Dense Fog: ముంచెత్తుతున్న పొగమంచు..!
ABN , Publish Date - Dec 18 , 2025 | 04:02 AM
అసలే చలికాలం.. ఆపై పొగమంచు.. దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది..! సాధారణంగా డిసెంబరు నెలాఖరు నుంచి జనవరి/ఫిబ్రవరి నెలల్లో కురిసే పొగమంచు ఈ ఏడాది ముందుగానే..
దేశవ్యాప్తంగా స్తంభిస్తున్న జన జీవనం.. అనేక ప్రాంతాల్లో అధిక పీడన ప్రభావం..
తూర్పుగాలులు, వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ బలహీనం
ఈ ఏడాది ముందే కురుస్తున్న పొగమంచు
విశాఖపట్నం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): అసలే చలికాలం.. ఆపై పొగమంచు.. దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది..! సాధారణంగా డిసెంబరు నెలాఖరు నుంచి జనవరి/ఫిబ్రవరి నెలల్లో కురిసే పొగమంచు ఈ ఏడాది ముందుగానే... అది కూడా దట్టంగా కురవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా రవాణా వ్యవస్థపై ఇది అధిక ప్రభావం చూపుతోంది. తెల్లవారుజామున మూడు/నాలుగు గంటల నుంచి ఉదయం పది గంటల వరకూ పొగమంచు కమ్మేయడంతో జనజీవనం స్తంభిస్తోంది. పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవిసు ్తన్నాయి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అధికపీడనం, వర్షాలు కురిసేలా వెస్ట్రన్ డిస్ట్రబెన్స్‌లు బలహీనంగా మారడం, తూర్పుగాలుల ప్రభావం లేకపోవడం, స్థిరమైన వాతావరణ పరిస్థితులు నెలకొనడం వల్ల పొగమంచు దట్టంగా కురుస్తోందని వాతావరణ నిపుణుడొకరు విశ్లేషించారు. ఇంకా అనేక ప్రాంతాల్లో గడ్డకట్టేలా చలి కొనసాగడంతో పొగమంచు తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. కొద్దిరోజులుగా దేశం మొత్తం అధికపీడనం (యాంటీ సైక్లోన్) నెలకొని ఉంది. శీతాకాలంలో వాయవ్య భారతంలో మాత్రమే నెలకొనే అధికపీడనం ఈ ఏడాది దేశంలో అనేక ప్రాంతాలకు విస్తరించింది. అందువల్ల ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు, తూర్పు భారతం నుంచి పశ్చిమ భారతం వరకూ అనేక ప్రాంతాల్లో ఆకాశం నిర్మలంగా ఉంటోంది. పగటిపూట ఆకాశం నిర్మలంగా ఉండడం.. రాత్రి పూట భూమి వేగంగా చల్లబడడంతో అర్ధరాత్రి తర్వాత మంచు కురుస్తోంది. దీనికి వాతావరణంలోని కాలుష్యం తోడవడంతో అనేక ప్రాంతాల్లో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఉత్తరాదిలో ప్రధానంగా ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్‌తోపాటు దేశంలోని పారిశ్రామిక ప్రాంతాలు, నగరాలు, పట్టణాల్లో పొగమంచు కురుస్తోందని పేర్కొంటున్నారు. అధిక పీడనం ప్రభావంతోపాటు తూర్పుగాలులు, వెస్ట్రన్ డిస్ట్రబెన్స్‌లు బలహీనంగా ఉండడంతో పొగమంచు కురుస్తోందని వాతావరణ అధికారి సముద్రాల జగన్నాథకుమార్ తెలిపారు. కొన్నిచోట్ల బుధవారం విజిబిలిటీ 500 మీటర్ల కంటే తక్కువకు పడిపోయిందని పేర్కొన్నారు. బలమైన వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ సంభవిస్తే ఉత్తరాది నుంచి మధ్యభారతం వరకూ దాని ప్రభావం కొనసాగి వర్షాలు కురుస్తాయని, అలాంటప్పుడు పొగమంచు తక్కువగా కురుస్తుందని పేర్కొన్నారు.
జి.మాడుగులలో 5.4 డిగ్రీలు
రాష్ట్రంలో బుధవారం అనేక ప్రాంతాల్లో చలి ప్రభావం కొనసాగింది. పొగమంచు దట్టంగా కురిసింది. విశాఖ ఎయిర్‌పోర్టులో బుధవారం ఏడు గంటలకు విజిబిలిటీ 800 మీటర్లకు పడిపోయింది. ఏజెన్సీలో విజిబిలిటీ 200 మీటర్ల కంటే తక్కువకు పడిపోయింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 5.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.