CPI: ప్రమాదంలో ప్రజాస్వామ్యం
ABN , Publish Date - Aug 24 , 2025 | 05:07 AM
‘దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసింది. ఎన్నికల కమిషన్‌తో ఆ పార్టీ కుమ్మక్కై దొంగ ఓట్లతో...
దేశంలో అధికారంలోదొంగ ఓట్ల పార్టీ
రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం: నారాయణ
ఒంగోలులో సీపీఐ రాష్ట్ర మహాసభలు ప్రారంభం
ఒంగోలు, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): ‘దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసింది. ఎన్నికల కమిషన్‌తో ఆ పార్టీ కుమ్మక్కై దొంగ ఓట్లతో గద్దె మీద ఉండే ప్రయత్నం చేస్తుంది’ అని సీపీఐ నేతలు ధ్వజమెత్తారు. మూడు రోజుల పాటు ఒంగోలులో జరగనున్న సీపీఐ రాష్ట్ర మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు, శనివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సీపీఐ శ్రేణులతో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘రాష్ట్రంలో అఽధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, ప్రతిపక్షమైన వైసీపీ... మూడు పోటీపడి బీజేపీకి దాసోహం అంటున్నాయి. జనాభాలో అతి పెద్దది అయిన భారత్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. దానిని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో ప్రధాని మోదీ విఫలం కావడమే కాక బానిసగా మారాడు’ అని నారాయణ విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ మాట్లాడుతూ... ‘రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. కడప జిల్లాలో 79 శాతం స్థానిక సంస్థలను ఏకగ్రీవం చేసుకున్న జగన్ ఇప్పుడు పులివెందులలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు’ అని అన్నారు. సభ ప్రారంభానికి ముందు సురవరానికి నేతలు ఘనంగా నివాళులు అర్పించారు.