Share News

Deputy CM Pawan Kalyan emphasized: పల్లెల్లో పట్టణ స్థాయి సేవలు

ABN , Publish Date - Dec 11 , 2025 | 04:22 AM

పట్టణాలు, నగరాల్లో అందుతున్న స్థాయిలో అన్ని సేవలూ గ్రామీణ ప్రజలకు చేరువ కావాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ సూచించారు.....

Deputy CM Pawan Kalyan emphasized: పల్లెల్లో పట్టణ స్థాయి సేవలు

  • సంస్కరణలకు అత్యంత ప్రాధాన్యం

  • ప్రధాని, సీఎం నేతృత్వంలో మార్పు.. ప్రజల సంతోషమే ముఖ్యం

  • ఉద్యోగులకు పదోన్నతులిచ్చాం.. ఆ మేరకు ఫలితాలూ రావాలి

  • వైసీపీ హయాంలో పదోన్నతులు, బదిలీలకూ బేరం పెట్టారు

  • ఆర్థికం గాడినపడితే అన్నీ చేస్తాం.. ఉద్యోగినులను వేధించొద్దు

  • పంచాయతీరాజ్‌ ‘మాటామంతి’లో డిప్యూటీ సీఎం పవన్‌

అమరావతి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): పట్టణాలు, నగరాల్లో అందుతున్న స్థాయిలో అన్ని సేవలూ గ్రామీణ ప్రజలకు చేరువ కావాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ సూచించారు. బుధవారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో పంచాయతీరాజ్‌ ఉద్యోగులతో నిర్వహించిన ‘మాటామంతి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పంచాయతీ రాజ్‌ శాఖలో సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. ముఖ్యంగా ఎప్పటి నుంచో పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు అత్యంత పారదర్శకంగా పదోన్నతులు కల్పించామన్నారు. ‘‘పదోన్నతులతో మీరు ఎంత సంబరపడ్డారో.. మీరు అందించే సేవల ద్వారా ప్రజలు కూడా అంతే ఆనందపడాలి. ప్రజా సేవలో నిష్పక్షపాతంగా, నిబద్ధతతో పనిచేయాలి.’’ అని ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. ఇంజనీరింగ్‌ విభాగంలోని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలని ఆదేశించారు. ‘‘పల్లెలు బాగుంటే దేశం బాగుంటుం ది. అందుకే గ్రామాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పంచాయతీరాజ్‌శాఖను తీసుకున్నా. అనుభవం ఉన్న అధికారి పర్యవేక్షణ అవసరమని భావించి శశిభూషణ్‌కుమార్‌ని ముఖ్యకార్యదర్శిగా తీసుకున్నాం. ఉపముఖ్యమంత్రి హోదాలో సొంత తెలివితేటలు ఎక్కడా వాడలేదు. ఉన్నతాధికారులు చెప్పిన మేరకే సంస్కరణలు తీసుకువచ్చాం.’’ అని పవన్‌ అన్నారు. ఇంకా ఏమన్నారంటే..


పోస్టులు అమ్ముకున్నారు..

శశిభూషణ్‌కుమార్‌, ఓఎ్‌సడీ వెంకటకృష్ణ, కమిషనర్‌ కృష్ణతేజ లాంటి నిబద్ధతతో పనిచేసే అధికారులు శాఖలో ఉన్నారు. గత ప్రభుత్వపాలనలో చాలా అంశాల్లో పారదర్శకత లేదన్న విషయాన్ని నా దృష్టికి తెచ్చారు. కనీసం రోడ్లు కూడా వేయలేదు. మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించలేదు. ప్రతి పోస్టుకి, బదిలీకి ఒక రేట్‌ కార్డు ఉండేది. అలాంటి పరిస్థితులు పోవాలని కోరుకున్నా. సమీక్షల సమయంలో చిన్న చిన్న మార్పులు తీసుకురావడం ద్వారా మంచి ఫలితాలు సాధించాం. 10 వేల మంది పైచిలుకు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాం. ఆర్థిక వ్యవస్థ గాడిన పడకుండా అన్నీ ఒకేసారి చేయలేం. ప్రధాని మోదీ సహకారం, సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం. గతంలో జిల్లా పరిషత్‌ సీఈవో స్థాయిలో పదోన్నతులు తక్కువగా ఉండేవి. ఇప్పుడు తొలిసారి 70 మందికి పదోన్నతులు ఇవ్వబోతున్నాం.

క్లస్టర్‌ వ్యవస్థ రద్దు!

