Share News

Deputy CM Pawan: గ్రామాల్లో సూపర్‌ శానిటేషన్‌

ABN , Publish Date - Oct 30 , 2025 | 06:23 AM

మొంథా తుఫానును సమర్థంగా ఎదుర్కొన్నామని, ఇప్పుడు తుఫాను అనంతర చర్యలు అత్యంత కీలకమైనవని..

Deputy CM Pawan: గ్రామాల్లో సూపర్‌ శానిటేషన్‌

  • రహదారులను పునరుద్ధరించాలి

  • నీటి సరఫరా ఇబ్బందులు తొలగించాలి

  • ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలు

అమరావతి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫానును సమర్థంగా ఎదుర్కొన్నామని, ఇప్పుడు తుఫాను అనంతర చర్యలు అత్యంత కీలకమైనవని.. పక్కా ప్రణాళికలతో గ్రామాల్లో ఉపశమన చర్యలు చేపట్టాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గ్రామాల్లో పారిశుధ్య, తాగునీటి సమస్యలు ఎదురుకాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ‘‘తీవ్రంగా దెబ్బతిన్న గ్రామాల్లో సూపర్‌ క్లోరినేషన్‌, సూపర్‌ శానిటేషన్‌ చేపట్టాలి. దెబ్బతిన్న రహదారులను ప్రాధాన్య ప్రకారం పునరుద్ధరించాలి. నీటి సరఫరాకు ఏవైనా ఇబ్బందులు ఉంటే ప్రత్యామ్నాయం చూడాలి. గ్రామాల్లో మొబైల్‌ శానిటేషన్‌ బృందాలను సిద్ధం చేయండి. 21,055 మంది పారిశుధ్య సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేసి రంగంలోకి దింపండి. నీరు కలుషితంకాకుండా, వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మళ్లీ సాధారణ పరిస్థితి వచ్చేవరకు గ్రామాల్లో నిరంతరం పారిశుధ్యం మెరుగుదలకు చర్యలు తీసుకోవాలి. జిల్లా పరిషత్‌ సీఈవోలు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు అందుబాటులో ఉండి పరిస్థితిని చక్కదిద్దాలి. అధికారులు ప్రతి జిల్లాలో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేసుకుని పనులను సమన్వయం చేసుకోవాలి.’’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.


గ్రామీణంలో భారీ నష్టం

తుఫాను ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో భారీగా నష్టం వాటిల్లిందని పవన్‌ తెలిపారు. గ్రామీణ నీటి సరఫరా విభాగానికి చెందిన వివిధ తాగునీటి పథకాలకు రూ.కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 779 రోడ్లు, 89 వంతెనలు, 473 కల్వర్టులు దెబ్బతిన్నాయని, వాటికి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. పాక్షికంగా ధ్వంసమైన రోడ్లు, వంతెనలను జిల్లాస్థాయి నిధులతో బాగు చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులతో మిగిలిన వాటిని పునర్నిర్మించే ప్రక్రియ చేపట్టాలన్నారు. కాగా, భారీవర్షాలతో 1,583 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు అధికారులు వివరించారు. 38 చోట్ల రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని, మరో 125 చోట్ల గుంతలు ఏర్పడ్డాయన్నారు. రక్షిత తాగునీటి పథకాల ట్యాంకుల దగ్గర క్లోరినేషన్‌ ప్రక్రియ చేస్తున్నామని వివరించారు.

Updated Date - Oct 30 , 2025 | 06:25 AM