక్తి ఉంటుంది. తల్లిదండ్రులూ.. మంచి మాటలు చెప్పండి. పొద్దున లేస్తే బూతులు తిట్టే వ్యక్తులకు దూరంగా ఉంచండి. పిల్లలూ టీవీలు చూడకండి. సినిమా వినోదమే.. దానినే జీవితంగా తీసుకోకండి. సినిమా నటుడిగానే చెబుతున్నాను. మన కోసం కష్టపడిన అబ్దుల్‌కలాం లాంటి వారి స్ఫూర్తిగా ప్రతి విద్యార్థీ ఎదగాలి. విద్యార్థుల ఆలోచనలు.. ప్రవర్తన.. వ్యక్తిత్వం రేపటి దేశ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి.


ఆటస్థలాలేవీ..?

అందరూ రియల్‌ ఎస్టేట్‌ పిచ్చిలో పడిపోయారు. ఎవరెవరివో స్థలాలు కాజేస్తూ వేల కోట్లు దోచేస్తున్నారు. పూర్వీకుల మాదిరిగా స్థలాలు విద్యా సంస్థల వంటి వాటికి దానం ఇవ్వడం మానేసి.. ఉన్న స్థలాలను లాగేసుకుంటున్నారు. అందువల్ల పిల్లలకు ఆడుకునేందుకు ఆట స్థలాలు ఉండడం లేదు. శారదా స్కూల్‌కు ఆట స్థలం కేటాయించి స్కూలు పిల్లల కోరికను నెరవేర్చాలని అధికారులను ఆదేశించారు. నారావారి పల్లె వెళ్లాను అక్కడ స్కూలుకు గ్రౌండ్‌ లేదు. నా సొంత ధనంతో స్థలం కొనిచ్చాను. ఇలా అన్ని చోట్లా కొనిచ్చే శక్తి లేదు. ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి ప్రభుత్వపరంగా స్థలం కేటాయించాలి. విద్యార్థులకు ఆట స్థలం ఉండేలా అధికారులు ప్రయత్నం చేయాలి. గంజాయి వంటి మాదకద్రవ్యాలపై పోలీసు శాఖ కఠినంగా ఉండాలి. నగరాల్లో అసలు గంజాయి అనేది విషయం కాదన్నట్టుగా మాట్లాడుతుంటే భయం వేస్తోంది. గత ప్రభుత్వంలో చాలామంది మాదకద్రవ్యాలను పిల్లలకు అలవాటు చేయడానికి చాక్లెట్లు, ఐస్‌క్రీంల రూపంలో సరఫరా చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని టీచర్లు, తల్లిదండ్రులు పీటీఎంలో మాదక ద్రవ్యాలపై చర్చించాలి. దేశ సంపద ఖనిజాలు, నదులు, అడవులు కాదు.. కలల ఖనిజాలతో చేసిన యువతే. వారే మన దేశ భవిష్యత్‌కు నావికులని గుంటూరు శేషేంద్రశర్మ రాశారు. అందరూ సంపాదనపై పడుతున్నారు. రూ.కోటి ఉంటే వేల కోట్లు సంపాదించాలని అనుకుంటున్నారు. స్వయంశక్తి మీద నిలబడిగలిగేలా విద్యార్థులను ముందుకు తీసుకెళ్తేనే వారికి మంచి భవిష్యత్‌ ఉంటుం ది. వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పగలిగితే.. వారిలో నుంచి ఎంతో మంది అద్భుతమైన వ్యక్తులు వస్తారు.


25 కంప్యూటర్లు ఇస్తా..

శారదా స్కూలుకు సొంత నిధులతో లైబ్రరీ అభివృద్ధితో పాటు 25 కంప్యూటర్లు అందజేస్తానని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన మమేకయ్యారు. తరగతి గదిలో కూర్చుని వారితో ముచ్చటించారు. ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కృష్ణతేజ, ఇంటర్‌ విద్య డైరెక్టర్‌ రంజిత్‌ బాషా, కలెక్టర్‌ కృతికా శుక్లా, గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టీనా, డీఈవో చంద్రకళ, ఆర్డీవో మధులత తదితరులు పాల్గొన్నారు.

లోకేశ్‌కు అభినందనలు..

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమల్లో పీటీఎం చాలా కీలకమైనది. దీనిని మంత్రి లోకేశ్‌ ముందుకు తీసుకుపోతున్నారు. ఆయనకు హృదయపూర్వక అభినందనలు. పిల్లలను స్కూలుకు పంపించాం.. వారే చదువుకుంటారని తల్లిదండ్రులు భావిస్తుంటారు. అయితే పిల్లలు స్కూల్లో ఏంచేస్తున్నారు. ఎలా చదువుతున్నారె తెలుసుకోవడం వారి బాధ్యత. అందుకే లోకేశ్‌ కలుగజేసుకుని.. పీటీఎం నిర్వహిస్తున్నారు. కేరళలో టీచర్‌, తల్లిదండుల సంఘం చాలా బలంగా ఉంటుంది. అలాంటి వ్యవస్ధను అమలు చేయడానికి పీటీఎం దోహదపడుతుంది. ఫీజులు కట్టి స్కూలుకు పంపించడం కాకుండా.. వారెలా ఉంటున్నారో తెలుసుకోవడానికి ఇది దోహడపడుతుంది. దీనివల్ల పిల్లల బలాలు, బలహీనతలేమిటో తల్లిదండ్రులు తెలుసుకోగలుగుతారు. తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులను దైవంగా భావిస్తాం. ఇది అరుదైన సంస్కృతి. దీనిని గౌరవించుకోవడానికి పీటీఎం చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

Updated Date - Dec 06 , 2025 | 04:15 AM