Dense fog: కోస్తాను కమ్మేసిన మంచు!
ABN , Publish Date - Dec 19 , 2025 | 05:50 AM
రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను ముఖ్యంగా కోస్తాను గురువారం పొగ మంచు కమ్మేసింది. చలితీవ్రతతోపాటు తెల్లవారుజాము నుంచి ఉదయం...
అల్లూరి ఏజెన్సీలో 200 మీటర్లకు పడిపోయిన విజిబిలిటీ!
డుంబ్రిగుడలో 3.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత
విశాఖపట్నం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను ముఖ్యంగా కోస్తాను గురువారం పొగ మంచు కమ్మేసింది. చలితీవ్రతతోపాటు తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిది, తొమ్మిది గంటల వరకూ పలుచోట్ల మంచు దట్టంగా కురిసింది. విజిబిలిటీ మచిలీపట్నంలో 500 మీటర్లకు, విశాఖ ఎయిర్‌పోర్టులో 900 మీటర్లకు పడిపోయింది. అయితే అల్లూరి జిల్లా ఏజెన్సీలో 200 మీటర్ల లోపునకు విజిబిలిటీ పడిపోయినా ఆ విషయం రికార్డు కాలేదని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. కాగా, మధ్యభారతం దానికి ఆనుకుని ఏపీ, తెలంగాణల్లో తీవ్రమైన చలి కొనసాగింది. ప్రధానంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటకను ఆనుకుని ఉన్న కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడలో 3.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అల్లూరి జిల్లా అంతటా చలి తీవ్రత పెరగడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు.