Deputy CM Pawan: చిరస్థాయిగా నిలిచే శుభ సమయం
ABN , Publish Date - Sep 26 , 2025 | 04:26 AM
ఏకకాలంలో 15,941 మంది ఉపాధ్యాయులను నియమించిన ఈ శుభ సమయం విద్యారంగంలో చిరస్థాయిగా నిలిచిపోతుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
ఉద్యోగార్థుల ఏళ్ల నిరీక్షణకు తెరపడింది
కొత్త టీచర్లకు డిప్యూటీ సీఎం పవన్ శుభాకాంక్షలు
అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఏకకాలంలో 15,941 మంది ఉపాధ్యాయులను నియమించిన ఈ శుభ సమయం విద్యారంగంలో చిరస్థాయిగా నిలిచిపోతుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఉద్యోగార్థులు ఎన్నో ఏళ్లు డీఎస్సీ కోసం నిరీక్షించారని చెప్పారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల్లో యువతకు ఇచ్చిన మాటకు కట్టుబడి మెగా డీఎస్సీ ద్వారా వారికి దారి చూపిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. డీఎస్సీ నియామకాల ఫైలుపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారని గుర్తుచేశారు. సీఎం మార్గదర్శకత్వంలో విద్యాశాఖ మంత్రి, సోదరుడు లోకేశ్ ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లారని కొనియాడారు. ఈ ప్రక్రియలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. ఆరోగ్యం సహకరించని కారణంగా డీఎస్సీ నియామక పత్రాల ప్రధాన కార్యక్రమానికి తాను వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయానని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను తీర్చిదిద్ది వారి భవితకు బాటలు వేసే బృహత్తర బాధ్యత ఈ రోజు నియామక పత్రాలు అందుకుంటున్న ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఆ దిశగా విధులు నిర్వర్తించాలని ఆకాంక్షించారు. ఉద్యోగ విధుల్లో చేరుతున్న ఉపాధ్యాయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.