Deputy CM Pawan: మత్స్యకారుల జీవనోపాధికి భద్రత కల్పిస్తాం
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:14 AM
తీర ప్రాంతాన్ని నమ్ముకొని జీవిస్తున్న మత్స్యకారుల జీవనోపాధికి భద్రత, భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
అమలుకు సిద్ధంగా 100 రోజుల ప్రణాళిక
2 కోట్లతో ఉప్పాడ తీర ప్రాంత రక్షణ
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడి
అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): తీర ప్రాంతాన్ని నమ్ముకొని జీవిస్తున్న మత్స్యకారుల జీవనోపాధికి భద్రత, భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మత్స్యకారులకు ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. కాకినాడ జిల్లా మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల ప్రణాళికను అమలు చేసేందుకు రోడ్ మ్యాప్ తుది దశకు చేరిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ కోస్టల్ రీజైలెన్స్ పథకం ద్వారా ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు రూ.2 కోట్లతో ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. వేటలో నైపుణ్యాల పెంపు, ప్రత్యేక రీఫ్‌ల ఏర్పాటు వంటి అంశాలపై మత్స్యకారులకు అవగాహన కల్పిస్తామన్నారు. వచ్చే నెలలో తమిళనాడు, కేరళకు తీసుకెళ్లి, రీఫ్ కల్చర్, కోస్టల్ టూరిజం యూనిట్ల సందర్శనకు ఏర్పాట్లు చేస్తున్నామని పవన్ తెలిపారు. తొలిసారి సముద్రంలో చేపల సంఖ్యను పెంచే చర్యల్లో భాగంగా ఉప్పాడ, కాకినాడ తీరాల్లో 50 వేల పండుగప్ప పిల్లల్ని సముద్రంలో వదిలామని, భవిష్యత్‌లో ఉప్పు నీటిలో పెరిగే రొయ్య పిల్లల్ని కూడా తీర ప్రాంతాల్లో వదిలేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.