Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం
ABN , Publish Date - Oct 01 , 2025 | 04:31 AM
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనిలో ఉపరితల ఆవర్తనం కూడా విలీనమైంది.
రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశం
ఎల్లుండి తీరం దాటుతుందన్న వాతావరణ శాఖ
కోస్తాలో నేడు, రేపు వర్షాలు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనిలో ఉపరితల ఆవర్తనం కూడా విలీనమైంది. అల్పపీడనం వాయవ్యంగా పయనించి గురువారం నాటికి ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా మారనుంది. శుక్రవారం తెల్లవారుజామున ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశా మధ్య వాయుగుండం తీరం దాటనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో మంగళవారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో 4, కృష్ణా జిల్లా పెడనలో 3.95, అనకాపల్లి జిల్లా కొప్పాకలో 3.47, నర్సీపట్నం, కాకినాడల్లో 3.4 సెంటీమీటర్ల వాన పడింది. బుధవారం ఉత్తర కోస్తాలో, గురువారం కోస్తాలో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం మన్యం, అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయంది. కోస్తాలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. తీరం వెంబటి గంటకు 40-60కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
కృష్ణా, గోదావరిలో వరద ఉధృతి
కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతంగా ఉన్నట్టు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 6.69లక్షల క్యూసెక్కులు ఉండగా, 7 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 50.30 అడుగులకు చేరింది. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద కూడా రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉన్నట్టు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. బ్యారేజీ అన్ని గేట్లు ఎత్తి సముద్రంలోకి 10,96,937 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భద్రాచలం నుంచి రాజమహేంద్రవరంలోని అఖండ గోదావరిలోకి 12,51,999 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. కోనసీమ జిల్లాలోని లంక భూములను వరదనీరు ముంచెత్తుతోంది. లంక గ్రామాలకు రాకపోకలు ఒక్కొక్కటిగా నిలిచిపోతున్నాయి. పి.గన్నవరం మండలం చాకలిపాలెం వద్ద కనకాయలంక కాజ్‌వే వద్ద ప్రజానీకం నాటుపడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని పలు పల్లపు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. వందలాది ఎకరాల్లో మిరప పంట నీట మునిగి, భారీగా నష్టం ఏర్పడింది. పోలవరం ప్రాజెక్టు నుంచి 10,73,087 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు స్పిల్‌వే ఎగువన 33, దిగువన 24.600 మీటర్ల నీటిమట్టం నమోదైనట్టు జలవనరులశాఖ అధికారులు తెలిపారు.