పంచాయతీలకు అధికారాలను బదిలీ చేసే ప్రక్రియలో భాగంగా గతంలో ఉన్న ‘క్లస్టర్‌’ వ్యవస్థను రద్దు చేశాం. 13,350 గ్రామ పంచాయతీలను స్వతంత్ర పాలనా యూనిట్లుగా మార్చాం. జనాభా ప్రాతిపదికన 4 గ్రేడ్‌లుగా విభజించాం. తద్వారా ప్రజలకు మరింత సులభతర సేవలు అందనున్నాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం కలలను సాకారం చేసే దిశగా 10 వేల జనాభా దాటిన పంచాయతీలను.. ‘రూర్బన్‌ పంచాయతీ’లుగా గుర్తించాం. డిప్యూ టీ ఎంపీడీవో స్థాయి గెజిటెడ్‌ అధికారిని నియమించి మున్సిపాలిటీలతో సమానంగా అభివృద్ధి చేస్తున్నాం. పూర్తి స్థార ుు సిబ్బందితో ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేశాం.


ఉద్యోగులకు అండగా..

‘‘మహిళా ఉద్యోగులను వేధిస్తే కఠిన చర్య లు తీసుకోవడంతో పాటు ఉద్యోగుల భద్రత, హక్కుల పరిరక్షణను వ్యక్తిగతంగా తీసుకుని ముం దుకువెళ్తాం. విధి నిర్వహణలో చిన్నస్థాయి ఉద్యోగికి ఇబ్బంది వచ్చినా అండగా నిలుస్తాం. మహిళా ఉద్యోగులపై వేధింపులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని ఆదేశించాం. రాజకీయపరమైన దాడులను ఉపేక్షించం. ఉద్యోగుల భద్రత, వారి హక్కుల పరిరక్షణ బాధ్యతలను భుజాలపై ఎత్తుకున్నాం. ఉమ్మడి కడప జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై ఓ పార్టీ వారు దాడి చేసినప్పుడు స్వయం గా వెళ్లి అండగా నిలిచా.’’ అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

కడప ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారు!

పంచాయతీరాజ్‌ చట్టం-1994కు సవరణలు తెస్తామని, 4 మాసాల్లో ప్రతిపాదనలు రూపొందిస్తామని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు అధికారులు తెలిపారు. విజయనగరానికి చెందిన పంచాయతీ కార్యదర్శి అనంత శంకర ప్రసాద్‌ మాట్లాడుతూ.. పంచాయతీల్లో శానిటేషన్‌ పర్యవేక్షణ ఉదయం 6 నుంచి చేపట్టడం కష్టంగా ఉందని, 9 గంటల నుంచి చేపట్టేలా వెసులుబాటు కల్పించాలన్నారు. పంచాయతీరాజ్‌శాఖలో ఉన్న టీచర్లు ఇప్పుడు పూర్తిగా విద్యాశాఖ పరిధిలోకి వెళ్లారని, అయితే వారి కారుణ్య నియామకాలు ఇంకా పంచాయతీరాజ్‌శాఖ ద్వారా ఇవ్వాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయని ఎన్టీఆర్‌ మెప్మా పీడీ మురళీకృష్ణ ప్రసాద్‌ అధికారుల దృష్టికి తెచ్చారు. పంచాయతీలకు రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకునేలా కృషి చేయాలని మరో అధికారి సూచించారు. ‘స్వమిత్వ’లో కొన్ని గ్రామాల్లో సర్వేలు చేయవద్దని కడప జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నారని డీపీవో రాజ్యలక్ష్మి చెప్పారు. ‘స్వమిత్వ’ను కేంద్రం తీసుకొచ్చిందని, అలాంటి కార్యక్రమాన్ని వ్యతిరేకించే అధికారం ఎమ్మెల్యేలకు లేదని పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఆ ఎమ్మెల్యేలతో తాను మాట్లాడతానన్నారు. కాగా, కారుణ్య నియామకాలకు సంబంధించి ఇంకా 300 మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని, వాటిని కలెక్టర్‌ పూల్‌లో అందించేలా ప్రభుత్వాన్ని కోరతామని కృష్ణతేజ తెలిపారు. ‘స్వర్ణ పంచాయతీ’ అమలు ద్వారా రూ.300 కోట్లుగా ఉన్న రాబడిని రూ.1,007 కోట్లకు పెంచామని తెలిపారు.

Updated Date - Dec 11 , 2025 | 04:22 AM