Deputy CM Pawan: పెద్దిరెడ్డి కుటుంబానికి అటవీ భూములా
ABN , Publish Date - Nov 13 , 2025 | 04:25 AM
అటవీ శాఖ మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి అడవి మధ్యలో ఉన్న భూమి వారసత్వంగా వచ్చిందని చెబుతున్నారు.
అడవుల మధ్యలో వారసత్వ భూములెలా వచ్చాయి?
దీని వెనుక ఎవరి పాత్ర ఏంటో తేల్చండి
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష
అమరావతి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ‘‘అటవీ శాఖ మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి అడవి మధ్యలో ఉన్న భూమి వారసత్వంగా వచ్చిందని చెబుతున్నారు. అసలు అడవుల మధ్యలో వారసత్వ భూమి ఎలా వచ్చింది? ఈ భూమి ఎలా.. ఎప్పుడు చేతులు మారింది.. ఇందులో ఎవరి పాత్ర ఎంత అనేదానిపై నివేదికలు తయారు చేయండి’’ అని ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేటలో పెద్దిరెడ్డి, ఆయన కుటుంబసభ్యుల చేతిలో ఉన్న సుమారు 104 ఎకరాల అటవీ భూములపై బుధవారం అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అటవీ చట్టం ప్రకారం ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్ (పీవోఆర్), చార్జిషీటు దాఖలు చేశామని అధికారులు ఆయనకు చెప్పారు. ఆక్రమణలను తొలగించి స్వాధీనం చేసుకున్నామని, కోర్టులో కేసుల వివరాలు దాఖలు చేశామన్నారు. పీవోఆర్, విజిలెన్స్ నివేదికలపై చర్చించిన పవన్.. ‘అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలను శాఖ వెబ్‌సైట్‌లో వెల్లడించాలి. ఈ దిశగా ప్రణాళిక సిద్ధం చేయండి. ఎవరి ఆక్రమణలో ఎంత అటవీ ఆస్తి ఉంది? వారిపై నమోదైన కేసుల వివరాలు, ప్రస్తుతం సదరు కేసులు ఏ స్థితిలో ఉన్నాయి వంటి వివరాలు ప్రజలకు తెలియాలి’’ అని పవన్ ఆదేశించారు. ‘‘అటవీ భూముల పరిరక్షణకు ఉద్దేశించిన చట్టం కఠినంగా ఉంది. అటవీ ఆస్తులను కబ్జా చేస్తే....కఠిన చర్యలకు ఉపక్రమించండి. మంగళంపేట అటవీ భూముల వ్యవహారం చూస్తే.. చట్టం కఠినంగా ఉన్నా.. అమలు లేకపోవడం వల్లే ఆక్రమణలు జరిగినట్టు కనిపిస్తోంది’’ అని పవన్ అభిప్రాయపడ్డారు. ‘పెద్ద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి 2024 ఎన్నికల్లో ఈ అటవీ భూముల గురించి అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారనే అంశం నా దృష్టికి వచ్చింది. దీనిపై న్యాయ నిపుణుల సలహా ప్రకారం ముందుకు వెళ్లాలి. అలాగే రిజిస్ర్టేషన్ రికార్డుల ప్రకారం 45.80 ఎకరాలు వాళ్ల ఆధీనంలో ఉంటే.. వెబ్‌ల్యాండ్‌లోకి వచ్చేసరికి 77.54 ఎకరాలుగా చూపారు. ఒకేసారి ఎందుకు ఇంత పెరిగిందన్న విషయాన్ని కూడా పరిశీలించాలి’’ అని ఆదేశించారు.