Deputy CM Pawan: పకడ్బందీగా కాలుష్య నియంత్రణ
ABN , Publish Date - Oct 12 , 2025 | 04:57 AM
పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని తీర ప్రాంతంతో పాటు కాకినాడ జిల్లాలో పారిశ్రామిక కాలుష్య నియంత్రణకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు.
మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి 100 రోజుల ప్రణాళిక
కాకినాడ తీరంలో తీసుకొనే చర్యలు దేశానికే మోడల్ కావాలి
పీసీబీ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలు
అమరావతి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని తీర ప్రాంతంతో పాటు కాకినాడ జిల్లాలో పారిశ్రామిక కాలుష్య నియంత్రణకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. తీరప్రాంత కాలుష్యంపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో శనివారం ఆయన మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ, కాలుష్య నియంత్రణ మండలిలో సిబ్బంది కొరత, కాకినాడలో మత్స్యకారులతో ‘మాటామంతి’లో వారు ప్రస్తావించిన సమస్యలు, ఇతర అంశాలపై చర్చించారు. ఉప్పాడ తీరంలో కాలుష్యంపై మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో తక్షణమే అక్కడి పరిస్థితుల్ని అధ్యయనం చేసి, సమగ్ర నివేదిక ఇవ్వాలని పవన్ ఆదేశించారు. సమస్య ఉన్న పరిశ్రమల్లో పొల్యూషన్ ఆడిట్ నిర్వహించాలని సూచించారు. తీరప్రాంత మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసి, 100 రోజుల ప్రణాళికలను తక్షణమే అమలు చేయాలన్నారు. కాకినాడ జిల్లా పరిధిలోని తీరప్రాంతంలో కాలుష్య నియంత్రణకు తీసుకునే చర్యలు దేశానికే మోడల్ కావాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ‘‘తీరప్రాంతంలో పరిశ్రమల నుంచి వచ్చే రసాయన వ్యర్థాలు తమ జీవనోపాధిని దెబ్బతీస్తాయని మత్స్యకారులు ఆందోళనలో ఉన్నారు. సముద్రంలో కలిసే వ్యర్థాలపై పర్యవేక్షణలో పారదర్శకత ఉండాలి. పర్యవేక్షక బృందాల్లో విద్యావంతులైన స్థానిక మత్స్యకార యువతకు అవకాశం కల్పించాలి. కాలుష్య కారక పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు సమీక్షించి, ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఆధునీకరించాలి. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంపై పారిశ్రామిక వేత్తలను సమాయత్తం చేయాలి’ అని ఆదేశించారు. అవసరాలకు తగ్గట్టు సిబ్బంది నియామకంపై సీఎంతో చర్చిస్తానని, ఉన్న సిబ్బందిని సమర్థంగా వినియోగించాలని సూచించారు. ఈ సమీక్షలో పీసీబీ చైర్మన్ పీ కృష్ణయ్య, సభ్య కార్యదర్శి శవరణన్, పర్యావరణ ఇంజనీర్లు పాల్గొనగా, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందుమాధవ్, మత్స్యకార ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.