Share News

Deputy CM Pawan: గ్రామ సచివాలయ వ్యవస్థపై అధ్యయనం

ABN , Publish Date - Nov 26 , 2025 | 04:21 AM

గ్రామ సచివాలయాల పనితీరు, ఆ వ్యవస్థ నిర్మాణంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సూచించారు.

Deputy CM Pawan: గ్రామ సచివాలయ వ్యవస్థపై అధ్యయనం

  • మార్చి నాటికి నివేదిక.. తర్వాత చర్యలు

  • మంత్రుల బృందంతో డిప్యూటీ సీఎం పవన్‌ చర్చ

  • పదోన్నతులపైనా సమీక్ష

అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): గ్రామ సచివాలయాల పనితీరు, ఆ వ్యవస్థ నిర్మాణంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సూచించారు. మార్చి నాటికి దీనికి సంబంధించిన నివేదికను రూపొందించాలన్నారు. మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం మంత్రుల బృందంతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, అనిత, అనగాని సత్యప్రసాద్‌, డోలా బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్‌, గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయ సిబ్బందికి పదోన్నతుల కల్పన, ఇతర శాఖలతో అనుసంధానించడానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినప్పటికీ సచివాలయ వ్యవస్థ నిర్మాణం దెబ్బతినకుండా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి సూచించారు. సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేసేందుకు అవసరమైతే ప్రతి నెలా సమీక్షిద్దామని చెప్పారు. ఈ సమావేశంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు, శాఖాధిపతులు పాల్గొన్నారు.

Updated Date - Nov 26 , 2025 | 04:21 AM