Share News

Deputy CM Pawan: రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కమిటీలు

ABN , Publish Date - Dec 04 , 2025 | 04:46 AM

జనసేన పార్టీ కమిటీల నిర్మాణంలో భాగంగా గ్రామ స్థాయిలో ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించాలని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సృష్టం చేశారు.

Deputy CM Pawan: రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కమిటీలు

గ్రామాల్లో ఐదుగురితో ఏర్పాటు కూటమి ధర్మానికి కట్టుబడాలి: పవన్‌ కల్యాణ్‌

అమరావతి, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ కమిటీల నిర్మాణంలో భాగంగా గ్రామ స్థాయిలో ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించాలని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సృష్టం చేశారు. బుధవారం ఉదయం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నామినేటేడ్‌ పదవులపై సమీక్షించారు. జనసేన పొందిన నామినేటేడ్‌ పదవుల వివరాలను పరిశీలించారు. మిగిలిన పదవుల భర్తీపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడారు. ‘ఇప్పటికే పిఠాపురంలో నియోజకవర్గ స్థాయిలో ప్రయోగాత్మకంగా ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ పనితీరును మదింపుచేసి గ్రామ, మండల, నియోజకవర్గ కమిటీలకు రూపకల్పన చేయాలి. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఉద్దేశించిన కాన్‌ఫ్లిక్ట్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం కేంద్ర కార్యాలయం నుంచే పర్యవేక్షించాలి. ఈ విభాగంలో 11 మంది వరకూ సభ్యులను నియమించాలి. ఈ విభాగం ముందుకు వచ్చే అంశం ప్రాధాన్యత, తీవ్రతను బట్టి ముగ్గురు లేదా విభాగంలోని మొత్తం సభ్యులు కలసి చర్చించి పరిష్కరించాలి. ఐదురుగు సభ్యులుండే కమిటీల్లో తప్పనిసరిగా ఒకరు, గరిష్ఠంగా ఇద్దరు వీర మహిళలు సభ్యులుగా ఉండాలి. 11 మంది ఉండే కమిటీలో ముగ్గురు వీర మహిళలకు స్థానం కల్పించాలి. కూటమి ధర్మాన్ని అనుసరించి పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే వారికి వివిధ దశల్లో గుర్తింపు, బాధ్యతలు అందించే దిశగా ప్రయాణిస్తున్నాం’ అన్నారు.


పవన్‌ను కలిసిన వీరాభిమాని

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను ఆయన వీరాభిమాని, తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టుకు చెందిన చట్టా సతీశ్‌ బుధవారం కలిశారు. 2024 జనవరి 22న అయోధ్య రామ మందిరంలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ రోజున సతీశ్‌ ఒక నిర్ణయం తీసుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ గెలిచి, ప్రభుత్వంలోకి వచ్చే వరకూ చెప్పులు వేసుకోనని దీక్ష పూనారు. ఆయనను కలసిన తర్వాతే చెప్పులు వేసుకోవాలనుకున్నారు. ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తరువాత బుధవారం సతీశ్‌, పవన్‌ను కలిశారు. సతీశ్‌ అభిమానానికి ముగ్ధులైన పవన్‌ కల్యాణ్‌ ఆయనకు జ్ఞాపికను అందచేశారు.

Untitled-1 copy.jpg

Updated Date - Dec 04 , 2025 | 04:47 AM