Share News

AP Deputy CM Pawan: ఉక్కుపై విషం

ABN , Publish Date - Aug 30 , 2025 | 04:02 AM

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణ ఆగింది కాబట్టే ఆర్థిక సాయం చేయడానికి కేంద్రం ముందుకు వచ్చిందనే విషయాన్ని ప్రజలకు గట్టిగా వివరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పార్టీ నాయకులకు సూచించారు.

AP Deputy CM Pawan: ఉక్కుపై విషం

  • ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి

  • ప్రైవేటీకరణ ఆగింది.. కాబట్టే ఆర్థిక సాయం

  • కేంద్రం రూ.14 వేల కోట్ల సాయం చేస్తోంది

  • మరి ఇంకెందుకు కార్మిక సంఘాల ఆందోళన?

  • వైసీపీ హయాంలో ఈ సంఘాలు ఏం చేశాయి?

  • ఢిల్లీని ఆనాడు జగన్‌ ఒక్కసారైనా ప్రశ్నించారా?

  • కేసుల భయంవల్లే కేంద్రాన్ని ఆయన అడగలేదు

  • నాకు అలాంటి భయాలేవీ లేవు

  • ఈ విషయాలు బలంగా జనంలోకి తీసుకెళ్లండి

  • జనసేన భేటీలో డిప్యూటీ సీఎం పవన్‌ నిర్దేశం

విశాఖపట్నం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణ ఆగింది కాబట్టే ఆర్థిక సాయం చేయడానికి కేంద్రం ముందుకు వచ్చిందనే విషయాన్ని ప్రజలకు గట్టిగా వివరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పార్టీ నాయకులకు సూచించారు. విశాఖలో జరుగుతున్న పార్టీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘స్టీల్‌ప్లాంటు ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని , దానికి సొంత గనులు కేటాయించాలని, వీలైతే పైప్‌లైన్‌ వేయాలని ఢిల్లీలో అమిత్‌షాను కోరితే పరిశీలిస్తామని నాడు హామీ ఇచ్చారు. ఆ వెంటనే ప్రైవేటీకరణ ఆగిపోయింది.’’ అని ఆయన వివరించారు. ఇప్పుడు ప్లాంటును ప్రైవేటీకరణ చేస్తున్నారని గొడవలు చేస్తున్న కార్మిక సంఘాలు వైసీపీ హయాంలో ఎందుకు ఆందోళన చేయలేదని ఆయన ప్రశ్నించారు. కార్మిక సంఘాల చిత్తశుద్ధిపై కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. సీఎంగా ఉండగా జగన్‌ పలు సంఘాల నాయకులతో సమావేశమై, ప్లాంటు ప్రైవేటీకరణకు సహకరిస్తే కొందరికి ప్లాట్లు ఇస్తామని ఆశ పెట్టగా, దానికి వారు తలలు ఊపారనే సమాచారం ఉందన్నారు. అలాంటి నాయకులే ఇప్పుడు కేంద్రం రూ.14 వేల కోట్లు సాయం చేసినా ఇంకా ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించారు.


వీఆర్‌ఎస్‌ తీసుకునే వారిని ఆపగలమా?

నష్టాల్లో ఉన్న సంస్థలు వీఆర్‌ఎస్‌ ఇవ్వడం సహజమని, ఇష్టం లేని ఉద్యోగులు దానిని తీసుకునివెళ్లిపోతారని, దానిని తప్పుబట్టడం తగదని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఉండలేమని అనేవారిని తుపాకీ పెట్టి ఆపలేం కదా?...అని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంటు మళ్లీ ప్రైవేటుపరం అవుతుందంటూ చేస్తున్న ప్రచారాన్ని పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించాలని, మౌనంగా ఉండడం తగదని హెచ్చరించారు. దీనిపై పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సూచనలు చేస్తుందన్నారు. గతం(2018)లో డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(డీసీఐ)ను ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించినప్పుడు బీజేపీతో జనసేనకు పొత్తు లేదని, అయినా ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలతో మాట్లాడానని ఆయన గుర్తుచేశారు. లాభాలు సాధించే సంస్థను అమ్మడం తగదని తాను విజ్ఞప్తి చేయగా, వెంటనే ప్రైవేటీకరణను ఆపేశారన్నారు. జాతీయ నాయకత్వం చాలా లాజికల్‌గా ఉంటుందని, వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పినప్పుడే అర్థం చేసుకుని సహకారం అందిస్తారని, లేదంటే వెళ్లిన పని పూర్త కాదన్నారు. నాటి సీఎం జగన్‌ ఢిల్లీకి వెళ్లినప్పుడు ఒక్కసారైనా స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణ ఆపాలని అడిగారా? అని ప్రశ్నించారు. వారికి కేసుల భయం ఉంది కాబట్టే కేంద్రాన్ని ప్రశ్నించలేకపోయారని, తనకు ఎటువంటి కేసుల భయమూ లేదని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.


