Visakhapatnam: తీరం దాటిన వాయుగుండం
ABN , Publish Date - Jul 26 , 2025 | 05:35 AM
తీవ్ర అల్పపీడనం శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా బలపడి వాయవ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. తర్వాత రెండు, మూడు గంటల వ్యవధిలోనే పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ పరిసరాల్లో తీరం దాటింది.
దక్షిణ కోస్తా, సీమల్లోనూ వర్షాలు
వచ్చే వారం మరో అల్పపీడనం
పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
భద్రాచలం వద్ద 25.80 అడుగులు
పోలవరం నుంచి 2.51లక్షల క్యూసెక్కులు విడుదల
ఊపందుకున్న వరి నాట్లు,పత్తి, అపరాల సాగు
విశాఖపట్నం/అమరావతి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): తీవ్ర అల్పపీడనం శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా బలపడి వాయవ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. తర్వాత రెండు, మూడు గంటల వ్యవధిలోనే పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ పరిసరాల్లో తీరం దాటింది. రానున్న 24 గంటల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ దిశగా పయనించనుంది. వాయుగుండం ప్రభావంతో శుక్రవారం కోస్తాలో అనేకచోట్ల మేఘాలు ఆవరించాయి. ఉత్తరాంధ్రలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఉత్తర కోస్తాలోని ఓడరేవుల్లో మూడో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు. వాయుగుండం ఉత్తర ఒడిశా దిశగా రానున్నందున శుక్రవారం రాత్రి ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శనివారం ఉత్తర కోస్తాలో ఎక్కువచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 40-50కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కాగా, వాయుగుండం తూర్పు భారతం మీదుగా వాయవ్య భారతం వైపు పయనించి బలహీనపడిన తరువాత వచ్చే వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.

కోస్తాలో వాన ముసురు
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడం, వాయుగుండం ప్రభావంతో శుక్రవారం కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అల్లూరి జిల్లా ముంచింగిపట్టులో గరిష్ఠంగా 46 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో 10 మి.మీ. కన్నా ఎక్కువ వాన పడింది. శ్రీకాకుళం నుంచి పల్నాడు జిల్లా వరకు ముసురు వాతావరణం నెలకొంది. ఐదారు రోజులుగా కురుస్తున్న వర్షాలతో 17 జిల్లాల్లో వర్షపాతం మెరుగైంది. రాయలసీమలో మాత్రం వాన లోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో కోస్తాంధ్రలో వరి నాట్లు, పత్తి, అపరాల పంటల సాగు ఊపందుకుంది. ఇప్పటికే వేసిన ఖరీఫ్ పంటలు ఊపిరి పోసుకున్నాయని రైతులు చెబుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి అనిత
వాయుగుండం, భారీ వర్షాలపై శుక్రవారం తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏపీ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి వాయుగుండం ప్రభావ పరిస్థితిని మంత్రి సమీక్షించారు. సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, అధికారులతో మాట్లాడారు. కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాద హాట్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయం చేసుకుని, చెరువులు, కాలువలు, రోడ్లకు పడిన గండ్లను గుర్తించి, తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

గోదావరికి వరద పోటు
ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాలకు రెండు రోజులుగా గోదావరి నీటిమట్టం మళ్లీ క్రమక్రమంగా పెరగడం ప్రారంభించింది. ఉప నదులు శబరి, సీలేరు, మంజీర, పర్ణ, ఇంద్రావతి, కొండవాగుల జలాలు కలవడంతో శుక్రవారానికి నీటిమట్టం మరింత పెరిగింది. ప్రాజెక్టులోకి వస్తున్న 2,51,411 క్యూసెక్కుల జలాలను జల వనరుల శాఖ అధికారులు స్పిల్‌వే 48 గేట్ల నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ఎగువన 28.440 మీటర్లు, దిగువన 18.680 మీటర్లు నమోదైనట్టు తెలిపారు. ఎగువన భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 25.80 అడుగులకు చేరుకోవడంతో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని ముంపు గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కాగా, శుక్రవారం సాయంత్రానికి తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 10.90 అడుగులుగా నమోదైంది. కాటన్ బ్యారేజ్ ద్వారా 2,46,347 క్యూసెక్కులు సముద్రంలోకి ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద సుమారు 4లక్షల క్యూసెక్కుల వరద రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.