Department of Public Enterprises: ఉక్కు యాజమాన్యానికి షాక్
ABN , Publish Date - Dec 23 , 2025 | 05:17 AM
ఉద్యోగులకు నిర్దేశిత ఉత్పత్తి ఆధారంగా జీతాలు ఇవ్వాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంటు యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వ రంగ సంస్థల విభాగం (డీపీఈ) సీరియ్‌సగా స్పందించింది.
ఉత్పత్తి ఆధారిత వేతనాలపై డీపీఈ సీరియస్
సరైన చర్యలు చేపట్టాలని ఉక్కు మంత్రిత్వ శాఖకు ఆదేశం
విశాఖపట్నం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు నిర్దేశిత ఉత్పత్తి ఆధారంగా జీతాలు ఇవ్వాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంటు యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వ రంగ సంస్థల విభాగం (డీపీఈ) సీరియ్‌సగా స్పందించింది. ఇటీవల స్టీల్‌ప్లాంటులో 92 శాతం ఉత్పత్తి సాధించాలని యాజమాన్యం లక్ష్యం నిర్దేశించింది. వివిధ విభాగాల్లో సమస్యల వల్ల అధి సాధ్యం కాలేదు. ఉద్యోగులకు జీతాల్లో కోత పెడితే తప్ప సరైన ఫలితాలు రావని భావించిన యాజమాన్యం నవంబరు 15వ తేదీన ప్రత్యేక ఉత్తర్వులు జారీచేసింది. ప్రతి విభాగానికీ ఉత్పత్తి లక్ష్యాలు నిర్దేశించామని, వాటిని 100 శాతం సాధిస్తే పూర్తి జీతం ఇస్తామని, ఎంత తగ్గితే ఆ మేరకు జీతాల్లో కోత వేస్తామని స్పష్టంచేసింది. నవంబరు నెల జీతాలు ఆ విధంగానే పంపిణీ చేసింది. ఆ నెలలో 19 శాతం ఉత్పత్తి తగ్గింది. ఆ ప్రకారం విభాగాల వారీగా లెక్కించి జీతాలు ఇచ్చింది. నెలకు లక్ష రూపాయల జీతం తీసుకునే ఉద్యోగికి రూ.19 వేలు కోత పడింది. దీనిని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని, దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలోనూ ఇలా ఉత్పత్తి ఆధారిత జీతాలు లేవంటూ సెంట్రల్ లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా యాజమాన్యం వెనక్కి తగ్గలేదు. దీంతో స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ ఢిల్లీ వెళ్లి డీపీఈలో అధికారులను కలిసింది. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు జీతాలు పెంచాలన్నా, తగ్గించాలన్నా... డీపీఈ అనుమతి ఉండాలని, విశాఖ ఉక్కు యాజమాన్యం నిర్ణయాన్ని మీరు ఎలా అంగీకరించారని ప్రశ్నించారు. తాము జీతాల తగ్గింపుపై ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేదని అక్కడి అధికారులు తెలపడంతో వెంటనే సంఘం నాయకులు అక్కడికక్కడే డీపీఈకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డీపీఈ ఉన్నతాధికారులు ఉక్కుమంత్రిత్వ శాఖకు తాజాగా మెమో జారీ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో ఉత్పత్తి ఆధారిత జీతాల అంశంపై తక్షణమే సరైన నిర్ణయం తీసుకోవాలని, దానిని అధికారికంగా తమకు తెలియజేయాలని ఆదేశించింది. దీనిపై అధికారుల సంఘం ప్రతినిధులు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ, డీపీఈ ఆదేశాల ప్రకారమే ఉద్యోగుల నుంచి విద్యుత్ చార్జీలను యూనిట్ల లెక్కన వసూలు చేస్తున్నారని, గతంలో అండమాన్ పర్యటనల పేరుతో కొందరు తీసుకున్న మొత్తాలను కూడా డీపీఈనే రికవరీ చేసిందని తెలిపారు. అలాంటి సంస్థ ఆదేశాలు లేకుండా జీతాలు తగ్గించడం యాజమాన్యం తప్పిదమేనని, దీనిని తక్షణమే ఉపసంహరించుకోకపోతే న్యాయపోరాటం తప్పదని స్పష్టం చేశారు.