Share News

Deputy CM Pawan: ఎమ్మెల్యేల పెత్తనం పెరిగిపోతోంది

ABN , Publish Date - Nov 11 , 2025 | 04:29 AM

కూటమి ప్రభుత్వం పొలిటికల్‌ గవర్నెన్స్‌ ఉండాలని పదే పదే చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. చాలా చోట్ల ఎమ్మెల్యేలు చెబితేనే పనులవుతున్నాయి.

Deputy CM Pawan: ఎమ్మెల్యేల పెత్తనం పెరిగిపోతోంది

  • వారు చెబితేనే పనులవుతున్నాయి: పవన్‌ కల్యాణ్‌

  • మనం చెప్పే గవర్నెన్స్‌కు,క్షేత్రస్థాయి పరిస్థితికి చాలా తేడా ఉంది

  • దీనిని సరిదిద్దుకోకపోతే ప్రజాపాలనకు అర్థం ఉండదు

  • సీఎం జోక్యం చేసుకుని హెచ్చరించాలి

  • క్యాబినెట్‌ భేటీలో డిప్యూటీ సీఎం సూచన

  • కూటమి ఎమ్మెల్యేలు ఎవరు తప్పుచేసినా ఇన్‌చార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలి

  • వారి తప్పులు సరిదిద్దే ప్రయత్నం చేయండి

  • వినకుంటే నా దృష్టికి తీసుకురండి: సీఎం

  • ఎర్రచందనంపై క్షేత్రస్థాయికి వెళ్లి పవన్‌ బాగా చేస్తున్నారని ప్రశంస

  • ఏడాదిలోగా పేదలందరికీ ఇళ్ల స్థలాలు

  • పెట్టుబడుల కోసం ఎంత కష్టపడుతున్నదీ

  • హైస్కూల్‌ స్థాయి పిల్లలకూ తెలియాలి: బాబు

అమరావతి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ‘కూటమి ప్రభుత్వం పొలిటికల్‌ గవర్నెన్స్‌ ఉండాలని పదే పదే చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. చాలా చోట్ల ఎమ్మెల్యేలు చెబితేనే పనులవుతున్నాయి. దీనిని సరిదిద్దుకోకపోతే మనం చెప్పే గవర్నెన్స్‌కు.. ప్రజాపాలనకు అర్థం మారిపోతుంది’ అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని, పార్టీలతో సంబంధం లేకుండా.. కూటమి ఎమ్మెల్యేలను గట్టిగా హెచ్చరించాలని కోరారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్‌ సమావేశం సోమవారం సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరుపై వాడీవేడి చర్చ జరిగినట్లు సమాచారం. రెవెన్యూ వివాదాలను త్వరితగతిన పరిష్కరించాలని సీఎం సూచించినప్పుడు.. భూవివాదాల విషయంలో కొందరు ఎమ్మెల్యేలు వేలు పెడుతున్నారని పవన్‌ కల్యాణ్‌ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలందరినీ ముఖ్యమంత్రి గట్టిగా హెచ్చరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎర్రచందనం అక్రమ రవాణా, ఆక్రమణలు కూడా చాలా తీవ్రమైన అంశమని, ఆయన ఆక్రమణలను స్వయంగా వీడియో తీశానని, త్వరలోనే విడుదల చేస్తానని తెలిపారు. సీఎం మాట్లాడుతూ.. కూటమి ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పు చేస్తుంటే ఇన్‌చార్జి మంత్రులు బాధ్యత తీసుకుని చక్కదిద్దాలని సూచించారు.


రెవెన్యూ సమస్యల పరిష్కారమే ఎజెండాగా వారు పనిచేయాలని కోరారు. అనంతపురంలో రెవెన్యూ సమస్యల పరిష్కారంలో భిన్నంగా ముందుకెళ్లామని ఆర్థిక మంత్రి పయ్యావుల క్యాబినెట్‌ దృష్టికి తీసుకొచ్చారు. కలెక్టర్‌, ఆర్డీవోలు, ఇతర రెవెన్యూ అధికారులందరినీ కూర్చోబెట్టి 22ఏ లాంటి సుమారు 400 సమస్యలను పరిష్కరించామని ఆయన చెప్పగా.. ఇలాంటివాటిని ఆదర్శంగా తీసుకుని మంత్రులందరూ పనిచేయాలని సీఎం సూచించారు. ఎర్రచందనం విషయంలో క్షేత్రస్థాయిలో పర్యటించి పవన్‌ కల్యాణ్‌ బాగా చేస్తున్నారని అభినందించారు.