సినిమా నా బలం

సినిమాలే తన బలమని, రాజకీయాల్లో నిలదొక్కుకొని నాయకుడిగా రాణించడానికి 50 శాతం సినిమా నేపథ్యమే కారణమని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ‘‘కార్యకర్తలు కింద బలంగా ఉంటే, నాయకుడు శిఖరంపై ఒక్కడే ఉంటాడని పిరమిడ్‌ సిద్ధాంతం చెబుతుంది. కానీ నేను వృత్తాకార సిద్ధాంతాన్ని విశ్వసిస్తాను. వృత్తం ఎక్కడ మొదలైందో తిరిగి అక్కడికే వస్తుంది. నేను కూడా కార్యకర్తలను ఆ విధంగానే మళ్లీ మళ్లీ కలుస్తుంటాను.’’ అని తెలిపారు. అనేక పరీక్షలు ఎదుర్కొన్నానని, అవమానాలు భరించానని పవన్‌ అన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌ కూడా రెండేళ్లు అన్నీ గమనించి నిర్ధారించుకున్నాకే తన వెంట నడిచారని చమత్కరించారు. అలాగే కొణతాల రామకృష్ణ కూడా ‘మీ పోరాట స్ఫూర్తి నచ్చింది’ అంటూ వచ్చి పార్టీలో చేరారన్నారు. వార్డు స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు వంద మందినైనా కదిలించి, వెంట నడిపించుకునే శక్తి కలిగిన వారే నాయకులుగా ఎదుగుతారన్నారు. ‘‘డాక్టర్‌ నలనాగుల మనోజ్‌ ఉద్ధానం కిడ్నీ సమస్యపై అధ్యయనం చేస్తూ నా వద్దకు వచ్చారు. ముందుకు వెళ్లమంటూ నేనిచ్చిన ప్రోత్సాహంతో ఆ సమస్యకు ఆయన పరిష్కారం కనుగొన్నారు. పుస్తకం కూడా రాశారు. పాలసీ రూపొందించారు. ఇలాంటి వారెందరో జనసేన కోసం పనిచేస్తున్నారు. ఇదే జనసేన బలం.’’ అని తెలిపారు. జనసైనికులు తనకు కష్టాల్లో అండగా నిలిచారని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.


ప్రతి నెలలో పది రోజులు పార్టీకే

అసెంబ్లీ సమావేశాలు కాగానే క్యాడర్‌తో భేటీ

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలు ముగియగానే క్యాడర్‌తో విడతలవారీగా సమావేశాలు నిర్వహిస్తానని, ప్రతి నెలలో పదిరోజులు పార్టీకే కేటాయిస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. ఆయన రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి హాజరైన జనసైనికులు, వీర మహిళలు, వివిధ వృత్తి వర్గాలకు చెందిన వారితో శుక్రవారం సమావేశమై పార్టీ సిద్ధాంతాలను వివరించారు. జనసేన కులం, కుటుంబ పార్టీ కాదని, బలమైన ఆశయాలు కలిగిన ప్రాంతీయ పార్టీ అని, ఇక ముందు కూడా అలాగే కొనసాగుతుందన్నారు. అక్రమ మైనింగ్‌, ప్రకృతి విధ్వంసం వైసీపీ విధానమైతే పది మందికి ఉపయోగపడే పనులు చేయడం జనసేన ఆశయమన్నారు. నాదెండ్ల మనోహర్‌ పార్టీని ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆయన సేవలు వెలకట్టలేనివన్నారు. కూటమ ప్రభుత్వం రాగానే పార్టీని వదిలేశానని కొందరు ప్రచారం చేస్తున్నారని, పాలనపై పట్టు కోసం అనేక విషయాలు నేర్చుకోవడానికి 8-10 నెలల సమయం పట్టిందన్నారు. తప్పనిసరి స్థితిలోనే సినిమాలు చేస్తున్నానని, పార్టీ ఆర్థిక అవసరాలకు తప్పడం లేదన్నారు. సమాజం, ప్రజలు అంటే పిచ్చి కాబట్టే పదేళ్లుగా పార్టీని నడుపుతున్నానన్నారు. సోషల్‌ మీడియాలో ఎక్కడో ఉన్నోడు మనల్ని తిడతాడని, వాడు ఏ ఖండంలో ఉన్నా పట్టి లాక్కు రావాలని, లేదంటే నలిపేస్తారని వ్యాఖ్యానించారు.

Updated Date - Aug 30 , 2025 | 04:05 AM