Share News

Fishermen Issues: డిప్యూటీ సీఎం హామీతో మత్స్యకారుల దీక్ష తాత్కాలిక విరమణ

ABN , Publish Date - Sep 25 , 2025 | 07:16 AM

తీర ప్రాంతా ల్లో రసాయన పరిశ్రమల వల్ల మత్స్య సంపద అంతరించిపోవడంతో తమ జీవనోపాధికి ఆటంకం కలుగుతోందని, తమకు నష్టపరిహారం చెల్లించాల

Fishermen Issues: డిప్యూటీ సీఎం హామీతో మత్స్యకారుల దీక్ష తాత్కాలిక విరమణ

  • 10 లోపు ఉప్పాడ రాకుంటే మళ్లీ ఆందోళనకు సిద్ధం

కొత్తపల్లి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): తీర ప్రాంతా ల్లో రసాయన పరిశ్రమల వల్ల మత్స్య సంపద అంతరించిపోవడంతో తమ జీవనోపాధికి ఆటంకం కలుగుతోందని, తమకు నష్టపరిహారం చెల్లించాలని కాకినాడ జిల్లా కొత్తపల్లి మం డలం ఉప్పాడ బీచ్‌రోడ్డు సెంటర్‌లో మత్స్యకారులు చేపట్టిన ఆందోళన బుధవారం తాత్కాలికంగా విరమించారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను అక్టోబరు 2నుంచి 10వ తేదీలోగా ఉప్పాడ తీసుకొచ్చి మత్స్యకారులతో సమావేశపరుస్తామన్న జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి ఇచ్చిన హామీ మేరకు తాత్కాలికంగా ఆందోళన విరమించామని మత్స్యకార నాయకులు తెలిపారు. వచ్చే నెల 10వ తేదీలోగా డిప్యూటీ సీఎం ఉప్పాడ రాకుంటే యథావిఽధిగా ఆందోళన చేపడతామని మత్స్యకారులు హెచ్చరించారు. బుధవారం ఉదయం డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ ఆందోళన చేస్తున్న మత్స్యకారుల దగ్గరకు చేరుకుని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్న పాయింట్లను మత్స్యకారులకు వివరించి వేటకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.


సమస్యలు పరిష్కరిస్తా: డిప్యూటీ సీఎం

ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలన్నీ తన దృష్టిలో ఉన్నాయని, వాటి పరిష్కారానికి ఉన్నతాధికారులు, మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులతో కమిటీ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ హామీ ఇచ్చారు. కాలుష్య పరిశ్రమలవల్ల మత్స్యకారుల జీవనోపాధికి నష్టం వాటిల్లుతోందని రెండ్రోజులుగా చేస్తున్న ఆందోళనపై ఆయన స్పందించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం తాను శాసనసభ సమావేశాల కారణంగా వ్యక్తిగతంగా వచ్చి మత్స్యకారులతో చర్చించలేకపోతున్నానని, మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం రెండురోజుల నుంచి జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులతో చర్చిస్తున్నానని తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, ఫిషరీస్‌, రెవెన్యూ ఉన్నతాధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్‌తో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఆయా కమిటీల్లో మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులకు స్థానం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. సమస్యల పరిష్కారంతోపాటు జీవనోపాధి మెరుగుదల, తీరప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఈ కమిటీ దృష్టిపెడుతుందన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత స్వయంగా ఉప్పాడ వచ్చి మత్స్యకారులతో కూర్చొని అన్ని సమస్యలపై సమగ్రంగా చర్చిస్తానని తెలిపారు.

Updated Date - Sep 25 , 2025 | 07:17 AM