ఇళ్ల స్థలాలు అందరికీ దక్కాలి

పేదలందరికీ ఇళ్లు కల్పించే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు. నివాస స్థలం లేని వారందరి జాబితా రూపొందించి అందరికీ ఇళ్ల స్థలాలు దక్కేలా చూడాలన్నారు. ఏడాదిలోగా నివాస స్థలం లేని వారికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వ చర్యలు ఉండాలన్నారు. ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు కూడా బాధ్యత తీసుకునేలా ఇన్‌చార్జి మంత్రులు చొరవ చూపాలని సూచించారు.


మనం ఏం చేస్తున్నామో యువతకు తెలియాలి

విశాఖ భాగస్వామ్య సదస్సు ద్వారా యువతకు మనం ఏం చేస్తున్నామో తెలియాలని చంద్రబాబు అన్నారు. ‘రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఎంత కష్టపడుతున్నాం.. ఎన్ని ఉద్యోగాలు వస్తాయనేది హైస్కూల్‌ స్థాయి పిల్లలకూ తెలియాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. యువత భవిష్యత్‌కు మనమేం చేస్తున్నామో వారికి తెలియాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.


పార్టీ ఆఫీసులు కట్టుకోవాలి..

జనసేన కార్యాలయాలకు ప్రభుత్వ స్థలాలివ్వాలని మంత్రి కందుల దుర్గేశ్‌ కోరగా.. అది పాలసీ మేటర్‌ అని ఆ పార్టీకే చెందిన మరో మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. సీఎం స్పందిస్తూ.. పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవలసిందేనన్నారు. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నా.. అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు కట్టేందుకు తనకు 45 ఏళ్లు పట్టిందని చెప్పారు. ఈ విషయంలో బీజేపీ వాళ్లను అభినందించాలన్నారు. అన్ని జిల్లాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.


తుఫాన్‌లో బాగా పనిచేశారు..

మొంథా తుఫాన్‌ సమయంలో బాగా పనిచేశారని మంత్రులను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండి.. బాధితులకు తక్షణ సాయం అందేలా చూశారని.. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం పూర్తి సమన్వయంతో పనిచేయడం వల్లే సహాయ చర్యలు వేగంగా అందాయని తెలిపారు. ఆర్టీజీఎస్‌ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తూ.. టెక్నాలజీ సాయంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగామన్నారు. మంత్రులు, అధికారులు టీమ్‌ స్పిరిట్‌తో పనిచేస్తే ఇటువంటి మంచి ఫలితాలే వస్తాయని చెప్పారు. జిల్లాస్థాయిలో సమీక్ష సమావేశాలు కచ్చితంగా నిర్వహించాలని ఇన్‌చార్జి మంత్రులకు స్పష్టంచేశారు. ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయి గ్రీవెన్స్‌ నిర్వహించాలని.. ప్రతి మంత్రీ నెలకోసారి పార్టీ కార్యాలయానికి రావాలని సీఎం సూచించారు.


జూనియర్లకు సీనియర్ల అవగాహన

మంత్రివర్గ సమావేశానికి ముందు ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో టీడీపీ మంత్రులతో మంత్రి లోకేశ్‌ అల్పాహార సమావేశం నిర్వహించారు. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు సీనియర్‌ ఎమ్మెల్యేలు, నేతలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ‘సీనియర్‌ ఎమ్మెల్యేలు కొత్తలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. వాటిని ఎలా అధిగమించి, ఈ స్థాయికి వచ్చారో వారికి చెప్పాలని సూచించారు. 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా జరిగే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సును కలిసికట్టుగా విజయవంతం చేద్దామని మంత్రులకు చెప్పారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రతి మంత్రీ తమ తమ శాఖల పరిధిలోని ఒప్పందాలకు సంబంధించి బాధ్యతతో వ్యవహరించాలని.. రేపు ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభ కార్యక్రమంలో విధిగా పాల్గొనాలని కోరారు. తమ తమ జిల్లాల పరిధిలో సంస్థలు గ్రౌండయ్యేలా మంత్రులు, ఇన్‌చార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలని, ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీని త్వరగా నెరవేరుద్దామని లోకేశ్‌ వ్యాఖ్యానించారు.

Updated Date - Nov 11 , 2025 | 04:31 AM