Deputy CM Pawan: సకాలంలో పనులు పూర్తి చేయాలి
ABN , Publish Date - Nov 13 , 2025 | 04:54 AM
జల్‌జీవన్ మిషన్ పనుల పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకోవాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆదేశించారు.
జల్‌జీవన్ మిషన్‌పై పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు
శాఖల సమన్వయం ముఖ్యం.. గోదారి జిల్లాల్లో పురోగతి
మిగిలిన జిల్లాల్లోనూ వేగం పుంజుకోవాలి
గత ప్రభుత్వం కొళాయి పెట్టి కనెక్షన్ మరచింది
అధికారులంతా నిబద్ధతతో పనిచేయాలి: పవన్
ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో ఉపముఖ్యమంత్రి సమీక్ష
అమరావతి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): జల్‌జీవన్ మిషన్ పనుల పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకోవాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో పనులను నిర్దేశిత గడువు లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జల్‌జీవన్ మిషన్ పనుల పురోగతిపై బుధవారం గ్రామీణ నీటి సరఫరాలశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతి రోజు పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించడం, అడ్డంకులుంటే జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పరిష్కరించేలా పర్యవేక్షణ బృందాలు పనిచేయాలన్నారు. ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించాలన్న ప్రధానమంత్రి కలల సాకారానికి, సీఎం చంద్రబాబు నాయకత్వంలో అధికారులంతా నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు స్వచ్ఛమైన, శుద్ధ జలాలను అందించేందుకు కంకణబద్దులై పనిచేయాలన్నారు. అదే సమయంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ఇప్పటికే ఐదు జిల్లాల్లో ఇంటింటికీ తాగునీరు అందించే లక్ష్యంతో మెగా ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు. వాటికి అవసరమైన నిధుల సమీకరణ, పనుల వేగవంతానికి ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. పల్లెపల్లెకు శుద్ధ జలాలు అందించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో రూ.1290 కోట్లతో మొదలు పెట్టిన ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం పశ్చిమ ప్రాంతంలో 21 లక్షల మందికిపైగా తాగునీరు అందించవచ్చన్నారు. ఫ్లోరైడ్ ప్రభావిత ఆ ప్రాంతానికి ఈ ప్రాజెక్టు సంజీవని వంటిదని వ్యాఖ్యానించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పనులు ముందంజలో ఉన్నట్లు అధికారుల గణాంకాలు వెల్లడిస్తున్నాయన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో రూ.1650 కోట్ల అంచనా వ్యయంతో రెండు నీటి ట్రీట్‌మెంట్ ప్లాట్‌లు, 36 నీటి సంపులు, 24 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణంలో ఉన్నాయి. 1.50 లక్షలకు పైగా ఇళ్లకు కొళాయిల కనెక్షన్ల ఇస్తామన్నారు.
పశ్చిమగోదావరిలోనూ పనులు సంతృప్తికరంగానే సాగుతున్నాయన్నారు. మిగిలిన జిల్లాల్లో కొంత వేగం పుంజుకోవాల్సి ఉందన్నారు. జల్‌జీవన్ మిషన్ పనులకు మన ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. చిన్న సమస్యల కారణంగా పనులకు ఆటంకాలు ఉంటే సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ జిల్లా కలెక్టర్లు వాటిని తొలగించే దిశగా ప్రయత్నాలు చేయాలన్నారు. కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసుకోవాలని, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రోడ్లు భవనాలు, అటవీ, రెవెన్యూ తదితర శాఖల నుంచి అధికారులను ఇందులో సభ్యులుగా ఎంపిక చేసుకోవాలని సూచించారు. కలెక్టర్లు ప్రతి వారం పనుల పురోగతిపై సమీక్షలు నిర్వహించి వేగవంతానికి చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ స్థాయిలో పరిష్కారం కాని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని నిర్దేశించారు. గత ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్ పనులను పూర్తిగా అటకెక్కించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.27 వేల కోట్లు కేటాయిస్తే, రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన వాటా కేటాయింపులు జరగలేదని, దీంతో ఒక వంతు పనులు కూడా పూర్తి చేయాలేకపోయారని తెలిపారు. రూ.4 వేల కోట్ల పనులు పూర్తి చేశామని లెక్కలు చూపారని, అక్కడక్కడ ఇళ్లకు కొళాయిలు పెట్టారే గానీ, కనెక్షన్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం నిధుల కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఐదు జిల్లాల పరిధిలో రూ.7,910 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులు 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
దేశ భద్రత ప్రతి పౌరుడి బాధ్యత
అంతర్గత ఉగ్రవాదాన్ని నివారించాలి
ప్రతి ఒక్కరూ ఆ బాధ్యత తీసుకోవాలి: పవన్
‘నిఘా, భద్రతా దళాల్లోని సిబ్బందికి నా హృదయపూర్వక వందనాలు’ అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వారు నిజమైన వీరులని బుధవారం ‘ఎక్స్’లో కొనియాడారు. ‘వారు దేశ భక్తులు. పగలు, రాత్రి నిశ్శబ్దంగా ఎటువంటి గుర్తింపు కోరుకోకుండా మన దేశానికి సేవ చేస్తున్నారు. అదే మన పౌరులు కూడా ఊహించలేని సామూహిక ప్రాణనష్టాలను నివారిస్తోంది. మన దేశ భద్రత, శాంతిని కాపాడుతోంది. ఉగ్రవాదానికి మూలాలు, సంబంధాలు దేశవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. జాతీయ భద్రత అనేది కేంద్ర ప్రభుత్వ పని మాత్రమే కాదు. ఈ విధి ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతి ప్రభుత్వ శాఖకు, ప్రతి స్థానిక సంస్థకు, గ్రామ పంచాయతీకి ఉంది. ప్రతి రాజకీయ పార్టీ దేశ భద్రతపై ప్రత్యేక అజెండా కలిగి ఉండటం అత్యవసరమైంది. దీనికే తొలి ప్రాధాన్యం ఉండాలి. ప్రజలుగా మనం కళ్లు మూసుకుంటున్నాం. బుజ్జిగింపు రాజకీయాలు, జాతీయ సార్వభౌమాధికారంపై భాషా, ప్రాంతీయ గర్వాన్ని ప్రేరేపించడం వల్ల కలిగే ముప్పులు కేవలం రాజకీయ సాధనాలు కావు, అవి మన ప్రజాస్వామ్య పునాదిని బలహీనపరిచేందుకు లోతుగా పాతుకుపోయిన కుట్రలు. పౌరులు, ముఖ్యంగా యువత ప్రేక్షకులుగా మారకూడదు’ అని పేర్కొన్నారు.