Pawan Kalyan Emphasizes Womens Safety: మహిళా భద్రతకు మరింత భరోసా
ABN , Publish Date - Sep 17 , 2025 | 04:05 AM
రాష్ట్రంలో శాంతి భద్రతలను మరింత పటిష్ఠం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మహిళా రక్షణపై మరింత దృష్టిపెట్టాలని..
రాష్ట్రంలో శాంతి భద్రతలు పటిష్ఠంగా ఉండాలి
గంజాయిని పూర్తిగా నిర్మూలించడంపై దృష్టి పెట్టాలి
రెసిడెన్షియల్ హాస్టళ్లలో సీసీ కెమెరాలు పెట్టండి
శాంతి భద్రతలపై సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్
అమరావతి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శాంతి భద్రతలను మరింత పటిష్ఠం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మహిళా రక్షణపై మరింత దృష్టిపెట్టాలని, మహిళలకు ప్రభుత్వం ఉందన్న భరోసా కల్పించాలని పేర్కొన్నారు. దీనిపై పోలీసులకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించాలని సృష్టం చేశారు. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ హాస్టళ్లలో దాదాపు 2 లక్షల మంది పిల్లలున్నారని, వారి భద్రతకు అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మంగళవారం కలెక్టర్ల సదస్సులో భాగంగా శాంతి భద్రతలపై జరిగిన సమీక్షలో ఆయన పలు అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. రెసిడెన్షియల్ హాస్టళ్లలో చాలా క్రైమ్ జరుగుతోందని, పిల్లల సంరక్షణ నిమిత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై సాంఘిక సంక్షేమ కార్యదర్శి ఎం.ఎం.నాయక్ స్పందిస్తూ.. పాఠశాలల్లో కెమెరాలు పెట్టామని, హాస్టళ్లలో కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, త్వరగా చేస్తామని చెప్పారు. సినిమాల ప్రభావం ఎక్కువగా ఉండే కోనసీమలో కుల సమస్యలు ఉన్నాయని, ఫ్యాన్స్ ఫ్లెక్సీల గొడవలు కూడా అధికంగా ఉన్నాయని, వీటిపై పోలీసు వ్యవస్థ బలంగా పనిచేయాలని పవన్ సూచించారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించేందుకు ఒక బలమైన పాలసీ తీసుకురావాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మతపరమైన కార్యక్రమాల్లో శబ్ధ కాలుష్యం ఎక్కువైందని, దీనిపై అందరికీ తగిన మార్గదర్శకాలు విడుదల చేయాలన్నారు.
సుగాలి ప్రీతి కేసు పరిష్కారానికి చర్యలు
సుగాలి ప్రీతి కేసు విషయంలో సరైన పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆ దిశగా మార్గనిర్దేశం చేయాలని పవన్ కోరారు. రాష్ట్రంలో గంజాయి బెడద ఇంకా పూరిస్థాయిలో తగ్గలేదన్నారు. వైజాగ్ వెళ్లినప్పుడు అధికారులు గంజాయి గురించి చెబుతున్నారని, స్కూల్ పిల్లలకు కూడా అందుబాటులో ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. వైజాగ్ పోర్టులో దొరికిన రూ.270 కోట్ల విలువైన హెరాయిన్ కేసుపై దృష్టి పెట్టాలని కోరారు. దాని లింకులు విజయవాడలోని సత్యనారాయణపురంలో ఉన్నట్లు తెలిసిందన్నారు. దీనిపై ఆ తర్వాత విచారణ జరగలేదన్నారు. సున్నితమైన అంశాల్లో లాజికల్‌గా వెళ్లాలని, సుగాలి ప్రీతి కేసును ఎప్పుడో సీబీఐకి ఇవ్వాల్సిందని, ఆలస్యంగానైనా అప్పగించామని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. హెరాయిన్ కేసుపై వెంటనే సమీక్ష చేయాలని విజయవాడ కమిషనర్‌ను ఆదేశించారు.